Obesity people
-
World Anti-Obesity Day: ఊబకాయం తగ్గేదెలా?
'ప్రస్తుత సమాజంలో ఊబకాయం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఆరోగ్య సమస్యల్లో ఇది ప్రధాన సమస్యగా మారుతోంది. మారుతున్న జీవన విధానంలో ఆహార అలవాట్లు మారుతుండటం ఊబకాయం (ఒబెసిటీ) వ్యాధికి కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం ఇందుకు కారణం. పెద్దలతో పాటు చిన్నారులు ఊబకాయం బారినపడడం ఆందోళన కల్గిస్తుంది. ఈనెల 4న ప్రపంచ ఊబకాయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న కథనం'. సమస్య ఇలా.. పెద్దవారితో సహా, చిన్నపిల్లలు 20 శాతం ఈ ఊబకాయం వ్యాధి బారినపడుతున్నారు. నెయ్యి, డాల్డా, నూనె అధిక మోతాదులో కలిసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినటంతో రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఊబకాయ బాధితుల్లో 40 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు వీరిని పట్టిపీడిస్తున్నాయి. పక్షవాతం, నరాల సమస్యలు వంటివి దారితీస్తున్నాయి. గత పదేళ్లలో ఆహార అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల చిన్నారుల్లో ఊబకాయ సమస్య తీవ్రంగా ఉంది. ముందు జాగ్రత్తలు.. సమతుల్యమైన ఆహారపు అలవాట్లు రోజు తీసుకోవాలి. వ్యాయమాన్ని కొనసాగిస్తే బరువు పెరగకుండా కాపాడుకోగలుగుతాం. ఒబెసిటీకి గురయ్యాక చేసే వర్కవుట్ల కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ బి.రవికుమార్, ఎండీ, జనరల్ మెడిసిన్, నిర్మల్ వ్యాయమాలు చేయాలి.. చాలామంది ఒబెసిటీకి గురవుతుంటారు. మొదటి నుంచే బరువు పెరుగకుండా సమతుల్యత పాటిస్తే ఊబకాయాన్ని కచ్చితంగా నివారించవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, రోజు వ్యాయమాలు చేయాలి. – ఎండపల్లి అశోక్ కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు, నిర్మల్ జాగ్రత్తలు ఇవే.. ఊబకాయ సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే వారంలో రెండు రోజులు ఉపవాసం చేయాలి. 20 ఏళ్లు దాటినవారు ప్రతీరోజు 2,500 కేలరీలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్న ఈ కేలరీలు దాటకుండా చూసుకోవాలి. మిగిలిన రెండు రోజుల్లో కేవలం పావు వంతు అంటే 500 కేలరీలు మాత్రమే తీసుకోవాలి. కార్పొహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలతోపాటు అన్నానికి బదులు రాగి, జొన్న, చేపలు, చికెన్ తీసుకోవాలి. కాఫీ టీ తీసుకోవచ్చు. తరచూ నీటిని తాగుతూ ఉండాలి. ఇవి చదవండి: మగపిల్లల పెంపకం! -
మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ!
ఆఫర్లంటే ఇష్టపడని వారుండరు. అందుకే కంపెనీలు, రెస్టారెంట్లు సైతం డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నమైన ఆఫర్‌తో కస్టమర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఇలాంటి ఆఫర్ ప్రకటించినందుకు కొంత మంది తిట్టుకుంటున్నారు కూడా. అసలు ఈ రెస్టారెంట్ కథేంటంటే... అమెరికాలో హార్ట్ ఎటాక్ గ్రిల్ అనే రెస్టారెంట్ ఉంది. హాస్పిటల్-థీమ్ సర్వీస్ కారణంగా ఈ రెస్టారెంట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో వెళ్లి చూస్తే అచ్చం ఆసుపత్రిలానే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వంట చేసేవాళ్లు, వడ్డించేవారు డాక్టర్లు, నర్సుల్లా తెల్లకోటు ధరించి ఉంటారు. మగవారైతే డాక్టర్లుగా, ఆడవారు నర్సుల్లా పనిచేస్తుంటారు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ రెస్టారెంట్లో తినాలనుకుంటే కస్టమర్లు సైతం పేషంట్లలా తయారవ్వాలి. హార్ట్ ఎటాక్ గ్రిల్‌లోని మెనూలోకి వస్తే, ఇందులో కూడా క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్ల వంటి పేర్లుతో కనిపిస్తాయి. ఇటీవల ఈ రెస్టారెంట్ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది 158 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి ఉచితంగా రుచికరమైన ఆహారాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇంకేముందు లావుగా ఉన్నవాళ్లు డైటింగ్ పక్కన పెట్టి ఇందులో ఈటింగ్ మొదలుపెట్టారు. బంఫర్ ఆఫర్‌ను వదులుకోలేక ఆమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెస్టారెంట్‌కి వెళ్లి లాగించేస్తున్నారు.ఈ తరహా ఆఫర్లను ఇవ్వడమంటే అది ఊబకాయాన్ని ప్రోత్సహించడమేనని కొందరు భావించారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వారి జీవితాలను రిస్క్‌లో పెడుతున్న ఈ రెస్టారెంట్‌ను మూసివేయాలని ట్విటర్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నెట్టింట ఈ రెస్టారెంట్‌పై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ఇంత జరుగుతన్నా ఈ రెస్టారెంట్ కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్! -
బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం
అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది. పట్టణాల్లోనే అధికం.. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జంక్‌ఫుడ్‌తో అసలు సమస్య కార్పొరేట్ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది. క్యాన్సర్ వచ్చే అవకాశం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్‌లో టైప్–2 డయాబెటీస్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది. –డాక్టర్ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్‌క్రీమ్‌లు, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు వ్యాయామం తప్పనిసరి ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్‌లు, వాకింగ్‌కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది. ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
గ్రామీణుల్లో పెరుగుతున్న ఊబకాయం
గ్రామీణ ప్రాంతాల్లో ఊబకాయం,అధిక బరువు పెరగడానికి 80 శాతం ఆహారపుఅలవాట్లు, సంప్రదాయ ఆహారాన్ని విస్మరించడమేనని ఎన్‌ఐన్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య, లండన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యాపకులు ప్రొఫెసర్ మజీద్ ఇజ్జతి తమ పరిశోధనల్లో వెల్లడించారు. తార్నాక: అధిక బరువు.. ఊబకాయం.. స్థూలకాయం.. పేరేదైనా మనిషిని ఇబ్బంది పెట్టే తీవ్రమైన సమస్య. అత్యధిక మంది నగర వాసులను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. సమయానికి నిద్ర లేకపోవడం సరైన తిండి తినకపోవడం.. అధిక పని ఒత్తిడి.. జంక్‌ఫుడ్ తదితర సమస్యలతో ఇప్పటి వరకు ఊబకాయం నగర వాసులను పట్టిపీడిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ సమస్య భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర రూపం దాలుస్తున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ అభివృద్ధి చెందుతున్న, మధ్య ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లోని గ్రామీణప్రాంత ప్రజల్లో ఊబకాయంపై పరిశోధనలు చేసింది. ఈ మేరకు భారతదేశంలో గ్రామాల్లో సేకరించిన డేటాను తార్నాకలోని ఐసీఎంఆర్–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌నూట్రీషన్(ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఇటీవల లండన్ కళాశాలకు అందజేశారు.అందులో మన గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కరమైన నిజాలు వెలుగు చూశాయి. 112 మిలియన్ల మందిపై అధ్యయనం మనిషి శరీరాన్ని అతడి బరువు, ఎత్తు, ఆకృతి, ఇతర అంశాలను ఆధారంగా కొలుస్తారు. దాన్ని ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అంటారు. ఊబకాయం, అధిక బరువుపై ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో వేయి మంది పరిశోధనా విద్యార్థులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 112 మిలియన్ల యువతపై అధ్యయనం చేశారు. 1985 నుంచి 2017 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ అధ్యయనంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లోనే ఊబకాయం, అధిక బరువు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీఎంఐ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల్లో ఉండాల్సి కనీస బరువుకంటే 5 నుంచి 6 కేజీలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో పట్టణ ప్రాంత ప్రజల్లో గ్రామీణుల్లో కంటే ఊబకాయం తక్కువగా ఉన్నట్లు నమోదైంది. భారతదేశంలోనూ పరిశోధనలు మనదేశంలో ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పలు రాష్ట్రాల్లో 1.2 లక్షల మందిపై అధ్యయనం చేశారు. భారతదేశంలో 1975–79 మధ్య జరిగిన అధ్యయనంలో 16.5 కేజీల (మీటర్ స్వేర్–ఎం 2) బరువు నమోదు కాగా, అది 2012 నాటికి 18.5 కేజీ (మీటర్ స్వేర్–ఎం 2)లకు పెరిగింది. అత్యధికంగా బరువు పెరిగిన రాష్ట్రాల్లో కేరళ (3.8 కేజీ), పశ్చిమ బెంగాల్(2.6 కేజీ), ఆంధ్రప్రదేశ్ (2.6 కేజీ) ఉంగా, అత్యల్పంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో నమోదైనట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 32 ఏళ్ల అధ్యయనంలో గ్రామీణ ప్రాంతంలోని పురుషుల్లో ఊబకాయం, అధిక బరువు 2 శాతం నుంచి 12 శాతానికి పెరగ్గా, మహిళల్లో 4 నుంచి 16 శాతానికి పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. అంటే పురుషులు కంటే మహిళలు దాదాపు 2 కేజీల బరువు అధికంగా పెరిగారు. పోషకాహారలోపమే కారణం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం, అధిక బరువు పెరడగానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, పోషకాçహారలోపాలే కారణమని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారంలో తక్కువ మోతాదులో పోషకాలు ఉండటం, పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్, నట్స్ తినకపోవడం, అన్నిరకాల పోషకాలు కలిగిన పాలు, పాల పదార్థాలు తినకపోవడం వల్లనే ఊబకాయం, అధిక బరువు, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత పేర్కొన్నారు. ప్రజలకు పోషకాహారం అవగాహన కల్పించాలని, తద్వారా ఇలాంటి ఆరోగ్య సమస్యలకు కళ్లెం వేయవచ్చన్నారు. -
అమెరికాలో 40 శాతం ఊబకాయులు
న్యూయార్క్: అమెరికాలో ఊబకాయుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మగవాళ్లలో ఊబకాయుల సంఖ్య నిలకడగా కొనసాగుతుండగా, మహిళల్లో రోజు రోజుకు ఈ సమస్య తీవ్రమవుతోందని ఓ అధ్యయనంలో తేలింది. 2013–2014 సంవత్సరాల మధ్య పురుషుల్లో ఊబకాయుల సంఖ్య దేశ జనాభాలో 35 శాతం ఉండగా, మహిళల్లో 40 శాతం ఉన్నట్లు జమా పత్రికలో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా 2005 నుంచి 2014 మధ్యకాలంలోనే మహిళల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 12 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో గత 25 ఏళ్ల కాలంలో ఊబకాయ సమస్య స్వల్పంగా పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు. రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య తగ్గిందని, ఆరు నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల్లో సమస్య నిలకడగా ఉందని వారు చెప్పారు. మూడు దశాబ్దాలుగా అమెరికాను వేధిస్తున్న ఈ ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు పరిశోధనలు, మెడికల్ కేర్ కోసం అమెరికా ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టింది. 2005 నుంచి 2012 మధ్యకాలంలో 21,013 మందిని చేసిన ఇంటర్వ్యూలను అధ్యయనం చేయడం, 2013–14 సంవత్సరాల మధ్య 2,638 మంది మగవాళ్లను, 2,817 మంది మహిళలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ‘నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటటిక్స్, సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’కు చెందిన నిపుణులు ఈ వివరాలను సేకరించారు.