చేతులు తడవకుండానే పదోన్నతులు కల్పించాం
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇక కలపబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రం విడిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో గ్రేస్ మార్కులు కలిపామని, ఇకపై అలాంటిదేమీ ఉండదన్నారు. తాజాగా వైద్యులకు ప్రొఫెసర్‌లుగా పదోన్నతులు చేతులు తడవకుండా కల్పించామని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్‌ను తానెప్పుడూ కలవలేదని, వాళ్ల పనితీరును బట్టే చెల్లింపులు చేస్తున్నామన్నారు. మిగతా పథకాలకు నిధులు ఆపేసి మెడాల్‌కు మాత్రమే ఏడాదిలో రూ.102 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించగా.. మెడాల్ సంస్థ పనితీరు అద్భుతంగా ఉందని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలకు అవార్డు కూడా వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు.
వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌కు అవార్డు
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ గురువారం హరియాణా హిస్సార్‌లోని చౌదరీ చరణ్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారత వ్యవసాయ ఇంజనీర్ల సమాఖ్య మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయనకు నేషనల్ ఫెలోషి‹ప్ అవార్డును అందజేయనున్నట్టు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇంద్రమణి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తకు గత 20 ఏళ్లలో ఇటువంటి పురస్కారం లభించడం ఇదే తొలిసారి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసించిన డాక్టర్ సత్యనారాయణ నీటి యాజమాన్య సంస్థ, ఉప్పునీటి పరిశోధన కేంద్రం, భూగర్భ మురుగు నీటి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఈ అవార్డు రావడంపై వర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఏపీలో సెంచూరియన్ యూనివర్సిటీ: వీసీ
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా ఒడిశాలోని పర్లాకిమిడి, భువనేశ్వర్‌లలో ఉన్న తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరిస్తున్నట్టు సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎస్‌ఎన్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం వద్ద ఉన్న తాత్కాలిక క్యాంపస్‌ను విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని విశాఖలో బుధవారం విలేకరులకు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ తరగతులను నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చాన్సలర్ పి.పట్నాయక్ మాట్లాడుతూ ఏపీలో తమ విశ్వవిద్యాలయం ప్రత్యేకత పొందుతుందన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీకి రూ.130 కోట్లు వెచ్చించబోతున్నామని చెప్పారు. తమ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ–రిక్షాల అమ్మకానికి అనుమతి లభించిందని తెలిపారు.
గ్రేస్ మార్కులు కలిపేది లేదు : కామినేని
Published Thu, Feb 16 2017 3:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
Advertisement
Advertisement