సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ కౌన్సెలింగ్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ, పేపర్ లీక్, మూల్యాంకనంలో వ్యత్యాసాలపై దాఖలైన పలు పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. నీట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ పిటిషన్లపై తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కోరారు.
గ్రేసు మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించనున్న పరీక్షపై స్టే ఇవ్వాలని మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. గ్రేసు మార్కులు పొందిన అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించే పరీక్షతోపాటు వచ్చే నెల 6న జరిగే కౌన్సెలింగ్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది.
అడ్మిషన్ల ప్రక్రియ తుది తీర్పునకు లోబడే ఉంటుందని వ్యాఖ్యానించింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు ఈ పిటిషన్లను జత చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. వేర్వేరు హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీం నోటీసులిచ్చింది. హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్నపిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయా హైకోర్టుల్లో విచారణలపై స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment