నియామకాలెప్పుడో..! | TSPSC TRT Notification Slow | Sakshi
Sakshi News home page

నియామకాలెప్పుడో..!

Published Sun, Jun 16 2019 8:47 AM | Last Updated on Sun, Jun 16 2019 8:47 AM

TSPSC TRT Notification Slow - Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: టీఆర్‌టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల్లో ఇది వరకు పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే తాజాగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిన కొద్దీ ఉపాధ్యాయుల నియామకంపై తర్జనభర్జన కొనసాగింది. ప్రభుత్వం టీఆర్‌టీ నియామకాలు చేపడుతుందా.. విద్యావాలంటీర్లను కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉండగా తాజాగా తాత్కాలిక బోధకుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ నెల 11న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు వెల్లడించారు. దీంతో ఏడాదిన్నరగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న టిఆర్‌టీ అభ్యర్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. నియామకాలను భర్తీ చేసి మిగతా ఖాళీలను విద్యావాలంటీర్ల ద్వారా భర్తీ చేయాల్సిన విద్యాశాఖ టీఆర్‌టీ అభ్యర్థులను పక్కనబెట్టి విద్యావాలంటీర్లను కొనసాగించడంతో సందిగ్ధత నెలకొంది.

పాతవారే కొనసాగింపు..
సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం   కొన్నేళ్ల నుంచి విద్యావాలంటీర్లను నియమిస్తోంది. రెండేళ్ల నుంచి నెలకు రూ.12 వేల వేతనం అందజేస్తూ వారితో వివిధ సబ్జెక్టుల వారీగా బోధన చేయిస్తోంది. కిందటేడాది వరకు కొత్తగా నియామకాలు చేపడుతూ అర్హత ప్రకారం నియమించేవారు. ఇలా ప్రతీ ఏడాది దరఖాస్తులు చేసుకోవడం, మెరిట్‌ తదితర కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నామని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇదివరకు పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే ఈ ఏడాది నుంచి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో తాత్కాలిక బోధకులను బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బడులు పునః ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల విద్యాధికారులు సైతం ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు తాత్కాలిక బోధకులను కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు వారికి బడుల్లో చేరాలని సమాచారం అందించారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేనిచోట, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి బోధకుల కొరత ఉన్నచోట, ప్రాధాన్యతక్రమంలో వీరిని నియమించారు. ఆయా పాఠశాలల్లో తాజా సంఖ్యను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కిందటేడాదిలో పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తగా మరికొందరిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 134 మంది వరకు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు విద్యావాలంటీర్లు రావడంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతోంది.
 
టీఆర్‌టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదా..
ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్‌టీ  నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి కే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి ఫలితాల ను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి సుమారు నాలు గు నెలలు కావస్తున్నా... వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడులు తెరిచే నాటికి వీరిని బడుల్లో నియమించాలని అనేక డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. ఎంపికైన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యావాలంటీర్లనే బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొంత కాలం టీఆర్‌టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వి ద్యావాలంటీర్లను కొనసాగిస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు వివరించారు. పాఠశాలల్లో ప్రాధాన్య క్రమంలో వారిని నియమించినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement