
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది జిల్లాలను 31 జిల్లాలకు పెంచి ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) ఎలా నిర్వహిస్తారని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలకే ఆమోదం ఉంది కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తే.. అభ్యర్థి ఒక జిల్లాలోనే స్థానికుడు అవుతాడని, పాత జిల్లాకు చెందిన మిగిలిన రెండు జిల్లాల్లో స్థానికేతరుడు అవుతాడు కదా అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. జిల్లాల సంఖ్య పెంపు వల్ల అభ్యర్థులకు నష్టం రాదనే ప్రభుత్వ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. పది జిల్లాలను రెండు మూడు జిల్లాలుగా తగ్గించినప్పుడు అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పది జిల్లాల ప్రస్తావన ఉంటే కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 31 జిల్లాలకు ప్రకటన ఎలా జారీ చేస్తారో చెప్పాలని సూచించింది. 31 జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదు కాబట్టి టీఆర్టీ పాత పద్ధతిలోనే నిర్వహించాలని, 31 జిల్లాల ఆధారంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలుగా గత అక్టోబర్ 10న విద్యా శాఖ జారీ చేసిన జీవో 25, అందుకు అనుగుణంగా టీఆర్టీ నోటిఫికేషన్ జారీలను సవాల్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్, మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం గురువా రం విచారించింది. దర్మాసనం.. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు టీఆర్టీ పరీక్షలు జరపరాదని ప్రభుత్వానికి మౌఖిక సూచన చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే..
అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇచ్చామని, పరీక్ష ఆపాల్సి న అవసరం లేదన్నారు. ఒక జిల్లాను మూడు జిల్లాలు చేస్తే పాత జిల్లాలో స్థానికుడైన అభ్యర్థి ఇప్పుడు రెండు జిల్లాల్లో స్థానికేతరుడు అవుతున్నాడని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. స్థానిక రిజర్వేషన్ల గురించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందని, ఆ ఉత్తర్వుల మేరకు పూర్వపు పది జిల్లాలకే ఆమోదం ఉందని, ఈ పరిస్థితుల్లో 31 జిల్లాలను ఆధారంగా చేసుకుని నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. పది జిల్లాల సంఖ్య రెండుమూడు జిల్లాలకు తగ్గించితే పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
స్థానికులకు నష్టం వాటిల్లదు..
ఏజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థానిక అభ్యర్థులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. ఒక జిల్లాను రెండుమూడు జిల్లాలుగా చేయడం వల్ల అభ్యర్థుల స్థానికతకు నష్టం ఉండబోదని, అభ్యర్థులు ఉన్న జిల్లాలోనే స్థానికత అమలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే జిల్లాల పెంపు జరిగిందని చెప్పారు. పది జిల్లాల సంఖ్యను రెండుగా తగ్గించినప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకం అవుతుందని చెప్పారు.
లోతుగా విచారణ చేస్తాం..
ధర్మాసనం స్పందిస్తూ.. పది జిల్లాల్ని 31గా చేయడం, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి చట్టబద్ధత ఉందా, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన అవునో కాదో.. వంటి అంశాలపై లోతుగా విచారణ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థి కొత్త జిల్లాతోపాటు పాత జిల్లా పేరు తెలియజేసేలా దరఖాస్తులో అవకాశం కల్పిం చాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సోమవారానికి(13వ తేదీ) వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment