టెట్, టీఆర్‌టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు | Interim orders on Tet adn TRT today | Sakshi
Sakshi News home page

టెట్, టీఆర్‌టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు

Published Thu, Feb 22 2024 5:46 AM | Last Updated on Thu, Feb 22 2024 5:46 AM

Interim orders on Tet adn TRT today - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ), టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

టీఆర్‌టీ, టెట్‌ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ మరోసారి విచారణ జరిపారు.

పరీక్షలపై తీవ్ర ప్రభావం..
ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్‌ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్‌ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్‌టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్‌కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్‌టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్‌ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్‌టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు.

టెట్‌ పరీక్ష సిలబస్‌ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్‌టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement