సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు.
ప్రశ్నించే గొంతుకలకు అండగా..
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment