గ్రీన్‌ల్యాండ్ స్వాదీనం కోసం డెన్మార్క్‌కు అగ్రరాజ్యం బెదిరింపులు.. కొన్ని లక్షల మంది ఊబకాయులున్న అమెరికాపైనే ప్రభావం చూపించనున్నాయి. బెదిరింపులకు, ఊబకాయులకు సంబంధమేంటనే సందేహం వస్తోంది కదూ.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
గ్రీన్‌ల్యాండ్‌పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశం డెన్మార్క్ ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. గ్రీన్‌ల్యాండ్ ఖనిజ సంపదపై కన్నేసిన డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుంచే కొనుగోలు ఆలోచనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై అధికారాలున్న డెన్మార్క్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు విధిస్తామంటూ డెన్మార్క్‌ను హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమనే సంకేతాలూ ఇచ్చారు. అయినా గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్ బెదిరింపులు డెన్మార్క్‌ను ప్రభావితం చేయడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్ దగ్గర కీలక ఆయుధాలున్నాయి. వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఔషదం ఓజెంపిక్, రెండోది పిల్లలకు ఇష్టమైన లెగో బొమ్మల ఎగుమతులు.
ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులు అమెరికాలోనే..
ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయం రేటు అమెరికాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 23 అమెరికన్ రాష్ట్రాల్లో, ముగ్గురు పెద్దల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (35%) ఊబకాయంతో బాధపడుతున్నారు. డానిష్ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవి మందులు.. అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 2021 నుంచి 2023 వరకు అమెరికాలో ఓజెంపిక్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 400 శాతం పెరిగింది. ఇప్పటికే అమెరికన్లు ఒక ఓజెంపిక్ ప్యాకెట్ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు.
బీమా, డిస్కౌంట్లు లేకుండా అది కాస్తా 1300 డాలర్లు అవుతుంది. ఒకవేళ అమెరికా ఈ మందులు తయారు చేయాలనుకున్నా.. ఓజెంపిక్, వెగోవిలకు అవసరమైన సెమాగ్లుటైడ్ డెన్మార్క్‌లోనే తయారవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికే ఈ మందుల ధర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్‌పై భారీ సుంకాలు విధిస్తే ఓజెంపిక్, వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆ ఒక్కటే కాదు.. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం 2023లో డెన్మార్క్ నుంచి 5.7 బిలియన్ డాలర్ల విలువైన మందులు, వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్‌ను అమెరికా దిగుమతి చేసుకుంది.
డెన్మార్క్ కేంద్రంగా లెగో గ్రూప్...
ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్ కూడా డెన్మార్క్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ. అంతేకాదు.. అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్‌దే అగ్రస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment