కోటా జోరుకు కళ్లెం | Drop in Student Numbers Impact Kota Coaching Industry | Sakshi
Sakshi News home page

కోటా జోరుకు కళ్లెం

Published Mon, Dec 9 2024 5:41 AM | Last Updated on Mon, Dec 9 2024 5:41 AM

Drop in Student Numbers Impact Kota Coaching Industry

ఈ ఏడాది సగానికి తగ్గిన విద్యార్థులు

విద్యార్థుల బలవన్మరణాలతో ప్రతికూల ప్రభావం

తోడైన ప్రభుత్వ మార్గదర్శకాలు

కోచింగ్, హాస్టళ్ల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం

తాత్కాలికమేనంటున్న కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు

కోటా: రాజస్తాన్‌లోని కోటా. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా పేరున్న నగరం. విద్యార్థులతో కళకళలాడుతూ కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కాసులు కురిపించే ఈ నగరం కళ తప్పుతోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. 

ఇటీవలి కాలంలో కోటాకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? శిక్షణ కోసం వచ్చే విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, కోచింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, కోచింగ్‌ సెంటర్లను వేరే ప్రాంతాలకు విస్తరించడం వంటి కారణాలూ దీని వెనుక ఉన్నాయని చెబుతున్నారు. కోచింగ్‌ సెంటర్లు 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదనే నిబంధన వల్ల ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.

వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోటాకు ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు విద్యార్థులు వస్తుంటారు. వీరి వల్ల నగరంలోని అన్ని రంగాలకు కలిపి ఏటా సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం ఉండేది. అయితే, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్ష వరకు తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయం కూడా ఈసారి ఒక్కసారిగా సగానికి సగం, రూ.3,500 కోట్లకు పడిపోయింది.

నిర్వాహకుల ధీమా
అత్యుత్తమ శిక్షణకు కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని, విద్యార్థులకు ఇతర నగరాల్లో లేనటువంటి అనుకూల వాతావరణం ఇక్కడ ఉన్నందున ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్తాన్‌ ఇండస్ట్రీస్‌ యునైటెడ్‌ కౌన్సిల్‌ జోనల్‌ చైర్‌ పర్సన్‌ గోవింద్‌రామ్‌ మిట్టల్‌ బల్లగుద్ది చెబుతున్నారు. బెంగళూరులో మాదిరిగా కోటాలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలనూ పారిశ్రామిక వేత్తలు పరిశీలిస్తున్నారని వివరించారు.

 ప్రైవేట్‌ కంపెనీల్లో మేనేజ్‌మెంట్‌ పోస్టుల్లో సగానికి సగం, నాన్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్‌ పారిశ్రామికవేత్తలు..ఐటీ హబ్‌లను కోటాకు మార్చాలంటూ బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిప తులను కోరడం, కొందరు ఓకే అనడం జరిగిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్, కోటా–బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైందని ఆయన వివరించారు.

వాయిదాలకు సైతం కష్టంగా ఉంది
‘గతేడాది వరకు రోజులో 60 మంది వరకు విద్యార్థులు నా ఆటోలో ప్రయాణించే వారు. మంచి ఆదాయం ఉండటంతో కుటుంబ పోషణ ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఉండేది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 20కి తగ్గింది. ఆదాయం కూడా పడిపోయింది. రుణంపై కొనుగోలు చేసిన వాహనానికి కిస్తీలు చెల్లించేందుకు సైతం ఇబ్బందవుతోంది’అని స్థానిక ఆటో డ్రైవర్‌ ఒకరు చెప్పారు.

ఇబ్బందుల్లో హాస్టళ్ల యజమానులు
కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిన మాట నిజమేనని కోటా హాస్టల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నవీన్‌ మిట్టల్‌ ఒప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 30 శాతం నుంచి 40 శాతం మేర పడిపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పలు హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్న కొందరు యజమానులు వాయిదాలు చెల్లించలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు.

 నగరంలో ఉన్న 4,500 హోటళ్లలో చాలా చోట్ల విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు 40–50 శాతానికి మధ్య పడిపోయిందన్నారు. ‘నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం ఆత్మహత్యల పరంగా చూసే దేశంలోని 50 నగరాల తర్వాత దిగువన కోటా ఉంది. అయితే, ఆత్మహత్య ఘటనల ప్రచారంతో ప్రతికూల ప్రభావం పడింది’అని నవీన్‌ అన్నారు. హాస్టళ్లలో రూం అద్దెలు నెలకు రూ.15వేలుండగా ఇప్పుడది రూ.9 వేలకు తగ్గిందని, చాలా హాస్టళ్లు ఖాళీగానే ఉన్నాయని స్థానిక కోరల్‌పార్క్‌ ప్రాంతంలోని హాస్టల్‌ యజమాని ఒకరన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement