హన్మకొండ: మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరిన రోజే జరిగిన అవమానం చూస్తుంటే జాలి కలుగుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామూలు నాయకులు చేరితేనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని.. కానీ ఈటల వెళ్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పంపారని పేర్కొన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికి రాజేందర్ బీజేపీలో చేరారని విమర్శించారు.
తాను వామపక్ష భావాలు కలిగిన వాడినని, సోషలిస్టునని చెప్పుకునే ఈటల.. బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో రాచరికపు పాలన, ఫ్యూడల్ మనస్తత్వం కనపడటం లేదా అని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, గడీని మించిన ప్యాలెస్, రూ.లక్షల వ్యయంతో వివాహాలు జరిపించావంటేనే ఈటలలో ఫ్యూడల్ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం చెల్లదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ఏకైక బాహుబలి అని, ఇంకో ఇరవై ఏళ్లు టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని కడియం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment