గ్రీన్‌ల్యాండ్‌కు జేడీ వాన్స్‌ పర్యటన.. పొలిటికల్‌ టెన్షన్‌ | USA JD vance Greenland visit | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ల్యాండ్‌కు జేడీ వాన్స్‌ పర్యటన.. పొలిటికల్‌ టెన్షన్‌

Published Thu, Mar 27 2025 7:27 AM | Last Updated on Thu, Mar 27 2025 7:27 AM

USA JD vance Greenland visit

వాషింగ్టన్‌: డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల ‘గ్రీన్‌ల్యాండ్‌’ను కొనేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ డెన్మార్క్‌ ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించేలా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రవర్తించారు. అనధికార పర్యటనలో భాగంగా గ్రీన్‌ల్యాండ్‌కు వాన్స్‌ భార్య ఉషా గురువారం వెళ్లి శనివారం తిరిగిరానున్నారు. అయితే భార్యతో వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని వాన్స్‌ మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ల్యాండ్‌ అంశాన్ని ప్రస్తావించారు.

ఈ క్రమంలో వాన్స్‌ మాట్లాడుతూ..‘భార్య ఒక్కతే ఆనందంగా ఉంటే సరిపోతుందా. నేను కూడా ఆమెతోపాటు గ్రీన్‌ల్యాండ్‌కు వెళ్తా. గ్రీన్‌ల్యాండ్‌ పర్యటనలో భాగంగా అక్కడి వాయవ్య పిటిఫిక్‌ భూభాగంలోని అమెరికా వైమానిక స్థావరాన్ని సందర్శిస్తా. అధ్యక్షుడు ట్రంప్‌ తరఫున మాట్లాడుతున్నా. గ్రీన్‌ల్యాండ్‌ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రీన్‌ల్యాండ్‌ భద్రత అనేది పరోక్షంగా యావత్‌ ప్రపంచ భద్రతకు సంబంధించింది’ అని అన్నారు.

దీంతో డెన్మార్క్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘ప్రైవేట్‌గా లేదంటే ప్రభుత్వం తరఫున ఎవరినీ మా దేశంలోకి అనుమతిస్తూ ఆహ్వానాలు పంపలేదు’ అని గ్రీన్‌ల్యాండ్‌ సర్కార్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌పెట్టింది. ‘పిలవకుండా వచ్చి మమ్మల్ని అనవసర ఒత్తిడికి గురిచేయాలని అనుకుంటున్నారు’ అని డెన్మార్క్‌ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిసిమియట్‌ పట్టణంలోని అవన్నాటా క్విమిసెర్సూ శునకాల స్లెడ్జ్‌ బండ్ల పరుగుపోటీని, గ్రీన్‌ల్యాండ్‌ సంస్కృతి, సంప్రదాయాలను స్వయంగా వీక్షించేందుకు అక్కడ పర్యటిస్తానని ఉషా గతంలో చెప్పడం తెలిసిందే. గ్రీన్‌ల్యాండ్‌లో లిథియం వంటి ఖనిజ నిల్వలు అపారం. వీటిని దక్కించుకునేందుకు ట్రంప్‌ కుయుక్తులు పన్నారని డెన్మార్క్‌ ప్రభుత్వం గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంలో డెన్మార్క్‌కు నాటో సభ్య దేశాలు సైతం మద్దతు పలికాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement