
విద్యాసదస్సులో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లోగా 8,792 ఉపాధ్యాయ ఖాళీలను టీఆర్‌టీ ద్వారా భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ – నాణ్యమైన విద్య – ప్రధానోపాధ్యాయుల పాత్ర’అనే అంశంపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేయడం సంతోషించదగ్గ పరిణామమన్నారు.
అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం బాధ కల్గిస్తోందన్నారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రాకపోవడం గురించి హెచ్‌ఎంలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 31 జిల్లాల్లో బాగా పనిచేసే ప్రధానోపాధ్యాయులను గుర్తించి, వారికి ప్రత్యేకంగా సన్మానం చేస్తామని తెలిపారు. మిషన్ భగీరథలో పాఠశాలలకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని స్థానికంగా సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఆదేశాలు జారీ చేశామన్నా రు. ప్రస్తుతం వారానికి 3 గుడ్లు ఇస్తున్నామని భవిష్యత్తులో ఆరు గుడ్లు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు బియ్యం కోటా పెంచుతామని అన్నారు. పాఠశాలలకు కరెంట్ బిల్లులు లేకుండా చేస్తామన్నారు.
నాణ్యమైన విద్యను అందించాలి: ఈటల
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా చేయాలని సూచించారు. పాఠశాలల్లో స్థలం ఉంటే ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు పెట్టుకోవాలని చెప్పామన్నారు. కార్యక్రమంలో మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ గౌరవాధ్యక్షుడు ఎస్.సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సింగిడి లక్ష్మారెడ్డి, పి.రాజభాను చంద్రప్రకాశ్, కోశాధికారి కె. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment