పెద్దన్నల రూట్‌ మారితే.. | Cold War Between America And China Troubles India | Sakshi
Sakshi News home page

పెద్దన్నల రూట్‌ మారితే..

Published Sat, May 20 2023 1:19 AM | Last Updated on Sat, May 20 2023 4:06 AM

Cold War Between America And China Troubles India - Sakshi

అమెరికా, చైనా మధ్య తుది ఘర్షణ చోటు చేసుకుంటే ఇది భారతదేశానికి వ్యూహాత్మక విన్యాసానికి చోటు లేకుండా చేస్తుంది. స్నేహితుడు, ప్రత్యర్థి ఇద్దరి నుంచీ ‘నువ్వు ఉంటే మాతో ఉండు లేదా వ్యతిరేకంగా ఉండు’ అనే ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా అమెరికా, చైనా మధ్య సంబంధాల ‘స్థిరీకరణ’ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు చైనా అప్రకటిత మద్దతు చెప్పడం కూడా వీటిని ఆపడం లేదు. ఈ పరిణామాలపై అప్పుడే భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ భారత్‌ ప్రయోజనాలపై ఇవి ప్రభావం చూపుతాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా, నిర్దిష్టంగా అంచనా వేయాల్సి ఉంటుంది.

గత కొన్ని సంవత్సరాలుగా, తన ప్రపంచా ధిపత్యానికి చైనా ముప్పు కలిగిస్తూ ఎదుగు తోందని అమెరికా గ్రహిస్తోంది. రెండు దేశాల మధ్య బలాబలాల అంతరం క్రమంగా క్షీణిస్తోంది. ఆర్థిక, సైనిక, సాంకేతికపరమైన ప్రతి శక్తి కొలమానంలోనూ ఇది కనిపిస్తోంది. ప్రపంచంలోనే చైనా రెండో అతిశక్తిమంతమైన దేశం. అమెరికాను అగ్రపీఠం నుంచి తప్పించి తాను నంబర్‌ వన్‌ దేశంగా మారాలన్న తన ఆకాంక్షను వ్యక్తపర్చే విషయంలో చైనా ఏమాత్రం మొహమాటపడదు. కాబట్టి రెండు దేశాల మధ్య ఘర్షణ వ్యవస్థీకృతంగానే ఉంటోంది. పరివర్తన చెందుతున్న భౌగోళిక రాజకీయ వ్యవస్థ కేంద్రంగా తాను ఆవిర్భవించడం అనివార్యమని చైనా అభిప్రాయం. దీన్ని వెనక్కి తిప్పలేకపోయినా, కనీసం ఈ పరిణామాన్ని ఆపాలని అమె రికా కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎవరు నెగ్గుతారు అనేది స్పష్టం కావడం లేదు కానీ, దీని పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఆసియా దేశాలపై ప్రభావం చూపుతాయి. ఈ కారణం చేత, అమెరికా–చైనా సంబంధాలలోని పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే అవి భారత్‌ భౌగోళిక రాజకీయ అవకాశాలపై గణనీయంగా ప్రభావితం చూపుతాయి.

నేను భారత్‌ దృక్కోణాన్ని అందిస్తాను. అన్ని రకాల ఘర్షణ, కుట్రల కోణంలో చూస్తే– అమెరికా, చైనా సంబంధాలు చివరి ఘర్షణ వైపుగా పయనిస్తున్నాయని అనుకోవచ్చు. కానీ ఈ తుది ఘర్షణ భారతదేశానికి ఒక వ్యూహాత్మక విన్యాసానికి చోటు లేకుండా చేస్తుంది. స్నేహితుడు, ప్రత్యర్థి ఇద్దరి నుంచీ ‘నువ్వు ఉంటే మాతో ఉండు లేదా వ్యతిరేకంగా ఉండు’ అనే ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎత్తుగడల రీత్యా అయినా సరే... నిర్దిష్ట ప్రభావిత రంగాలను గుర్తించడం ద్వారా తమ మధ్య పోటీని నియంత్రించడానికి రెండు పార్టీలూ తీసుకునే నిర్ణయం నుంచే అమెరికా, చైనా మధ్య పొత్తు సంభవించవచ్చు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, నాటి సోవియట్‌ యూనియన్‌ మధ్య జరిగింది ఇదే. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు చైనా తూర్పు ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా నొక్కి చెప్పుతుంది, అదే సమయంలో పశ్చిమార్ధగోళంలో అమెరికా ప్రాభవాన్ని అంగీకరిస్తుంది. చైనీస్‌ వ్యూహకర్తలు తరచుగా ఈ దోపిడీ విభజనను పశ్చిమ పసిఫిక్‌ మధ్య గీత గీయడం ద్వారా నొక్కి చెబుతారు. అప్పుడు హిందూ మహాసముద్రం వ్యూహాత్మకంగా చైనా ప్రభావంలో పడిపోతుంది. ఇది భారత్‌కు శాపం అవుతుంది. ఈ ఆకస్మికత అసంభవంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని పూర్తిగా తోసి పుచ్చకూడదు.

ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాల్లోని ఇటీవలి కొన్ని పరిణామాల ప్రాధాన్యత ఏమిటి?  మే 10, 11న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్, చైనా ప్రభుత్వ కౌన్సిలర్, మాజీ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీని వియన్నాలో కలిశారు. ‘యుఎస్‌– చైనా ద్వైపాక్షిక సంబంధం, అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా సమస్యలకు సంబంధించిన కీలక అంశాలపై నిష్కపటమైన, వాస్తవి కమైన, నిర్మాణాత్మక చర్చలు జరిగా’యని వైట్‌ హౌస్‌ నివేదించింది. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం, తైవాన్‌ సమస్య తదితర అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలిపింది.

ఈ చర్చలను వివరించడానికి చైనా షిన్వా న్యూస్‌ ఏజెన్సీ కూడా ఇదేవిధమైన పదజాలాన్ని ఉపయోగించింది. ౖ‘చెనా–అమెరికా సంబంధాల్లోని అవరోధాలను తొలగించి, స్థిరీకరించడంపై ఇరుపక్షాల మధ్య నిష్కపటమైన, లోతైన, వాస్తవికమైన, నిర్మాణాత్మక చర్చలు జరిగా’ యని నివేదించింది. ఇది అమెరికా, చైనా మధ్య వివిధ స్థాయిల్లో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాల్లో చర్చలు, సంభాషణల పునరుద్ధరణకు మార్గాన్ని సుగమం చేసింది. అమెరికా వాతావరణ విభాగానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత జాన్‌ కెర్రీని చైనా సందర్శనకు ఆహ్వానించారని నివేదించారు కూడా. అమె రికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్‌ తాయ్‌ మే 25–26 తేదీల్లో డెట్రా యిట్‌లో జరగనున్న అపెక్‌ వాణిజ్య మంత్రుల సమావేశంలో చైనా వాణిజ్యమంత్రి వాంగ్‌ వెన్‌ తావోతో చర్చలు జరపనున్నారు. జూన్‌ నెలలో సింగపూర్‌ లోని షాంగ్రి–లా చర్చల్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్, చైనా రక్షణమంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫుతో భేటీ కానున్నారు. చైనాలో నూతన రాజకీయ ప్రతినిధులతో కమ్యూనికేషన్‌ ఛానల్స్‌ ఏర్పాటుపై అమెరికా ఆసక్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజింగ్‌ కొత్త నాయకత్వంలో అనేక కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చైనా పక్షం ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏప్రిల్‌ 20న జాన్‌ హాప్కిన్‌ ్స యూనివర్సిటీలో చేసిన, జాగ్రత్తగా రూపొందించిన ప్రసంగంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ ఎల్లెన్, అమెరికా–చైనా పొత్తులో ఈ నూతన దశ గురించి సంకేతాలిచ్చారు. ‘సంపద్వంతమైన చైనా... అమెరికాకు, ప్రపంచానికి కూడా మంచిదే కాబట్టి పెరుగుతున్న చైనా సంపద ప్రమాదకరమని అమెరికా ఏమాత్రమూ భావించడంలే’దని ఎల్లెన్‌ ఆ ప్రసంగంలో వివరించారు. చైనా నుంచి మన ఆర్థిక వ్యవస్థను విడగొట్టాలని అమెరికా చూడటం లేదని ఆమె చెప్పారు. ‘మన రెండు ఆర్థిక వ్యవస్థలూ సంపూర్ణంగా వేరుపడిపోతే అది రెండు దేశాలకూ వినాశకరమవుతుంది, అది తక్కిన ప్రపంచాన్ని కూడా అస్థిరపరుస్తుంది’ అని ఆమె చెప్పారు. ఈ అంశాన్ని నొక్కి చెప్పడానికిగానూ, అమెరికా–చైనా వాణిజ్యం ప్రస్తుతం 750 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని ఆమె తెలిపారు.

ఇది దేన్ని సూచిస్తుంది? ఉక్రెయిన్‌ తో యుద్ధంలో రష్యాకు చైనా నిశ్శబ్ద మద్దతు ప్రకటించడం అనేది చైనాతో సంబంధాల ‘స్థిరీకరణ’ కోసం అమెరికా చేపట్టిన ఈ ముఖ్యమైన చర్యను  నిరోధించలేదు. ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక దిశకు దారితీసిన తైవాన్‌ సమస్య ఇప్పుడు కాస్త సద్దుమణిగిననట్లు కనిపిస్తోంది. చైనా పక్షం నుంచి కూడా దీనిపై కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. తైవాన్‌ స్థితి గీత దాట కూడని బాటమ్‌ లైన్‌ కి ప్రాతినిధ్యం వహిస్తోందనీ, అది అమెరికా, చైనా సంబంధాల సంపూర్ణత్వాన్ని సూచించదనీ చైనా పేర్కొంది. స్పష్టంగానే, తైవాన్‌ జలసంధిలో ప్రమాదకరమైన ఘర్షణ నుంచి వెనక్కు మళ్లాలని ఇరు పక్షాలూ నిర్ణయించుకున్నాయి. 
అమెరికా తీసుకున్న చొరవ తర్వాత  గత నెలలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మెక్రాన్‌ చైనాను సందర్శించారు. ఉక్రెయిన్‌పై చైనా వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ ఇది చైనాను బుజ్జగించ డానికి సంబంధించినదే అనడంలో సందేహం లేదు. చైనాను ‘వ్యవస్థీకృత’ ప్రత్యర్థిగా నిర్వచించినప్పటికీ, ఫ్రాన్స్‌, జర్మనీ రెండూ చైనాతో సంబంధాలు కొనసాగాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి.

భారత్‌ ఈ పరిణామాల పట్ల ఆందోళన చెందాల్సిందేనా? బహుశా ఈ దశలో అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ పరిణా మాలన్నీ ఏ దశను అనుసరిస్తాయో ఇంకా స్పష్టం కావడం లేదు. పైగా ఏదో అంశంపై తిరిగి ఘర్షణ ఏర్పడటం ద్వారా లేదా వివాదాస్పద సమస్య ద్వారా అమెరికా, చైనా బంధాలు మళ్లీ పట్టాలు తప్పుతాయా అన్నది కూడా అస్పష్టమే. అయితే ఇవి ఎలా పరిణమిస్తాయన్నదే భారత్‌ ప్రయోజనాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా, నిర్దిష్టంగా అంచనా వేయాల్సి ఉంటుంది. కాకతాళీ
యంగా, చైనాతో సాయుధ ఘర్షణ సంభవించిన పక్షంలో భారత్‌పై అమెరికా పెద్దగా ఆధారపడి లేదని అమెరికాలో పలు వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. అంటే అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించు కోవడంపై భారత్‌ ప్రతిస్పందనల పట్ల అమెరికా పెద్దగా సావధానత చూపదని ఇది సూచిస్తుంది. 


శ్యామ్‌ శరణ్‌,  వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement