టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’  | High Court no for re scheduling of exams | Sakshi
Sakshi News home page

టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’ 

Published Sat, Feb 24 2024 4:17 AM | Last Updated on Sat, Feb 24 2024 4:17 AM

High Court no for re scheduling of exams - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్‌టీ), ఏపీ టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్త­ర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవ­హారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా­లని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

 టీఆర్‌టీ, టెట్‌ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్‌టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్‌ పరీక్ష నిర్వహణ­కు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు.

టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్‌టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్‌ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్‌టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్‌ పరీక్ష సిలబస్‌ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోద­న్నారు. టీఆర్‌టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు.

నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షల­ను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్‌ను ఖరారు చేసే­లా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు­లు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement