
గ్రీన్‌లాండ్ ప్రజలకు జె.డి.వాన్స్ పిలుపు
గ్రీన్‌లాండ్: ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలన్నదే డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్‌లాండ్ ప్రజలకు సూచించారు. జె.డి.వాన్స్ శుక్రవారం తన భార్య ఉషా వాన్స్‌తో కలిసి గ్రీన్‌లాండ్‌లో పర్యటించారు. డెన్మార్క్‌తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్‌లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని రక్షించే పరిస్థితిలో డెన్మార్క్ లేదని అన్నారు.
ఇతర దేశాల ఆక్రమణల నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్‌లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్‌లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్ ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌లో 57 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.