సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఫైనల్ కీలను రెండు, మూడ్రోజుల్లో ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల వెరిఫికేషన్ జాబితాలను సిద్ధం చేయనుంది.
అయితే ఈ ప్రక్రియను చేపట్టాలంటే కోర్టులో 200 వరకు ఉన్న కేసులపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, విద్యాశాఖ కమిషనర్ కిషన్, న్యాయ శాఖ కార్యదర్శితో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ గురువారం సమావేశమై చర్చించారు.
వారి ఫలితాలు ప్రకటించాలా.. వద్దా?
సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, పండిట్ పోస్టులకు సంబంధించిన అర్హతల విషయంలో అభ్యర్థులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్, డిగ్రీలలో జనరల్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని ఆయా పోస్టుల నోటిఫికేషన్లలో పొందుపరిచారు.
అలాగే విద్వాన్ వంటి కోర్సులకు ఎన్‌సీటీఈ ఆమోదం లేనందున వాటిని అనుమతించబోమని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. దీంతో ఆయా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వారంతా కోర్టు అనుమతితో పరీక్షలకు హాజరయ్యారు. కోర్టు వారిని పరీక్షకు అనుమతించాలని చెప్పిందే తప్ప వారి ఫలితాలను ప్రకటించాలని చెప్పలేదు. ఈ నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించవద్దని, ఆయా కేసుల్లో అప్పీల్‌కు వెళతామని విద్యాశాఖ టీఎస్‌పీఎస్సీ అధికారులకు సూచించింది.
ఒకట్రెండు రోజుల్లో కోర్టుకు..
అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న ఫైనల్ కీలను ప్రకటించాల్సి ఉంది. దీంతో వాణీప్రసాద్ గతంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అందులో భాగంగా గురువారం సమావేశం నిర్వహించి ఆయా కేసులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ అప్పీల్ ద్వారా ఆయా కేసులపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో విద్యాశాఖ కోర్టును ఆశ్రయించనుంది.
అయితే ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఫైనల్ కీలను ప్రకటించినా కోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చాకే 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసి పాఠశాల విద్యా కమిషనర్‌కు టీఎస్‌పీఎస్సీ పంపించనుంది. జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తయ్యాక డీఈవోలు ఆ జాబితాలను టీఎస్‌పీఎస్సీకి పంపిస్తే.. టీఎస్‌పీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లను ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment