తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే టీచర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులు కూడా పూర్తయ్యాయి. సంబంధిత పరీక్షలో విజయం సాధించేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా కొలువు కొట్టాలని ఆసక్తితో ఉన్నారు. అయితే సదరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ‘రండిబాబూ.. రండి’ అంటూ అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. అర్హతలేని టీచర్లతో బోధిస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
గోదావరిఖని టౌన్ : టీఆర్‌టీకి కేవలం కొద్ది నెలల గడువు మాత్రమే ఉందని భావించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగు తీస్తున్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థులు తస్మాత్‌జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌టీని ప్రకటించిన వెంటనే కొన్ని బూటకపు కోచింగ్ సెంటర్లు పుట్టుకచ్చి, అభ్యర్థుల నుంచి వేలల్లో డబ్బు గుంజడానికి అసత్యపు ప్రచారాలతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 నుంచి 40వేల వరకు టీఆర్‌టీ కోసం కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు. గతంలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలలో మాత్రమే గుర్తింపు ఉన్న కోచింగ్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం గుర్తింపు లేకున్నా ప్రతీ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం
సంబంధిత అధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించడం లేదు. కోచింగ్ సెంటర్లకు కావాల్సిన అర్హత ఏమిటి, వాటిని ఎలా సమసన్వయ పరుచాలనే బాధ్యతలను నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు.
వేలల్లో ఫీజులు
గోదావరిఖని, మంథని, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలలో ఉన్న పలు సెంటర్లు మూడు నెలలకు రూ. 40 నుంచి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించడమే కాకుండా, సరైన కోచింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సరైన సెంటర్‌ను ఎంచుకోవాలి
కోచింగ్ సెంటర్లలలో బోధించే అధ్యాపకులకు అర్హత ఉందా, లేదా? అని చూసి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో చేరాలి. అధిక డబ్బులు చెల్లించి సరైన కోచింగ్ సెంటర్‌ను ఉంచుకోవడం వలన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – దాదాసలాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
ప్రచారాలు నమ్మొద్దు
ప్రభుత్వం టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రకటించిన వెంటనే చాలా కోచింగ్ సెంటర్లు సెల్ ద్వారా, ఇతర ప్రచారా సాధనాల ద్వార ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఏది మెరుగైంది. గతంలో వాటి చరిత్ర ఏంటి ఇలా చాలా రకాలుగా సెంటర్‌పై విషయాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – ఎల్ సుహాసిని, ఆర్జేడీ
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
కోచింగ్ సెంటర్ల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. గుర్తింపు లేని సెంటర్లను మూసి వేయాలి. అర్హత లేని భోధకులను తొలగించాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే డబ్బుతో పాటు సమయాన్ని, భవిష్యత్‌ను, అవకాశాన్ని చేజార్చుకుంటాం. – సుచరిత, హెచ్‌పీటీ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment