
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) హాల్‌టికెట్ల జారీ గందరగోళంగా మారింది. అభ్యర్థుల హాల్‌టికెట్లలో తప్పులు దొర్లడంతోపాటు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ భారీ తప్పిదం జరిగింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక తప్పిదంతో పరీక్ష కేంద్రాల కేటాయింపు తారుమారైంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన మూడు ప్రాధాన్య జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.
మంగళవారం అనేక మంది టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిపై టీఎస్‌పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీజీజీలో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింకును వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అభ్యర్థులు ఆందోళన చెందొద్దని.. కొత్త హాల్‌టికెట్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఇప్పటికే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారితోపాటు మిగిలిన వారు కూడా కొత్త హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వీలైతే ఈ నెల 21న (బుధవారం) హాల్‌టికెట్ల లింకు అందుబాటులో ఉంచుతామని టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
సీజీజీ వరుస తప్పిదాలు..
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వరుస తప్పిదాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. గతంలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కేటాయింపులో తప్పులు జరిగిన తర్వాత కూడా సీజీజీ జాగ్రత్త వహించిన దాఖలాలు లేవు. ఇటీవల గ్రూప్–1 పోస్టులకు పోస్టుల కేటాయింపే అందుకు ఉదాహరణ. సీజీజీ సాంకేతిక తప్పిదంతో అభ్యర్థుల పోస్టింగులు మారిపోయాయి. దీనిపై ఫిర్యాదులందడంతో ఎంపిక జాబితాను మళ్లీ రూపొందించారు. లెక్చరర్ పోస్టులకు సంబంధించి మెయిన్ పరీక్షకు 1.15 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలోనూ మళ్లీ అదే తప్పు చేసింది.
మెయిన్ జాబితాలో పేర్లు లేవని ఫిర్యాదులు అందడంతో.. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు దొర్లినట్లు టీఎస్‌పీఎస్సీ గుర్తించింది. దీంతో ఈ నెల 19న జరగాల్సిన గురుకుల పోస్టుల మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయినా జాగ్రత్త వహించకుండా టీఆర్‌టీ హాల్‌టికెట్లలో పొరపాట్లకు సీజీజీ కారణమైంది. హాల్‌టికెట్లలో తప్పులు తరువాత సరిచేసుకోవచ్చనుకున్నా.. అభ్యర్థి పరీక్ష కేంద్రం కోసం ఇచ్చిన మూడు జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించింది. నల్లగొండ జిల్లా అభ్యర్థులకు ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ అభ్యర్థులకు కరీంనగర్‌లో.. ఇలా అన్ని జిల్లాల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లోనూ పొరపాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment