సాక్షి, జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్‌టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధంలేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలంగా కష్టపడి పరీక్ష కు ప్రిపేర్ అయితే.. టీఎస్‌పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అధి కారులు సాంకేతిక తప్పిదం జరిగిందని తప్పించుకుని మరోమారు నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన అనంతరం తాము చూసుకున్న ఫైనల్‌కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు కూడా వ్యత్యాసం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు.
ఫలితాల్లో తప్పులు..
- జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు.
- వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీకి చెందిన మహిళ. ఈమెను బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో చూపించారు.
- మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జె. రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాలు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు.
- ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థికి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా, బీసీ డీగా చూపించారు.
- మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం..
టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలాకా లం పాటు కష్టపడి చదివి ఫలితాల కోసం ఎదురుచూస్తే తీవ్రనిరాశ కలిగించాయి. ప్రకటించిన ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు.
–నోముల సాయిబాబు, జనగామ జిల్లా
ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతోంది..
టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్షల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణమైంది. పరీక్ష రాసిన అభ్యర్థిలో ప్రతిసారి ఫలితాలు ఎలా వస్తాయో అనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి.
–మారుతిరెడ్డి, కరీంనగర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment