
సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) దరఖాస్తుల గడువును జనవరి 7 వరకు పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ శనివారం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సుమారు 40 వేల మంది పాత 10 జిల్లాల ప్రకారం ఆప్షన్‌ను మార్చుకోలేదని తెలిపింది. ఎడిట్ ఆప్షన్ ద్వారా స్థానిక జిల్లాను మార్చుకుంటేనే ...దరఖాస్తులోని మిగతా తప్పిదాలు సవరించుకునేందుకు అవకాశముంటుందని స్పష్టం చేసింది.
అభ్యర్థులు 10వ తేదీలోగా దరఖాస్తుల్లోని తప్పులు సవరించుకోవాలని సూచించింది. దరఖాస్తుకు శనివారం ఆఖరు కావడంతో దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. అభ్యర్థుల అనుమానాలను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ శనివారం విలేకరుల ముందు నివృత్తి చేశారు. ఎస్జీటీ తెలుగు, ఇంగ్లిష్ మీడియం పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరికి హాల్ టికెట్లతో పాటు పరీక్షలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీల్లో ఏ సబ్జెక్టుకు అర్హత కలిగిన వారు ఆయా సబ్జెక్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్ని కేటగిరీలకు కలిపి సుమారు 2.40లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను పాత పది జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని, మిగిలిన పోస్టులకు హెచ్‌ఎండీఏ పరిధిలో రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని, మే 10 నాటికి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు.
నిబంధనల ప్రకారమే డీఎడ్ అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనలు పెట్టామన్నారు. కోర్టు ఆదేశం మేరకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు వచ్చిన వారిని సైతం అనుమతించాలని విద్యా శాఖ కోరితే అనుమతిస్తామన్నారు. పోస్టులు తక్కువగా ఉన్న జిల్లాల అభ్యర్థులు మిగిలిన జిల్లాల్లో ఓపెన్ మెరిట్ కేటగిరీ పోస్టులకు అర్హులన్నారు. దరఖాస్తు పీడీఎఫ్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ నంబర్ 9030174469, 7288896658లకు సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment