
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల రాత పరీక్షలను (టీఆర్‌టీ) రేపటి నుంచి మార్చి 4 వరకు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో జరిగే పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఐదు కేటగిరీల్లో 48 రకాల సబ్జెక్టులు, మీడియంలలోని 8,792 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంకన్నా ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
బయోమెట్రిక్ అథెంటికేషన్ వివరాల సేకరణకు సమయం పడుతుందని, అందుకే అభ్యర్థులు కచ్చితంగా 45 నిమిషాల ముందే పరీక్ష హాల్లోకి వెళ్లాలని వివరించింది. నిర్ణీత పరీక్ష సమయం కంటే ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమ య్యే పరీక్షల కోసం అభ్యర్థులు 9:15 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలని, మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలయ్యే పరీక్షల కోసం అభ్యర్థులు 1:45 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని పేర్కొంది.
పరీక్షలు, హాల్‌టికెట్లకు సంబంధించి ఏమై నా సమస్యలుంటే టీఆర్‌టీ హెల్ప్‌డెస్క్‌ను 8333923740 నంబర్‌లో (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు) సంప్రదించాలని లేదా helpdesk @tspsc.gov.inకు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి రెండు పరీక్షలు మినహా మిగ తా వాటిని ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నందున అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన లింకు (ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఆన్ సీబీఆర్టీ ఎగ్జామినేషన్స్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ మాక్ టెస్టు) ద్వారా ప్రాక్టీస్ చేసుకోవాలని పేర్కొంది.
అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ చేసిన సూచనలు ఇవీ...
ఉదయం పరీక్ష రాసే వారు 9:15 గంటలకే, మధ్యాహ్నం పరీక్ష రాసేవారు1:45 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలి.
హాల్‌టికెట్‌తోపాటు ఏదేని గుర్తింపు కార్డు పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు ఐడీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి.
పరీక్ష పూర్తయ్యే 150 నిమిషాల వరకు బయటకెళ్లడానికి వీల్లేదు. పూర్తయ్యాక బయటకు వెళ్లేప్పుడు తమ వద్ద ఉన్న పెన్, రఫ్ పేపర్లు ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
అభ్యర్థి హాల్ టికెట్‌లో ఫొటో సరిగ్గా కనిపించకపోతే అభ్యర్థి తన రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలను వెంట తీసుకెళ్లాలి.
అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ స్క్రీన్‌పై అతని ఫొటో పేరుతో సహా వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఏమైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి.
మొబైల్, ట్యాబ్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, వాచ్, క్యాలిక్యులేటర్, లాగ్ పట్టికలు, పర్స్, నోటు పుస్తకాలు, విడి పేపర్లు, రికార్డింగ్ పరికరాలు వెంట తెచ్చుకోకూడదు.
బంగారు ఆభరణాలు వెంట తెచ్చుకోవద్దు. మెహందీ, ఇంక్‌ను చేతులు, పాదాలపై పెట్టుకోవద్దు.
పరీక్ష సమయంలో కీబోర్డును తాకవద్దు. మౌస్‌ను ఉపయోగించి సమాధానాలు క్లిక్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment