
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరో నాలుగు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని 423 పోస్టులకు గురువారం ప్రకటనలు వెలువరించింది. ఈ పోస్టుల వివరాలు పరిశీలిస్తే హార్టికల్చర్ ఆఫీసర్-27, అసిస్టెంట్ లైబ్రేరియన్ -6, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 - 238, ఏఎన్‌ఎంలు - 152 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈ నెల (జనవరి) 31 మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. 310 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకు ఆ రోజు నోటిఫికేషన్ వెలువరిస్తారు.
టీఆర్‌టీ దరఖాస్తు సవరణకు మరో అవకాశం
టీఆర్‌టీ దరఖాస్తు సవరణకు టీఎస్‌పీఎస్సీ మరోసారి అవకాశం కల్పించింది. పాత జిల్లాల ప్రకారం పొందుపరచాల్సిన వివరాలు కూడా అభ్యర్థులు సరిగా ఇవ్వలేదని, బయోడేటా వంటి వివరాలు సక్రమంగా పొందుపరచలేదని వారికోసం మరోసారి అప్లికేషన్ సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. 26, 27 తేదీల్లో టీఆర్‌టీ దరఖాస్తును సవరించుకోవచ్చు.