
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికతకు ప్రాతిపదికగా పాత పది జిల్లాలనే పేర్కొన్నారని.. వాటి ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు.. ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనూ సవరణలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పది జిల్లాలను ఆధారంగా చేసుకుని.. షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించుకోవచ్చంది. దీనికి అవసరమైన సవరణలు, చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా వీలుకాదు..
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నిబంధనలను, 8,700కుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా 31 జిల్లాల ఆధారంగా నియామకాలు సబబు కాదని తేల్చిచెప్పింది.
సవరణ నోటిఫికేషన్ ఇవ్వండి
టీఆర్‌టీకి సంబంధించి జారీ చేసిన జీవోలో 31 జిల్లాలని పేర్కొన్న స్థానంలో 10 జిల్లాలనే పేర్కొనాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే దరఖాస్తుల స్వీకరణ గడువునూ డిసెంబర్ 15 వరకు పెంచాలని సూచించింది. ఈ మేరకు సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని.. దరఖాస్తులను బట్టి అభ్యర్థులు పాత పది జిల్లాల్లో ఏ జిల్లాకు చెందుతారో వర్గీకరించాలని స్పష్టం చేసింది. తాము చెప్పిన ఈ సవరణలు చేసి.. షెడ్యూల్ ప్రకారమే టీఆర్‌టీని నిర్వహించుకోవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment