National Crime Records Bureau (NCRB)
-
National Crime Records Bureau: అయినా భర్త మారలేదు
ఎన్ని కథలు రాసినా..ఎన్ని సినిమాలు తీసినా..ఎన్ని చట్టాలు చేసినా హింస వల్ల భార్యాభర్తల బంధానికి ఎంత గట్టి దెబ్బ తగులుతుందో వార్తల ద్వారా నిత్యం చదువుతున్నా భర్త మాత్రం మారడం లేదు. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) డిసెంబర్ 3న విడుదల చేసిన తాజా నివేదికలో భార్యల మీద భర్తల హింస 2021తో పోలిస్తే 2022లో ఇంకా పెరిగిందని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడే రోజున వచ్చిన ఈ నివేదిక ఎన్ని ప్రభుత్వాలు మారినా మగాణ్ణి మార్చలేకపోతున్నాయన్న కఠోర సత్యాన్ని ముందుకు తెచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న డిసెంబర్ 3వ తేదీన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. 2022లో జరిగిన అన్ని నేరాల్లో భార్యలపై భర్తలు నెరపిన హింసాత్మక చర్యల కేసులే ప్రథమ స్థానంలో నిలిచాయని ఈ నివేదిక చెప్పింది. అంటే పెద్ద చదువులు, భారీ జీతాల ఉద్యోగాలు, చట్టాలు, సంఘపరమైన మర్యాదలు... ఏవీ మగాణ్ణి మార్చలేకపోతున్నాయని అతడు రోజురోజుకూ మరింత తీసికట్టుగా తయారవుతున్నాడని ఈ నివేదిక వల్ల అర్థమవుతోంది. తానే సర్వాధికారి అన్నట్టుగా ఇంటి యజమాని స్థానంలో ఉంటూ భార్యతో హింసాత్మకంగానే వ్యవహరిస్తున్నాడు. ‘ఇది మగ సమాజం’ అని మగవాడు భావించడమే ఇందుకు కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎంత మంది స్త్రీలకు సీట్లు దక్కాయో, ఎంతమంది స్త్రీలు గెలిచారో గమనిస్తే అవును.. ఇది మగసమాజం అనుకోకుండా ఉండగలరా ఎవరైనా? కాబట్టి ఎన్నికల ఫలితాల రోజే ఈ నివేదిక వెలువడటం యాదృచ్చికం కాదు. పిల్లలూ బాధితులే ఈ నివేదికలో మరో బాధాకరమైన వాస్తవం ఏమిటంటే దేశంలో 2022లో స్త్రీల తర్వాత అత్యధికమైన కేసులు నమోదైనవి బాలలకు జరిగిన హానిపై నమోదైనవే. 2022లో పిల్లలపై హింసకు సంబంధించి 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికి సగం కిడ్నాపులు. మిగిలినవి పోక్సో కేసులు. వీటిలో పిల్లలపై జరిగిన లైంగిక అసభ్యతతో పాటు అత్యాచారాలు కూడా ఉన్నాయి. గమనించాల్సిన సంగతి ఏమిటంటే భార్యాభర్తల మధ్య హింస చోటు చేసుకుంటున్నప్పుడు పిల్లలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువ. లేదా తల్లిదండ్రుల తగాదాలను చూసి ఇల్లు వీడే పిల్లలు, ఇంట్లో ఉండలేక వేరే చోట ఆడుకోవడానికి వెళ్లి లైంగిక దాడులకు గురయ్యే పిల్లలు అధికంగా ఉంటారు. అంటే గృహహింస వల్ల కేవలం స్త్రీలే కాక పిల్లలు కూడా బాధితులవుతున్నారని తెలుసుకోవాలి. 2022లో స్త్రీలపై, పిల్లలపై జరిగిన నేరాల తర్వాత 60 ఏళ్లు దాటిన వృద్ధులపై ఎక్కువ నేరాలు జరిగాయి. అంటే మన దేశంలో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు. భర్తలూ మారాలి వివాహం అంటే స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన సమాన వేదిక అనే భావన ఇంకా పురుషుడికి ఏర్పడకపోవడమే స్త్రీలపై నేరాలకు ప్రధాన కారణం. పెళ్లి ద్వారా తనకు భార్య అనే బానిస లేదా సేవకురాలు లేదా తాను అదుపు చేయదగ్గ మనిషి అందుబాటులోకి రాబోతున్నదని పురుషుడు భావిస్తూనే ఉన్నాడు. పైగా ‘ఇదంతా మామూలే. తాతలు తండ్రులు చేసిందే నేనూ చేస్తున్నాను’ అని తాను నమ్మడమే కాక ‘మీ నాన్న మీ తాత చేస్తున్నదే నేనూ చేస్తున్నాను’ అని భార్యతో అంటున్నాడు. ఇందుకు భార్య అభ్యంతరం పెడితే, తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే, మరొక అభిప్రాయం కలిగి ఉంటే ఆమెపై హింస జరుగుతున్నది. భర్త హింస చేయకపోతే అతని సంబంధీకులు ఇందుకు తెగబడుతున్నారు. గాయపరచడం నుంచి హత్య చేయడం వరకు ఈ దాడులు ఉంటున్నాయి. నమోదైనవి మాత్రమే ఎన్.సి.ఆర్.బి. ఈ నివేదికను నమోదైన కేసుల ఆధారంగానే ఇస్తుంది. మన దేశంలో ఎంతమంది భార్యలు కేసుల వరకూ వెళతారో ఊహించవచ్చు. పది శాతం స్టేషన్ దాకా వెళితే 90 శాతం ఇంట్లోనే ఉంటూ ఈ హింసను అనుభవిస్తుంటారు. పురుషులను మార్చడానికి సాహిత్యం, సినిమా, సామాజిక చైతన్యం ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే పురుషుడు మారకపోతే ఎలా? కాఫీ చల్లారిందని, కూర బాగలేదని, కట్నం పేరుతోనో, ఉద్యోగం చేయవద్దనో, మగ పిల్లాణ్ణి కనలేదనో, పుట్టింటికి తరచూ వెళుతోందని, అత్తింటి వారిని అసలు పట్టించుకోవడం లేదనో ఏదో ఒక నెపం వెతికి హింసకు తెగబడితే ఎలా? భర్తలూ ఆలోచించండి. 4,45,256 కేసులు 2022లో స్త్రీలకు జరిగిన హానిపై దేశవ్యాప్తంగా 4,45,256 కేసులు నమోదయ్యాయి. 2021 కంటే 2022లో ఈ నేరాలు 4 శాతం పెరిగాయి. అయితే ఈ మొత్తం నాలుగున్నర లక్షల కేసుల్లో ప్రథమస్థానం వహించినవి భార్య మీద భర్త, అతని సంబంధీకులు చేసిన హింసకు సంబంధించినవే కావడం గమనార్హం. రెండవ స్థానం వహించిన కేసులు స్త్రీల కిడ్నాప్. మూడవ స్థానంలో నిలిచిన కేసులు స్త్రీ గౌరవానికి భంగం కలిగించే చర్యలు. నాల్గవ స్థానంలో నిలిచినవి అత్యాచారాలు. అంటే భర్త, కుటుంబ సభ్యుల సంస్కార స్థాయి మెరుగ్గా ఉండి స్త్రీని గౌరవించే విధంగా ఉంటే దాదాపు సగం కేసులు ఉండేవే కావు. -
National Crime Records Bureau: మూడేళ్లలో..13.13 లక్షల మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ: దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉందని పేర్కొంది. గత వారం పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది. 2019–2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019–21 మధ్య ఢిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు. -
Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది
యాసిడ్ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్ డెవలప్ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు. వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాసిడ్‌ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకం దారులను యాసిడ్ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. పరిస్థితి దారుణం కోవిడ్ కాలంలో తప్ప దేశంలో యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్రమత్తత అవసరం విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. దేశంలో యాసిడ్ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!) -
రక్షణ లేని బాల భారతం!
న్యూఢిల్లీ: దేశంలో బాలలపై నేరాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 53,874 పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. బాలలపై జరిగే నేరాల్లో ప్రతి మూడింటిలో ఒకటి లైంగిక నేరమే కావడం గమనార్హం. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. దేశంలో బాలలపై నేరాలకు సంబంధించి 2020లో 1,28,531 కేసులు, 2021లో 1,49,404 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదిలోనే కేసులు 16.2 శాతం పెరిగాయి. 2021లో పోక్సో చట్టం సెక్షన్ 4, 6 కింద 33,348 కేసులు నమోదయ్యాయి. వీటిలో 33,036 కేసులు బాలికలపై జరిగిన అఘాయిత్యాలకు, 312 కేసులు బాలురపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా బాలల అపహరణలకు సంబంధించి గతేడాది 67,245 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక నేరాలు బాలలపై నేరాల వ్యవహారంలో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు రిజిస్టరయ్యాయి. 2021లో 140 మంది చిన్నారులు అత్యాచారం, ఆపై హత్యకు గురయ్యారు. మరో 1,402 మంది కేవలం హత్యకు గురయ్యారు. అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే బయటపడ్డాయి. గర్భంలోనే శిశువులను చిదిమేసినట్లు గతేడాది 121 కేసులు రిజిస్టరయ్యాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 23, గుజరాత్లో 23 నమోదయ్యాయి. ఆత్మహత్య చేసుకొనేలా బాలలను ప్రేరేపించినట్లు 359 కేసులు వచ్చాయి. గత ఏడాది 49,535 మంది చిన్నపిల్లలు కనిపించకుండా పోయారు. గతేడాది బాల కార్మిక చట్టం కింద 982 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా 305 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. బాల్యవివాహ నిషేధ చట్టం కింద గతేడాది 1,062 కేసులు పెట్టగా, ఇందులో ఎక్కువ కేసులు కర్ణాటక, తమిళనాడు, అస్సాంలో నమోదయ్యాయి. -
బాల్య వివాహాల్లో జార్ఖండ్ టాప్
రాంచీ: చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి. ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలను రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు పల్లెల్లో 7.3%, పట్టణ ప్రాంతాల్లో 3% జరుగుతున్నాయి. 21 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 21 ఏళ్లు రాకుండా 54.0% మంది యువతులకు మూడుముళ్లు పడుతుండగా, జార్ఖండ్‌లో ఇది 54.6% గా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు 29.5% మాత్రమే. జార్ఖండ్ మరో అపప్రథ కూడా మూటగట్టుకుంది. మంత్రాల నెపంతో ఇక్కడ 2015లో 32 హత్యలు చోటుచేసుకోగా 2018లో 18 మంది, 2019, 2020ల్లో 15 మంది చొప్పున హత్యకు గురయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. -
మగవారిని గమనించండి.. దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు
ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవాడిదని సమాజం అంటుంది. కాని ఇంటి మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020’ ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం పురుషులవైతే 30 శాతం స్త్రీలవి. కోవిడ్ కాలపు అనారోగ్యం.. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ బాధలు మగవారిని ఈ వైపుకు నెడుతున్నాయి. వారి గురించి కుటుంబం, సమాజం ఆలోచించాలి. మన దేశంలో రోజుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో తెలుసా? రోజుకు దాదాపు 419. 2020లో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో తెలుసా? 1,53,052. వీటిలో పురుషుల సంఖ్య 1,08,532 (70 శాతం). స్త్రీలు 44, 498 (30 శాతం). అంటే స్త్రీల కంటే రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు సున్నిత స్వభావులు, భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు అనుకుంటాము. కాని పురుషులే ఇప్పుడు సున్నితంగా ఉన్నారు. జీవితాన్ని ఎదుర్కొనలేకపోతున్నారని ఈ సర్వే మనకు తెలియచేస్తోంది. స్త్రీలైనా పురుషులైనా ప్రాణం అత్యంత విలువైనది. అయితే స్త్రీలు తమ ఆందోళనను ఏదో ఒక విధంగా బయటపెట్టి నలుగురికి తెలిసేలా చేస్తారు. కాని పురుషుడు తన లోలోపల అదిమి పెట్టుకుంటాడు. తీరా నష్టం జరిగిపోయాకే అతడి మనసులో ఎంత వత్తిడి ఉన్నదో మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఇంట్లోని భర్తను, తండ్రిని, సోదరులను గమనించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులపై ఉందని తెలుస్తోంది. కోవిడ్ అనంతరం 2020 ప్రారంభంలోనే కోవిడ్ మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే దీని వెనుక సంఘం పెట్టిన ఇమేజ్ కూడా కారణమే. పురుషుడంటే సమర్థుడిగా ఉండాలి, ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలి, తెగింపుతో ఉండాలి ఇలాంటి స్టీరియోటైప్ ఆలోచనలను ఇచ్చింది సంఘం. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంది. కాని పురుషుడు ఒత్తిడిలో ఉంటే ఏం చేయాలి? కష్టం చెప్పుకుంటే చేతగానివాడనుకుంటే ఎలా? ఆత్మహత్య చేసుకోవడమేనా దారి? కొందరు పురుషులు అదే చేస్తున్నారు. పనిచేసే చోట అవమానాలు 2020లో పురుషులలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలిస్తే పని ప్రదేశంలో అవమానాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఆ సంవత్సరం పనిచేసేచోట అవమానాల వల్ల దేశంలో మొత్తం 1847 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు 1602 (87 శాతం). స్త్రీలు 234 (12 శాతం). అంటే రోజుకు సగటున ఐదు ఆత్మహత్యలు దేశంలో పని ప్రదేశంలో వేధింపుల వల్ల జరుగుతున్నాయి. వీటిలో మూడు నుంచి నాలుగు పురుషులవి. బాస్‌లు అవమానించడం, జీతాల పెంపులో తేడా, ప్రమోషన్లలో తరతమ భేదాలు ఇవన్నీ మగవాళ్లను కుంగదీసి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. స్త్రీలకు లైంగిక వేధింపులు ప్రధాన కారణం అవుతున్నాయి. అలాగే పని దొరకడం లేదన్న బాధతో కూడా పురుషులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భరోసా ఇవ్వాలి తండ్రి, భర్త, సోదరులతో మాట్లాడండి. వారి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి... వీటిలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్యం గురించి ఆరా తీయండి. సమస్య ఉంటే బలవంతంగానైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. ఆర్థిక సమస్యలు తెలుసుకోండి. అప్పులేమైనా ఉన్నాయా కూపీ లాగండి. పరిస్థితి ఎలా ఉన్నా వారి వల్ల ఏదైనా తప్పు జరిగి ఉన్నా నిందించకండి. నిలదీయకండి. సపోర్ట్ చేస్తామని చెప్పండి. ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఉద్యోగం మారాలనుకుంటే మారమని, లేదంటే మానేసి కొంతకాలం బ్రేక్ తీసుకోమని, మరేం పర్వాలేదని దిలాసా ఇవ్వండి. మిత్రులతో, క్లోజ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడించండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం ప్రాణాంతకం. -
పగటి ప్రమాదాలే అధికం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2020లో జరిగిన ఎక్కువ రోడ్డు ప్రమాదాలు గతానికి భిన్నంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్య చోటుచేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో వెల్లడైంది. గతంలో తెల్లవారుజామున ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. యమగండం.. సాయంత్రం 6 నుంచి 9 గంటలు.. రాష్ట్రవ్యాప్తంగా 19,172 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 4,019 ప్రమాదాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగినవేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 3,521 ప్రమాదాలు జరిగినట్లు ఎన్సీఆర్బీ లెక్క చెప్పింది. తర్వాతి స్థానాల్లో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య 2,835 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ సమయాల్లో జాతీయ రహదారుల్లో జరిగిన ప్రమాదాల్లో 2,496 మంది, రాష్ట్ర రహదారులపై 791 మంది దుర్మరణం చెందినట్లు నివేదిక తెలిపింది. రైల్వే ప్రమాద మరణాల్లో... రాష్ట్రవ్యాప్తంగా రైల్వే ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 337. ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగినవే కావడం ఆందోళన కలిస్తున్న అంశం. అదేవిధంగా 9 గంటల నుంచి 12 గంటల మధ్య 78 మం ది దుర్మరణం చెందారు. ఈ రెండు సమయా లు రైల్వేట్రాక్‌లపై యమగండాలుగా కనిపిస్తున్నట్లు ఎన్సీఆర్బీ లెక్క ప్రకారం అర్థమవుతోంది. పాదచారులూ బలి... రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 19,172 రోడ్డు ప్రమాదాల్లో 6,882 మంది మృతి చెందగా అందులో 486 మంది పాదచారులూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వివిధ మార్గాల్లో సరైన పుట్‌పాత్‌లు లేకపోవడం కూడా పాదచారుల మరణాలకు కారణమవుతోంది. రోడ్డు దాటడం, జంక్షన్ల వద్ద చూసుకోకుండా వస్తుండటం వల్ల కూడా ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మరోవైపు రోడ్డుపై సైకిల్ తొక్కుతూ కిందపడి 51 మంది మృతిచెందినట్లు నివేదిక తెలిపింది. ఇవే ప్రధాన కారణాలు.. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్ట జరుగుతున్న ఘటనల్లో మెజారిటీగా ఓవర్ స్పీడ్ వల్ల సంభవించినవేనని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోంది. ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిన 14,978 ఘటనల్లో 5,460 మంది మృత్యువాత పడగా 14,456 మంది గాయపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో ప్రమాదకరంగా లేదా అజాగ్రత్త వాహనాలు నడపటం వల్ల 1,538 ఘటనలు జరిగాయి. ఇందులో 637 మంది బలికాగా 1,635 మంది క్షతగ్రాతులయ్యారు. అదేవిధంగా మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో 1,328 ప్రమాదాలు జరగ్గా వాటిలో 343 మంది మత్యువాతపడ్డారు. మరో 1,295 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై... జాతీయ, రాష్ట్ర రహదారుల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచడం ఘోర ప్రమదాలకు కారణంగా మారుతోంది. 2020లో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన 169 ప్రమాదాల్లో 194 మంది క్షతగాత్రులవగా 48 మంది దుర్మురణం చెందారు. -
2020లో 1.53 లక్షల ఆత్మహత్యలు
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో రోజుకు 418 చొప్పున మొత్తం 1,53,052 బలవన్మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతకుముందు, 2019 సంవత్సరంలో మొత్తం 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తన వార్షిక నివేదికలో తెలిపింది. ఆత్మహత్యల రేటు ప్రతి వెయ్యి మందికి 2019లో 10.4% ఉండగా 2020లో అది 11.3%కి పెరిగిందని కేంద్ర హోం శాఖ అధీనంలో పనిచేసే ఎన్సీఆర్బీ వెల్లడించింది. 2020లో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 5,579 మంది రైతులు, 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారనీ, మొత్తం 1,53,052 ఆత్మహత్యల్లో 7% మంది సాగు రంగానికి చెందిన వారేనని విశ్లేషించింది. బలవన్మరణం చెందిన 5,579 మంది రైతుల్లో పురుషులు 5,335 మంది, 244 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. ఆత్మహత్యల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19,909, ఆతర్వాత తమిళనాడులో 16,883, మధ్యప్రదేశ్‌లో 14,578, బెంగాల్లో 13,103, కర్ణాటకలో 12,259 చోటుచేసుకున్నట్లు వివరించింది. మొత్తం బలవన్మరణాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 50.1% వరకు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మొత్తం బలవన్మరణాల్లో 3.1%మాత్రమే సంభవించాయని నివేదిక తెలిపింది. 2020లో సంభవించిన బలవన్మరణాల్లో 23,885 కేసులు దేశంలోని 53 నగరాల్లోనే నమోదయ్యాయి. మెగా నగరాల్లో ఆత్మహత్యల రేటు 14.8% కాగా, జాతీయ స్థాయి ఆత్మహత్యల రేటు 11.3% కావడం గమనార్హం. మొత్తం ఆత్మహత్యల్లో కుటుంబసమస్యల కారణంగా 33.6%, వివాహ సమస్యలతో 5%, వ్యాధులతో 18% మొత్తం 56.7% సంభవించినట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. అదేవిధంగా, బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వారిలో పురుషులు 70.9% కాగా, మహిళలు 29.1% మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. -
మూడుముళ్లకు బాల్యం బందీ
సాక్షి, బెంగళూరు: ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యం మూడుముళ్లకు బందీ అవుతోంది. దేశంలో కర్ణాటకలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2020లో 185 బాల్య వివాహాలు రాష్ట్రంలో నమోదయ్యాయి. 2019లో 111 వివాహాలతో తో పోల్చితే ఇది 66 శాతం అధికం. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా సమాచారం ప్రకారం ఇందులో కర్ణాటక బాల్య వివాహాల్లో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో అస్సాం –138 వివాహాలు, పశ్చిమ బెంగాల్– 98, తమిళనాడు –77 ఉన్నాయి. 2 వేల పెళ్లిళ్ల అడ్డగింత కర్ణాటక రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం 2020, ఫిబ్రవరి–నవంబర్ల మధ్య కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో 2,074 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. బళ్లారి జిల్లాలో ఎక్కు వగా 218 వివాహాలను నిలువరించారు. ఆ తర్వాత మైసూరు 177, బెళగావి 131, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గల్లో చెరో 107, ఇక బెంగళూరులో 20కి పైగా పెళ్లిళ్లను నిలిపారు. రాష్ట్రంలో 108 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. -
NCRB Report: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నెం.3
సాక్షి, హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2020 సంవత్సరానికి సంబంధించిన జాతీయ స్థాయి గణాంకాలు విడుదల చేసింది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 19 నగరాలను పోల్చినప్పుడు హైదరాబాద్ నగరం ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో మూడో స్థానంలో ఉంది. అలాగే మహిళలపై జరిగే నేరాల్లో ఐదో స్థానం, కిడ్నాప్ కేసుల నమోదులో ఏడో స్థానంలో నిలిచినట్లు ఎన్నీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క నగరంలో 2018 నుంచి హత్య కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీటితో అత్యధికం వివాదాల నేపథ్యంలో జరిగినవే. హత్యకు గురైన వారిలో 18–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హత్య కేసుల విషయంలో హైదరాబాద్ 11వ స్థానంలో ఉంది. ►ఆర్థిక నేరాలకి వస్తే.. నగరంలో 2020 సంవత్సరంలో మొత్తం 3,427 కేసులు నమోదయ్యాయి. 4,445 కేసులతో ఢిల్లీ, 3,927 కేసులతో ముంబై రెండో స్థానంలో ఉన్నాయి. వీటిలో ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులే 3,307 ఉన్నాయి. ►సైబర్ నేరాల నమోదులో నగరానికి రెండో స్థానం. ఇక్కడ 2018లో 428, 2019లో 1379 కేసులు నమోదయ్యాయి. గతేడాది విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య అమాంతం 2553కు చేరింది. వీటిలో ఫ్రాడ్ కేసులు 2020 ఉండగా వాటిలో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ 1366. ►మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. 9,782 కేసులతో ఢిల్లీ, 4583 కేసులతో ముంబై, 2730 కేసులతో బెంగళూరు, 2636 కేసులతో లక్నో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ►నగరంలో నమోదైన కేసుల్లో భర్తలు చేసిన దాషీ్టకాలకు సంబంధించినే 1226 కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో 21 వరకట్న చావులు, 17 ఆత్మహత్యకు ప్రేరేపించడాలు, 131 కిడ్నాప్‌లు నమోదయ్యాయి. ► 4011 కిడ్నాపులతో దేశ రాజధాని మొదటి స్థానంలో ఉంది. 1173 కేసులతో ముంబై రెండు, 735 కేసులతో లక్నో మూడో స్థానంలో ఉండగా... 451 కేసులతో హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ► కిడ్నాప్ బాధితుల్లో మైనర్లకు సంబంధించినవి 95 ఉదంతాలు నమోదు కాగా... వీరంతా బాలికలే కావడం గమనార్హం. మొత్తం 451 ఉదంతా ల్లోనూ 352 కేసులు బాలికలు, మహిళలకు సంబంధించినవే. ►నగరంలో 2018లో 81, 2019లో 86 హత్యలు జరగ్గా... 2020లో ఆ సంఖ్య 71గా నమోదైంది. వీటిలో వ్యక్తిగత కక్షల వల్ల 10, సొత్తు కోసం 4, ప్రేమ వ్యవహారాలతో 3 హత్యలు జరిగాయి. అత్యధికంగా 39 ఉదంతాలు విభేదాల కారణంగా జరిగాయి. ►హతుల్లో పురుషులు 63 మంది, స్త్రీలు 8 మంది ఉన్నారు. అత్యధికంగా 18–30 ఏళ్ల మధ్య వయసు్కలు 41 మంది ఉండగా... వీరిలో 35 మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు. ►చిన్నారులపై నేరాలకు సంబంధించి నగరంలో 467 కేసులు నమోదు కాగా... ఇతర నగరాలతో పోలిస్తే 11వ స్థానంలో ఉంది. వీటిలో 318 ఉదంతాలతో పోక్సో యాక్ట్ కేసులో అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత 95 కేసులు కిడ్నాప్‌లకు సంబంధించినవి. ►2020లో నగర పోలీసులు వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి మొత్తం 4,855 మందిని అరెస్టు చేశారు. -
అత్యాచార భారతం
ముంబైలో మరో నిర్భయ, హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి యూపీలో ఓ అబల, ఎంపీలో మరో నిస్సహాయురాలు ఎటు చూసినా మహిళల ఆక్రందనలే, వారి కన్నీటి కథలే గుండెల్ని పిండేస్తున్నాయి. కరోనా మహమ్మారి కాటేస్తున్న రోజుల్లోనూ కామాంధుల ఉన్మాదాలు ఆగలేదు. న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు, ఘోరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) బుధవారం వెల్లడించింది. భారత్‌లో నేరాలు–2020 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి. అయితే 2019 తో పోలిస్తే కొంతవరకు నేరాల సంఖ్య తగ్గింది. 2020లో మహిళలపై నేరాలు 8.3% తగ్గాయని నివేదిక వెల్లడించింది. 2019లో మహిళలపై నేరాల సంఖ్య 4,05,326 కాగా, 2018లో 3,78,236 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. రాజస్తాలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరగగా.. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 2020లో కరోనా మహమ్మారి వణికించడం, నెలల తరబడి లాక్డౌన్ అమల్లో ఉండడంతో దొంగతనాలు, దోపిడీలు, మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు వంటివి కాస్త తగ్గాయని ఎన్సీఆర్బీ అధికారిక గణంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను యదేచ్ఛగా అతిక్రమించిన కేసులు గత ఏడాది అత్యధికంగా నమోదయ్యాయని ఎన్సీఆర్బీ ‘‘భారత్‌లో నేరాలు–2020’’ అన్న తన నివేదికలో పేర్కొంది. దేశంలో 28% పెరిగిన మొత్తం నేరాల సంఖ్య మొత్తం నేరాల సంఖ్య 2019లో 51,56,158 ఉండగా, 2020లో 28% పెరిగి 66,01,285కి చేరింది. అత్యధికంగా తమిళనాడులో 2019లో 4,55,094 కేసులు నమోదుకాగా, 2020లో 13,77,681కి నేరాల సంఖ్య చేరుకున్నాయి. దేశంలో రోజుకి సగటున 80 హత్యలు జరుగుతూ ఉంటే యూపీ టాప్‌లో ఉంది. దేశం మొత్తమ్మీద గత ఏడాది 29,193 హత్యలు జరిగితే యూపీలో 3,779 హత్యలు జరిగాయి. 2019తో పోల్చి చూస్తే హత్యలు ఒక్క శాతం పెరిగాయి. హత్యల్లో యూపీ తర్వాత స్థానంలో బిహార్ (3,150), మహారాష్ట్ర (2,163), మధ్యప్రదేశ్ (2,101) ఉన్నాయి. 11.8% పెరిగిన సైబర్ నేరాలు ఆన్లైన్లో జరిగే నేరాలు, ఘోరాలు పెరిగాయి. 2019తో పోలిస్తే 11.8% పెరుగుదల కనిపించింది. మొత్తంగా 50,035 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో 11,097 కేసులు నమోదు కాగా, కర్ణాటక (10,741), మహారాష్ట్ర (5,496), తెలంగాణ (5,024) తర్వాత స్థానాల్లో నిలిచాయి. నివేదికలో ఇతర అంశాలు ► మహిళలపై నేరాల్లో అత్యధికంగా భర్త, అత్తింటివారి క్రూరత్వానికి సంబంధించిన కేసులే ఎక్కువ. 1,11,549 కేసులు భర్త, బంధువుల క్రూరత్వానికి సంబంధించినవైతే, కిడ్నాప్ కేసులు 62,300 నమోద య్యాయి. లైంగిక దాడికి సంబంధించిన కేసులు 85,392 నమోదు కాగా, అత్యాచార యత్నం కేసులు 3,741 నమోదయ్యాయి. ఇక మహిళలపై గత ఏడాది 105 యాసిడ్ దాడులు జరిగాయి. 6,966 వరకట్నం మరణాలు సంభవించాయి. ► మధ్యప్రదేశ్ చిన్నారులకి ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతోంది. ఆ రాష్ట్రంలో పిల్లలపై 17,008 నేరాలు జరిగాయి. గిరిజన మహిళలపై అత్యాచార ఘటనల్లో కూడా 339తో మధ్యప్రదేశ్ టాప్‌లో ఉంది. ► 2019 సంవత్సరంతో పోల్చి చూస్తే ఎస్సీలపై నేరాల సంఖ్య 9.4% పెరిగితే, ఎస్టీలపై 9.3% పెరిగింది. ► పర్యావరణానికి సంబంధించిన నేరాల్లో ఈ ఏడాది 78% పెరుగుదల కనిపించింది. 2020లో దీనికి సంబంధించి 61,767 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 2019లో 34,676 కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం (49,710 కేసులు), శబ్ద కాలుష్యం (7,318) కేసులు నమోదయ్యాయి. -
మహిళలను వేధించారు.. నడిరోడ్డుపై..
భోపాల్: మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులకు మధ్యప్రదేశ్ పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే దేవాస్‌లోని ఒక వీధిలో.. రోడ్డు మధ్యలో నిందితులిద్దరినీ కూర్చోబెట్టి, చెవులు పట్టుకొని గుంజిళ్లు తీయించారు. మధ్యప్రదేశ్ పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఓ మహిళా పోలీస్ వీరిని లాఠీతో కొట్టడం కూడా కనిపించింది. (భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..) కాగా.. వార్షిక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2019 నివేదిక ప్రకారం.. భారతదేశంలో మహిళలపై నేరాలు 2018 నుంచి 2019 వరకు 7.3 శాతం పెరిగాయి. ఇదే కాలంలో షెడ్యూల్డ్ కులాలపై నేరాలు కూడా 7.3 శాతం పెరిగాయి. దేశంలో మహిళలపై నేరాలలో మధ్యప్రదేశ్ ఆరోస్థానంలో ఉంది. గత సంవత్సరం రాష్ట్రంలో 27,560 కేసులు నమోదయ్యాయి. -
తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాప్‌ల కలకలం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాప్‌లు పెరుగుతున్నాయి. ఇటీవల మానుకోటలో కిడ్నాపైన బాలుడు దారుణహత్యకు గురైన ఉదంతం మరువక ముందే సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో చిన్నారి సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒకపక్క కిడ్నాప్ కేసులు పెరుగుతుండగా.. మరోపక్క వాటిని ఛేదించడంలోనూ రాష్ట్ర పోలీసులు ముందున్నారు. కిడ్నాప్ ఘటనల్లో 81.5% బాధితుల్ని రికవరీ చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసుల్ని ఛేదించడంలో ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, సిక్కిం తరువాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ (ఎన్సీఆర్బీ)–2019 నివేదిక చెబుతోంది. అపహరణ బాధితుల్లో మూడొంతుల మంది మహిళలు, చిన్నారులే ఉంటున్నారు. రోజుకు ఐదుకుపైగా కేసులు తెలంగాణలో రోజుకు సగటున ఐదు కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. 2017లో 1,560 మంది, 2018లో 1,810 మంది కిడ్నాప్ కాగా, 2019లో ఈ సంఖ్య 2,165కి చేరింది. అంటే ఏటా రోజుకు 5.9 చొప్పున కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసుల్లో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది. అయితే, కిడ్నాప్ అవుతున్న ప్రతీ వంద మందిలో 81.5 మందిని పోలీసులు క్షేమంగా రికవరీ చేస్తున్నారు. 24 గంటల్లోనే ఛేదన.. రికవరీ తెలంగాణలో నమోదవుతున్న వివిధ అపహరణ కేసుల్లో నిందితులను 24 గంటల్లోనే పోలీసులు కనిపెడుతున్నారు. ఇటీవల రాజేంద్రనగర్‌లో బంధువుల చేతిలో డాక్టర్ కిడ్నాప్ కాగా, గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ ఘటనలో మరో పది నిమిషాలు ఆలస్యమైతే డాక్టర్‌ను కిడ్నాపర్లు చంపేసేవారు. ఏపీ, కర్ణాటక పోలీసులను సకాలంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేయడం ద్వారా అతడిని కాపాడగలిగారు. తాజాగా సూర్యాపేటలో నమోదైన కిడ్నాప్ కేసులోనూ పోలీసులు 24 గంటల్లోనే బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సాంకేతికత, సీసీ కెమెరాల సాయంతో నిందితుల గుర్తింపు సులువవుతోంది. 50 శాతానికిపైగా 18 ఏళ్లలోపువారే.. రాష్ట్రంలో కిడ్నాప్ అవుతున్నవారిలో 50 శాతానికిపైగా 18 ఏళ్లలోపువారే. 2019లో రాష్ట్రంలో కిడ్నాపైన 2,165 మందిలో 1,247 మంది 18 ఏళ్లలోపువారేనని (ఇందులో ఆరేళ్లలోపు వారు 50 మంది, 6 –12 ఏళ్లలోపు వారు 120 మంది, 12 –16 ఏళ్లలోపు 405 మంది, 16 –18 ఏళ్లలోపువారు 672 మంది ఉన్నారు) ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 549 మంది పురుషులు, బాలురు కాగా.. 1,616 మంది స్త్రీలు, బాలికలు. అంటే బాధితుల్లో మూడొంతుల మంది మహిళలు, బాలికలే కావడం గమనార్హం. -
మమ్మీ.. ఆ అంకుల్ మంచోడు కాదు!
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై జరిగే లైంగికదాడుల్లో నిందితులు 99 శాతం తెలిసినవారే. ఈ విషయం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)– 2019 రిపోర్టులో వెల్లడైంది. చిన్నారులను అసభ్యంగా తడమడం, లైంగికంగా వేధించడం, వారికి నీలిచిత్రాలు చూపించడం, లైంగికదాడికి పాల్పడటం, వారిని పెళ్లి, ప్రేమపేరుతో వంచించడం∙వంటి నేరాల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గతేడాది తెలంగాణలో పోక్సో యాక్ట్ సెక్షన్ 4, సెక్షన్ 6 కింద 1,180 కేసులు నమోదు కాగా.. మిగిలిన సెక్షన్లు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 1,191గా ఉంది. మాటలతో మాయ చేసే మాయగాళ్ల చేతికి చిక్కుతున్నవారిలో టీనేజీ అమ్మాయిలే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది వెలుగు చూసిన నేరాలను పరిశీలిస్తే.. ఇరుగింటి, పొరుగింటి వారు, వాచ్‌మన్, స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు, టీచర్లు, బంధువులే నిందితులు కావడం గమనార్హం. మొత్తం 1,180 నేరాలు నమోదు కాగా.. అందులో 1,177 మంది నిందితులు పైన పేర్కొన్నవారిలో ఎవరో ఒకరుగా తేలారు. నిందితుల్లో 664 మంది స్నేహితులు, 163 మంది కుటుంబసభ్యులు, మరో 350 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారిలో 99.7 శాతం తెలిసినవారే. 1,180 కేసుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బాలికలకు తెలియనివారు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. తెలిసినవారే అధికం గతేడాది వెలుగు చూసిన నేరాలను పరిశీలిస్తే.. ఇరుగింటి, పొరుగింటి వారు, వాచ్‌మన్, స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు, టీచర్లు, బంధువులే నిందితులు కావడం గమనార్హం. మొత్తం 1,180 నేరాలు నమోదు కాగా.. అందులో 1,177 మంది నిందితులు పైన పేర్కొన్నవారిలో ఎవరో ఒకరుగా తేలారు. నిందితుల్లో 664 మంది స్నేహితులు, 163 మంది కుటుంబసభ్యులు, మరో 350 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారిలో 99.7 శాతం తెలిసినవారే. 1,180 కేసుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బాలికలకు తెలియనివారు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. బాలికలపై జరిగిన అకృత్యాల వివరాలు మొత్తం నేరాలు: 1180 నిందితుల్లో తెలిసినవారు: 1177 కుటుంబ సభ్యులు: 163 అపరిచితులు: ముగ్గురు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు, తదితరులు: 350 ప్రేమ– పెళ్లి పేరిట మోసం చేసినవారు: 664 తెలిసినవారి శాతం: 99.7 శాతం వయసుల వారీగా బాధితులు ఆరేళ్లలోపు బాలికలు: 26 ఆరు నుంచి 12 ఏళ్లలోపు బాలికలు: 75 12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలు: 326 16 నుంచి 18 ఏళ్లలోపు బాలికలు: 764 మొత్తం బాధితులు: 1,191 -
జైళ్లలో ఖైదీలకన్నా నిందితులే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ఖైదీలు కాకుండా నేర విచారణను ఎదుర్కొంటున్న నిందితుల నిర్బంధంతోనే నేడు దేశంలోకి జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ 2019లో విడుదల చేసిన డేటా ప్రకారం 4,78,600 మంది జైలు నిర్బంధంలో ఉండగా, వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు కేసు విచారణను ఎదుర్కొంటోన్న నిందితులే. నిందితుల్లో 37 శాతం మంది అన్యాయంగా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు జీవితం గడుపుతున్న వారే. ఫలితంగా వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడమే కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. (చదవండి : కరోనా టెస్టులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం) జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 64 శాతం మంది వెనకబడిన, నిమ్న వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఎస్సీలకు చెందిన వారు 21.7 శాతం, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 12.3 శాతం, వెనకబడిన వర్గాలకు చెందిన వారు 30 శాతం మంది ఉన్నారు. ప్రతి ఐదుగురు నిందితుల్లో ఒకరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు. దారిద్య్రక పరిస్థితులు, ఉచిత న్యాయ సహాయం దొరక్క పోవడం వల్లనే ఈ వర్గాలకు చెందిన వారు జైళ్లలో మగ్గుతున్నారని సామాజిక శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచంలో 14 దేశాల్లో మాత్రమే విచారణ ఎదుర్కొంటోన్న నిందితులు జైళ్లలో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోకెల్లా లిబియాలోనే అత్యధికంగా అండర్ ట్రయల్స్ జైళ్లలో మగ్గుతుండగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా శాన్ మారినో, బంగ్లాదేశ్, గబన్, పరాగ్వే, బెనిన్, హైతి, ఫిలిప్పీన్స్, కాంగో, కాంబోడియా, బొలీవియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా, యెమెన్ దేశాలుండగా, 15వ స్థానంలో భారత్ ఉంది. (చదవండి : భారత్‌లో పబ్జీ కథ ముగిసినట్లేనా?) విచారణ ఎదుర్కొంటోన్న నిందితుల్లో ఎక్కువ మంది వెనకబడిన,దళిత వర్గాలకు చెందిన వారే కావడం ఒక్క భారత దేశానికి పరిమితం కాలేదని, ప్రపంచంలోనే పలు దేశాల్లో కొనసాగుతోందని, ఇది సమాజంలోని అసమానతలను, వివక్షతలకు అద్దం పడుతోందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ‘సెంటర్ ఫర్ క్రిమినాలజీ అండ్ జస్టిస్’ విభాగానికి చెందిన ప్రొఫెసర్ విజయ్ రాఘవన్ వ్యాఖ్యానించారు. -
ఆత్మహత్య బాధితుల్లో వారే అధికం
న్యూఢిల్లీ: గతేడాది దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 18-30 మధ్య వయస్కులే అధికంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బలవన్మరణానికి పాల్పడిన వారిలో 23.4 శాతం రోజూవారీ కూలీలేనని పేర్కొంది. వీరి తర్వాత 15.4 శాతంతో గృహిణులు రెండోస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారు(11.6 శాతం), నిరుద్యోగులు( 10.1 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అదే విధంగా బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో అత్యధిక మంది పురుషులే ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా కుటుంబ సమస్యల వల్లే అత్యధికంగా 32.4 శాతం బలవన్మరణాలు సంభవించగా.. అనారోగ్య కారణాల వల్ల 17.1 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది.(చదవండి: ‘నువ్వేనా నీ భార్యను చంపింది.. ‘అవును’) కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 18, 916 మంది ఆత్మహత్య చేసుకోగా, 13,493 బలన్మరణాలతో తమిళనాడు రెండోస్థానంలో ఉన్నట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. 12 వేలకు పైగా గణాంకాలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్(12457), కర్ణాటక (11,288) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... 2019లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 7675గా ఉంది. వారిలో 2858 మంది కూలీలు కాగా.. 499 మంది రైతులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 6465 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.(చదవండి: హత్యలు 80 రేప్‌లు 91 కిడ్నాప్‌లు 289) -
అప్పగింతల కర్ర
అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’ ‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’ ‘అణకువగా ఉండు బంగారం..’ ‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’ అన్నీ చెప్పాల్సిన మాటలే. వీటితో పాటు.. ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది. అప్పగింతల కర్ర! ధీమాకు.. ధైర్యానికి. అతడింకా నోరు విప్పలేదు. ‘నువ్వేనా నీ భార్యను చంపింది?’ ‘అవును’. ఎలా చంపావు? ‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’. ‘పాము ఎక్కడిది నీకు?’ ‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’. ‘పాములోళ్లు నీకెలా తెలుసు?’ ‘యూట్యూబ్‌లో అడ్రస్ పట్టుకున్నాను’ ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి? అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే? ∙∙ కట్నంగా ఐదు లక్షల క్యాష్ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్–వ్యాన్ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అతడిది. ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్రూమ్లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది. ∙∙ అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి. భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు. పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్ -
హత్యలు 80 రేప్‌లు 91 కిడ్నాప్‌లు 289
న్యూఢిల్లీ: 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్‌లు! ఒక్కరోజులో భారతదేశం మొత్తమ్మీద నమోదవుతున్న నేరాలు ఘోరాల సగటు ఇది. 2018లో దేశంలో జరిగిన నేరాలపై∙నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతున్న కఠోర వాస్తవం ఇది. 2018లో మొత్తమ్మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువైంది. అయితే ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం 388.6 (2017) నుంచి 383.5(2018)కు తగ్గిందని ఎన్సీఆర్బీ తన నివేదికలో తెలిపింది. ఎక్కువైన వ్యవసాయ రంగం ఆత్మహత్యలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గత ఏడాది సుమారు 10,349 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. దేశం మొత్తమ్మీద వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్న వారు 7.7 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2017 సంవత్సరం నాటి రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో ఆత్మహత్యలు 3.6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ‘పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయా, గోవా, చండీగఢ్, దామన్ అండ్ దయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చెరిలలో రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదు’ అని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. వ్యవసాయ కూలీఉలు మొత్తం 4,586 మంది ఆత్మహత్యలకు పాల్పడగా వీరిలో 4071 మంది పురుషులు, 515 మంది మహిళలు ఉన్నారు. అన్ని రకాల ఆత్మహత్యల్లో 17,972తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తమిళనాడు (13,896), పశ్చిమబెంగాల్ (13,255) రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వివాదాలతోనే ఎక్కువ హత్యలు 2018లో 29,017 హత్య కేసులు నమోదయ్యాయని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.7 శాతం ఎక్కువని నివేదిక తెలిపింది. వివాదాల కారణంగా జరిగిన హత్యలు 9,623 కాగా, వ్యక్తిగత ద్వేషం, పగ వంటి కారణాలతో 3,875 మంది హత్యకు గురయ్యారు. లాభం కోసం చేసిన హత్యల సంఖ్య 2,995. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగి 1.05 లక్షలకు చేరింది. కిడ్నాపైన వారిలో 80 వేల కంటే ఎక్కువ మంది మహిళలు కాగా, పురుషుల సంఖ్య 24,665 మాత్రమే. అంతేకాదు.. కిడ్నాపైన మొత్తం 1.05 లక్షల మందిలో 63,356 మంది బాలబాలికలు కావడం గమనార్హం. కిడ్నాపైన వారిలో 92,137 మంది (22,755 మంది పురుషులు, 69, 382 మంది మహిళలు)ని పోలీసులు కిడ్నాప్ చెర నుంచి విడిపించగలిగారు. మొత్తం 91, 709 మందిని సజీవంగా వెనక్కు తీసుకు రాగలిగితే.. 428 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. -
బూచోళ్లు పెరిగారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బూచోళ్లు పెరిగారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2018 గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 2017తో పోల్చినప్పుడు 2018లో కిడ్నాప్‌లు, చిన్నారులపై అఘాయిత్యాల్లో పెరుగుదల కనిపించింది. హత్యలు, ఆర్థిక నేరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో గణనీయమైన తగ్గుదల నమోదవ్వడం విశేషం. తీవ్ర నేరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పెరుగుదల కనిపించడం గమనార్హం. అన్ని రకాల నేరాల్లో అత్యధిక కేసు లు నమోదైన ఉత్తర్‌ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2018లో జరిగిన నేరాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో రోజుకు 347 కేసులు.. ఐపీసీ సెక్షన్ల దృష్ట్యా మహారాష్ట్ర 3,46,291 కేసుల నమోదుతో అగ్రస్థానంలో ఉండగా.. ఇది జాతీయ వాటాలో 11.1% ఉంది. ఇక తెలంగాణలో 2018లో 1,13,951 నేరాలు నమోదవ్వగా, జాతీయావాటాలో 3.6%. 2017 లో 1,19,858గా ఉంది. 2018లో ఈ నేరాల్లో 5,907 కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2018లో 1,13,951 ఐపీసీ, ఎస్ఎల్ఎల్ (స్పెషల్ లోకల్ లా) కింద 12,907 కేసుల మొత్తం 1,26,858 కేసులు అవుతాయి. సగటున రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 347 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన నేరాల్లో యూపీదే అగ్రస్థానం తీవ్రమైన నేరాల జాబితాలో 65,155 నేరాలతో జాతీయ వాటాలో 15.2 శాతంతో దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2018లో తెలంగాణలో 7,652 తీవ్ర నేరాలు నమోదవ్వగా.. మన జాతీయవాటా 1.8 శాతంగా ఉంది. 2017లో ఈ సంఖ్య 7,633గా నమోదైంది. 2018లో 19 కేసులు అధికంగా నమోదయ్యాయి. తెలంగాణలో తగ్గిన హత్యలు.. 4,018 హత్యకేసులతో 13.8% జాతీయవాటాతో ఉత్తర్‌ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. 2018లో 786 హత్య కేసులతో తెలంగాణ 2.7 శాతం జాతీయ వాటా నమోదు చేసింది. 2017లో 807 హత్య కేసులు నమోదయ్యాయి. 2018లో 21 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కిడ్నాప్ల్లోనూ యూపీనే.. 21,711 కిడ్నాప్లతో దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ 20.5% తో తొలిస్థానంలో నిలిచింది. 2018లో తెలంగాణలో 1,810 కిడ్నాప్ కేసులతో 1.7% నమోదు చేసింది. 2017లో 1,560 కేసులు నమోదు కాగా.. 2018లో 210 కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య 16,027.. 59,445 మహిళలపై నేరాలతో 15.7% వాటాతో యూపీనే టాప్. 2018లో తెలంగాణ 16,027 నేరాలతో 4.2 శాతం జాతీయ వాటా నమోదైంది. 2017లో తెలంగాణలో 17,521 నేరాలు నమోదయ్యాయి. ఈ లెక్కన 2018లో 1,494 నేరాలు తక్కువగా నమోదయ్యాయి. ఆరు గ్యాంగ్‌రేప్ అనంతరం హత్య ఘటనలు కాగా, 186 వరకట్న చావులు, 459 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8 గర్భవిచ్ఛిత్తి కేసులు , 10 మంది మహిళలపై యాసిడ్ దాడులు, 5 యాసిడ్ దాడి యత్నాలు, భర్త, అత్తింటి వేధింపులు 6,286 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరిగిన చిన్నారులపై అకృత్యాలు.. చిన్నారులపై అకృత్యాల్లో 19,936 నేరాల నమోదు (14.1 శాతం జాతీయ వాటా)తో యూపీ టాప్‌లో నిలిచింది. 2018లో తెలంగాణ 3,747 నేరాలతో 2.6 శాతం జాతీయ వాటా నమోదైంది. 2017లో తెలంగాణలో 3,580 నేరాలు నమోదుకాగా.. 2018లో 167 కేసులు అధికంగా నమోదయ్యాయి. బాలనేరస్తుల్లో మహారాష్ట్ర టాప్.. 5,880 మంది బాలలు నేరాలకు పాల్పడ్డ మహారాష్ట్ర 18.6 శాతం జాతీయ వాటాతో తొలిస్థానంలో నిలిచింది. 2018లో 1,408 మంది బాల నేరస్తులపై కేసులతో 4.5 శాతం జాతీయ వాటాను తెలంగాణ నమోదు చేసింది. 2017లో ఈ గణాంకాలు 1,365గా ఉన్నాయి. ఈసారి 43 నేరాలు అధికంగా నమోదయ్యాయి. సీనియర్ సిటిజన్లపై కూడా.. సీనియర్ సిటిజన్లపై 5,961 నేరాలు, 24.5 శాతం జాతీయవాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ విషయానికి వస్తే.. 1,062 నేరాలతో 4.4 శాతం జాతీయవాటాగా నమోదైంది. 2017లో తెలంగాణలో ఈ నేరాల సంఖ్య 1,308గా ఉంది. 2018 లో 246 కేసులు తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 11,924 కేసులతో 27.9 శాతం జాతీయవాటాతో యూపీ టాప్‌లో నిలిచింది. 2018లో 1,507 కేసులతో తెలంగాణ 3.5% నమోదుచేసింది. 2017లో ఈ కేసుల సంఖ్య 1466గా నమోదైంది. ఈసారి 41 కేసులు పెరిగాయి. సైబర్ నేరాల్లో తెలంగాణ వాటా 6.6 శాతం 22,822 ఆర్థిక నేరాల (14.6 శాతం)తో యూపీ జాతీయవాటాలో అగ్రస్థానం దక్కించుకుంది. 2018లో తెలంగాణ 10,390 నేరాలతో 6.6% నమోదు చేసింది. 2017లో ఈ నేరాల సంఖ్య 10,840గా ఉంది. 2018లో 450 కేసులు తక్కువగా నమోదయ్యాయి. సైబర్‌క్రైమ్స్‌లో యూపీదే 23%.. 6,680 సైబర్ నేరాల (23 శాతం)తో యూపీ టాప్‌లో ఉంది. 2018లో తెలంగాణ 1,205 నేరాలు, 4.4 నమోదు చేసింది. 2017లో ఈ నేరాల సంఖ్య 1,209గా ఉంది. అంటే 4 నేరాలు తక్కువగా నమోదయ్యాయి. మానవ అక్రమరవాణాపై రాష్ట్రంలో 242 కేసులు 373 మానవ అక్రమరవాణా కేసులతో 15.1 శాతం జాతీయవాటాతో జార్ఖండ్ తొలిస్థానంలో నిలవగా.. 2018లో తెలంగాణ 242 కేసులతో 9.8 శాతం జాతీయ వాటా నమోదైంది. మైనర్ల అదృశ్యం కేసుల్లో మధ్యప్రదేశ్ టాప్.. మైనర్ల అదృశ్యం కేసుల్లో 15,320 కేసులతో మధ్యప్రదేశ్ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక రాష్ట్రంలో 2018లో 4,410 మంది మైనర్ల (2,668 బాలికలు, 1,742 బాలురు) అదృశ్యం కేసులు నమోదయ్యాయి. మేజర్ల విషయానికొస్తే.. 5,992 మంది (2,919 మహిళలు, 3,073 పురుషులు) అదృశ్యమయ్యారు. వీరిని తిరిగి కనిపెట్టే విషయంలో పెద్ద రాష్ట్రాల్లో 75% పురోగతితో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ 13,233 మంది ఆత్మహత్యలు.. రాష్ట్రంలో 2018లో 13,233 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది జాతీయవాటాలో 5.8%. 2016 నుంచి 2018 వరకు మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు చూసినపుడు అండమాన్ నికోబార్ 41.0తో అగ్రస్థానంలో ఉండగా.. 21.2 రేటుతో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న ఆత్మహత్యలకు 30.4%తో కుటుంబ సమస్యలే ప్రధాన కారణంగా నిలిచాయి. -
‘ఉన్నావ్’ తీర్పు నేడే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశముంది. ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశాలు జారీ చేశారు. నిర్భయ దోషులను నేను ఉరి తీస్తా హోంమంత్రికి షూటర్ వర్తికా సింగ్ రక్తంతో లేఖ లక్నో: నిర్భయ కేసులో దోషులను ఉరి తీసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘నా చేతిలో ఉన్న లేఖ హోంమంత్రి అమిత్‌షాకు రాశా. నా రక్తంతో రాసిన ఈ లేఖను రిజిస్టర్డ్ పోస్టులో ఆయనకు పంపా. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరా. భారత్‌లో మహిళలను దేవతలుగా చూసే సంస్కృతి బలోపేతానికి ఈ అంశం దోహదపడుతుంది. ఈ సందేశం ప్రపంచం మొత్తానికి వెళ్లాలి. అలాగే మహిళ కూడా ఉరి తీయగలదన్న విషయాన్ని అత్యాచార దోషులు తెలుసుకోవాలి. ట్వీట్ కూడా చేశా’అని తెలిపారు. మహిళా సైనికులు, మహిళా నటులు, ఎంపీలు, సంస్థలు తనకు మద్దతు తెలపాలన్నారు. మరోవైపు నిర్భయ దోషులను తాము ఉరి తీస్తామంటూ తీహార్ జైలు అధికారులకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. నిర్భయ కేసు దోషి ఒకరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నేర నిరూపణ 32 శాతమే! అత్యాచార ఘటనల్లో క్షేత్రస్థాయిలో లోపిస్తున్న శాస్త్రీయ విచారణ చార్జిషీటు దాఖలులోనూ అలసత్వం.. న్యూఢిల్లీ: సరిగ్గా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యంత పాశవికమైన నిర్భయ ఘటన ఇప్పటికీ దేశ ప్రజల గుండెల్లో పచ్చి పుండులాగే ఉంది. దేశంలో ఎన్నో నిర్భయ లాంటి సంఘటనలు జరుగుతున్నా.. నిందితులపై నేర నిరూపణ మాత్రం జరగట్లేదు. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై అత్యాచారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా నిందితులకు మాత్రం శిక్షలు అమలు కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల్లో 32.2 శాతం మాత్రమే నేర నిరూపణ జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో–2017 డేటా ప్రకారం తెలుస్తోంది. 2017లో దేశవ్యాప్తంగా మొత్తం 1,46,201 కేసుల్లో విచారణ చేపట్టగా, కేవలం 5,822 కేసుల్లోనే నేర నిరూపణ జరిగింది. అత్యాచార ఘటనలు పెరుగుతున్నా.. చార్జిషీటు దాఖలు రేటు మాత్రం తగ్గుతోంది. అంతేకాకుండా కోర్టు వరకు చాలా కేసులు వెళ్లకపోవడం మరింత ఆందోళన చెందాల్సిన విషయం. చార్జిషీటు దాఖలు రేటు 2013లో 95.4 శాతం ఉండగా, 2017 వచ్చేసరికి 86.6 శాతానికి తగ్గింది. ఒడిశా మాజీ డీజీపీ బీబీ మహంతీ.. ఓ విదేశీ పర్యాటకురాలిని అత్యాచారం చేసిన కేసులో డిఫెన్స్ లాయర్ శిల్పి జైన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న పోలీసు అధికారుల్లో నైపుణ్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘చార్జి షీటు దాఖలు చేసే విషయంలో సబ్ఇన్స్పెక్టర్దే కీలక పాత్ర. అంటే ఆ చార్జిషీటు విషయం ఎంత శాస్త్రీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఈ కేసులను చేపట్టే న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. విచారణ సరిగ్గా జరపకపోవడం, కోర్టులో కేసులు నిలవకపోవడం వల్లే నేర నిరూపణ శాతం చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ కారణంగానే ఎక్కువ హత్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రేమవ్యవహారాల వల్లే భారత్‌లో అత్యధిక హత్యలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికల్లో వెల్లడైంది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడవ అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధికంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవే. ఇక ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రెండవ స్థానంలో ప్రేమవ్యవహార హత్యలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలే ఉన్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2001లో దేశావ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదు కాగా, 2017లో 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదు అయ్యాయి. ఇక వ్యక్తిగత కక్ష్యతో చేసే హత్యలు 4.3శాతం తగ్గాయి. ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యల సంఖ్య కూడా 12 శాతం తగ్గింది. ప్రేమ వ్యవహారాలు మరియు వివాహేతర సంబంధాల వల్లే 28శాతం హత్యలు జరుగుతున్నాయని వెల్లడైంది. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదు అయ్యాయి. -
వెలుగు నీడల నివేదిక
దేశంలో నేరాల తీరెలా ఉన్నదో... ఏ రకమైన నేరాలు తగ్గాయో, ఏవి పెరిగాయో తెలుసుకోవడానికి సాధారణ ప్రజానీకం మొదలుకొని ప్రభుత్వ విభాగాల వరకూ అందరూ జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) వెలువరించే నివేదికలపై ఆధారపడతారు. సామాజిక పరిశోధకులకు సైతం అవి ప్రధాన వనరు. అలాంటి నివేదిక ఆలస్యమైందంటే అందుకు తగిన కారణాలుండాలి. కనీసం అలా ఆలస్యంగా వచ్చినందుకైనా అంతక్రితం నివేదికలతో పోలిస్తే సమగ్రంగా ఉండాలి. కానీ మంగళవారం వెలువడిన 2017నాటి ఎన్సీఆర్బీ నివేదిక ఆ విషయంలో కొంత నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఇందులో కొత్త వర్గీకరణలు లేకపోలేదు. ముఖ్యంగా తొలిసారి మహిళలు, పిల్లలపై జరుగు తున్న అఘాయిత్యాలను మరిన్ని విధాల వర్గీకరించారు. అలాగే దళితులపై సాగుతున్న దమన కాండకు సంబంధించి అయినా, అవినీతి ఉదంతాలనైనా ఈ విధంగానే వివరించారు. చర్య తీసుకోవ డానికి పోలీసులకు పట్టిన సమయం, అనంతరం న్యాయస్థానాల్లో నేరగాళ్లకు శిక్ష పడటానికి పట్టిన సమయం తదితరవివరాలిచ్చారు. దళితవర్గాలపై దాడులకు సంబంధించి జరిగే నేరాల తీరుతెన్ను లిచ్చారు. అలాగే తొలిసారి అత్యాచారాలకు సంబంధించి కూడా వేర్వేరు వర్గీకరణలిచ్చారు. మహి ళలపై అత్యాచారం చేసి హతమార్చిన సందర్భాలు, వారిపట్ల, పిల్లలపట్ల సాగుతున్న సైబర్ నేరాలు ఇవ్వడంతోపాటు పిల్లలపై జరిగిన అఘాయిత్యాలు ఏ ఏ సెక్షన్ల పరిధిలోకొచ్చాయో తెలిపారు. బెది రింపు కేసులు, నేరాన్ని ప్రోత్సహించిన వైనాలు, వేధింపులు, గాయపర్చడం వంటివి సైతం ప్రస్తా వించారు. మరో విశేషమేమంటే ఆన్లైన్ మోసాలు, డెబిట్/క్రెడిట్ కార్డు మోసాలు, ఇంటర్నెట్ నేరాలు, బిచ్చమెత్తించడం కోసం అపహరణలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇలాంటి వివరాలు పోలీసులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వర్తించడానికి దోహదపడతాయి. తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలేమిటన్న అంశంలో స్పష్టతనిస్తాయి. అయితే దేశాన్నంతా కలవరపరిచి, చివరకు సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తపరిచి, ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించిన మూకదాడుల విషయంలో నివేదిక మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ దేశంలో ఏనాటినుంచో ఉన్నవే అయినా ఈమధ్య కాలంలో అవి ఒక్కసారిగా పెరిగిన తీరు ఆందోళనకరం. మూకదాడులకు ఫలానా కారణమని చెప్పడానికి లేదు. పశువుల్ని తరలి స్తున్నారన్న ఆరోపణలు మొదలుకొని పసిపిల్లల్ని అపహరించడానికి వచ్చారనే అనుమానాల వరకూ అందుకు సవాలక్ష సాకులున్నాయి. ఇంకా పశు మాంసం దగ్గరుంచుకున్నారని, ఇష్టం లేని పెళ్లి చేసు కుని కుటుంబం పరువు తీశారని, తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని–ఒకటేమిటి ఏదో ఒక కారణం చెప్పి ఉన్మాద మూకలు వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీసిన ఉదంతాలున్నాయి. అలాంటి దాడుల్లో నిలువెల్లా గాయపడి నెత్తురోడుతున్నవారిపట్ల పోలీసులు కనికరం లేకుండా, వారిని వైద్య చికిత్సకు పంపకుండా జాప్యం చేసిన ఘటనలున్నాయి. వాటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి మనిషన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ఆ దృశ్యాలు చూసినా, అలా చూసినవారు చెప్పగా విన్నా మనసు వికలమవుతుంది. అంతటి ఘోరాల విషయంలో ఎన్సీఆర్బీ మౌనం వహిం చడం సబబు కాదు. ఇతర నేరాల విషయంలో పలు వర్గీకరణలు, అందులో మరిన్ని ఉప వర్గీకరణలు చేసిన నివేదిక ఖాప్ పంచాయతీల గురించి కూడా చెప్పలేదు. సాగు సంక్షోభం పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఉసురుతీసుకుంటున్న రైతుల ప్రస్తావన కూడా ఈ నివేదికలో లేదు. రైతులు ప్రాణాలు తీసుకోవడానికి రకరకాల కారణాలు కనబడతాయి. పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, ప్రకృతి సహకరించక పంట ఎండిపోవడం, వడ్డీ వ్యాపారుల వేధింపులు, పిల్లల్ని చదివించలేక పోవడం తదితరాలు ప్రస్తావనకొస్తుంటాయి. కానీ వీటి మూలాలు సాగు సంక్షోభంలోనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలపై గణాంకాలు అందుబాటులో ఉంటే ఈ సాగు సంక్షోభ నివారణకు ఇంకేమి చర్యలు అవసరమో ఆలోచించడానికి ప్రభుత్వాలకు వీలవుతుంది. మరింత మెరుగైన పరిష్కారాల కోసం అన్వేషణ సాగుతుంది. సైబర్ నేరాలు 77శాతం పెరిగాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. అందులో దేశంపై ద్వేషాన్ని పెంచేవి, రాజకీయ నేరాలు, ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల నేరాలు ఉన్నాయి. అవి ఎక్కడ అధికంగా జరుగుతున్నాయో వివరాలివ్వడం ఇందులో కనబడుతుంది. రాజ ద్రోహ నేరాల సంఖ్య 45 శాతం పెరగడం, ఆ ఏడాది 228మంది ఈ నేరం కింద అరెస్టుకావడం గమనించదగ్గది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల తీరుపైనా, అందుకు దారితీస్తున్న కారణాలపైనా నివేదిక దృష్టి సారించింది. ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల్లో మూడు నెలల్లో చార్జిషీటు దాఖలు చేయాలన్న నిబంధన ఉన్నా 60 శాతం కేసుల్లో అది జరగటం లేదు. పర్యవసానంగా ఏడాదికి మించి జాప్యం జరిగిన కేసులు 3 లక్షలకు పైగా ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లోనూ ఈ కార ణంగా వేలాది కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. దళితులపై సాగుతున్న అఘాయిత్యాలు అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఈ నేరాల్లో సగానికిపైగా అవమానాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం దళితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసినవే కావడం చూస్తే వారిలో గతంతో పోలిస్తే ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందన్న సంగతి అర్ధ మవుతుంది. దేశంలో వెంటవెంటనే శిక్షలు పడే వ్యవస్థ ఉంటే నేరాల నియంత్రణ సులభమవుతుంది. అందులో విఫలమైనప్పుడే అవి ఉగ్రరూపం దాలుస్తాయి. ఇంకా ఎలాంటి చట్టాలు తీసుకురావాలో అధ్యయనం చేయడానికి, ఉన్నవాటిని పటిష్టపరచడానికి ఈ మాదిరి నివేదికలు ఎంతో దోహద పడతాయి. కానీ అవి సకాలంలో వచ్చినప్పుడే, సవిస్తరంగా ఉన్నప్పుడే అన్నివిధాలా ఉపయోగ పడుతుంది. అందువల్ల ప్రభుత్వాల పనితీరు పదునుదేరుతుంది. ఈ సంగతి ఎన్సీఆర్బీ పెద్దలతో పాటు కేంద్రం కూడా గుర్తించాలి. -
పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రతి పది నిమిషాలకు ఓ బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతున్నారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెబ్సైట్ వెల్లడిస్తోంది. ఈ లెక్కన గతేడాది దేశంలో 54, 750 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వారిలో సగం మందిని మాత్రమే పోలీసులు కనుగొన్నారు. మిగతా వారు పోలీసులకు దొరకలేదంటే వారంతా గల్లంతైనట్లే! జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ప్రకారం 2016 సంవత్సరంలో 63,407 మంది కిడ్నాప్ అయ్యారు. 2016 నుంచి ఏడాదికిపైగా గడిచిన కాలంలో ఏకంగా 1,11,569 మంది పిల్లలు అదృశ్యమయ్యారని, వారిలో దాదాపు సగం మంది పిల్లల ఆచూకీ మాత్రాన్నే పోలీసులు కనుగొనగలిగారని జాతీయ నేరాల రికార్డు బ్యూరో తెలియజేసింది. ఈ గల్లంతైన వారి పిల్లల్లో వివిధ జాతులు, మతాలు, సంస్కతి , సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. భారత్‌లో 18 ఏళ్లకు లోపు పిల్లలు దాదాపు 40 కోట్ల మంది ఉన్నారని, దేశ జనాభాలో యువత, పిల్లల సంఖ్య 55 శాతం ఉంటుందన్నది మరో అంచనా. ఇలా పిల్లలు అదృశ్యమైన కేసుల్లో చాలా వరకు పోలీసుల వద్దకు రావడం లేదని, కొన్ని వచ్చినా వాటిని పోలీసులు నమోదు చేయడం లేదని తెల్సింది. ప్రతి కేసును నమోదు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా పోలీసులు పట్టించుకోవడం లేదు. పిల్లలు అదృశ్యమయ్యారంటే ఒక్క ఫిర్యాదు అందినా వెంటనే కిడ్నాప్ కేసును నమోదు చేయాలని 2013లో సుప్రీం కోర్టే స్వయంగా పోలీసులకు ఆదేశించినా పోలీసులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. తమ పిల్లలు తప్పి పోయారంటూ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడల్లా ‘ఆ ఇంటి నుంచి పారిపోయి ఉంటారు, నాలుగు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారు’ అంటూ చెప్పి పంపించడం పోలీసులకు పరిపాటిగా మారిపోయిందని స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో పిల్లలను ఎత్తుకుపోయే వారొచ్చారంటూ ప్రజలే మూక హత్యలకు పాల్పడుతున్నారు. గత రెండు నెలల కాలంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రలో వందకు పైగా మూక హత్యలు చోటు చేసుకున్నాయి. గత వారం రోజుల్లో, ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 20 మూక దాడులు జరిగాయి. ప్రత్యక్షంగా వదంతుల కారణంగా మూక దాడులు జరుగుతుంటే పరోక్షంగా కిడ్నాప్ కేసుల్లో పోలీసులు స్పందించక పోవడమేనని ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. వ్యభిచారం, వెట్టి చాకిరీల కోసమే దేశంలో పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు 1956 నాటి మానవ అక్రమ రవాణా చట్టాన్ని సవరించాల్సి ఉంది. -
ఇల్లు చాలా డేంజర్
పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధిత మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది కూడా చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్ క్రైమ్ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో కలిసి పుట్టింటికి చేరుతున్నాయని చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాయి. ఎందుకీ ప్రయత్నం? దేశాల కోసం. మరింత మెరుగైన నివారణ చర్యలు చేపడతాయేమోనని. ఎందుకీ ప్రయాస? మగాళ్ల కోసం. తప్పు తెలుసుకుని కాస్తయినా మారతారేమోనని! అయినా ఈ గృహహింసల్ని, గృహహింస మరణాల్ని లెక్కేయడం ఎలా సాధ్య మౌతుందనిపిస్తుంది. జనాభా లెక్కల వాళ్లయినా, ఇంటికొచ్చి తలుపు తట్టి ‘ఎంతమంది ఉన్నారు?’ అని అడిగే కదా రాసుకుని వెళతారు. ఏదైనా అంతే. ఇళ్లు, కోళ్లు, కార్లు, స్టౌవ్‌లు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు.. ఏవైనా. ఇవన్నీ చూసి.. ఉన్నవాళ్లింతమంది, లేనివాళ్లింతమంది అని టిక్ చేసుకుని వెళతారు. ఉండీ లేనట్లు కనిపించేవాళ్లు లెక్కలకు అందరు. గృహబలిమిని ఇలా ఏదో ఒక స్కేల్లో లెక్కేయగలరు గానీ, ‘గృహబలుల్ని’ ఎలానూ లెక్కేయలేరు. భర్త, అత్తమామలు కొడుతున్నారని బాధితురాలు బయటికి రావాలి. భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని చనిపోయిన మహిళ అన్నో నాన్నో బయటికి రావాలి. వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. పోలీస్‌లు ఎఫ్.ఐ.ఆర్. రాయాలి. అప్పుడే ఐరాసకు గానీ, నేషనల్ క్రైమ్ బ్యూరోకి గానీ లెక్క అందుతుంది. ఆ లెక్కల్ని తక్కెడలో వేసి పోయినేడాది కంటే ఈ ఏడాది ఇంత హింస పెరిగిందనీ, లేదంటే ఇంత హింస తగ్గిందనీ, ఆ దేశం ఈ దేశం కంటే బెటరనీ, ఈ దేశం ఆ దేశం కంటే వరస్ట్ అనీ డేటాను విశ్లేషించి, విడుదల చేస్తారు. మరి విశ్లేషణకు అందని డేటా మాటేమి? నాలుగ్గోడల మధ్యే సమాధి అయిపోతుంది.. ఏనాటికీ గొంతెత్తని, గొంతెత్తే పరిస్థితే లేని అసహాయురాలైన మహిళలా! ఇల్లు చాలా డేంజర్. ఎందుకంటే.. నాలుగ్గోడల మధ్య స్త్రీకి రక్షణా ఉంటుంది, రక్షణ లేని విషయాన్ని బయటపడనివ్వని అడ్డూ ఉంటుంది. లోపల అమ్మాయి ఎలా ఉందో లోపలికి వెళ్లకుండా తెలుసుకోలేం. లోపలికి వెళ్లినా అమ్మాయి బయటపడకుంటే అప్పుడూ తెలుసుకోలేం. వెలుగులోనే ఎంత అంధకారం! ‘నా తల్లి నవ్వులో ఎన్ని వెన్నెల పువ్వులో’.. అనుకుంటూ ఆమె కోసం ఊర్నుంచి తెచ్చినవేవో ఇచ్చి, కడుపునిండా తృప్తితో అమ్మానాన్న తిరిగి బసెక్కడానికి వచ్చేస్తే.. వారితో పాటు అమ్మాయి ఆక్రందన బస్సువరకూ వినిపిస్తుందా? ఊహు! స్త్రీకి బయట ఏదైనా జరుగుతుంటే ఏ పుణ్యాత్ములైనా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఏ ధైర్యవంతులైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. అడ్డుపడేవాళ్లు, పోలీసులకు ఫోన్ చేసేవాళ్లూ ఎవరూ లేకపోయినా ఆ మహిళ ప్రాణరక్షణ కోసం కనీసం పరుగెత్తిపోయే అవకాశమైనా ఉంటుంది.. రోడ్డు మీద నాలుగు గోడలు ఉండవు కాబట్టి. ఇల్లు అలాక్కాదు. ఇల్లు తప్పించుకుపోనివ్వదు. బైట గేట్లేసి ఉంటాయి. లోపల ఇంటి తలుపులు వేసి ఉంటాయి. వెనక దారి ఉంటే అవీ మూసి ఉంటాయి. ఇంకెక్కడికి తప్పించుకోవడం? హాల్లోంచి కిచెన్‌లోకి, కిచెన్‌లోంచి బాత్రూమ్లోకి, బాత్రూమ్లోంచి ఇంకో గదిలోకి, ఆ ఇంకో గదిలోంచి.. బెల్ట్ చేత్తో పట్టుకున్న వాడి దగ్గరకి, వాడి బెల్టు జారకుండా చేత్తో పట్టుకుని ఉన్న వారి దగ్గరికి, కొట్టీ కొట్టీ వాడు అలసిపోతే, వాడిని లేపి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గరికి! కొడుతున్న దెబ్బలు, పెడుతున్న పెడబొబ్బలు పక్కింటికైనా వినిపించవు. ఎవరి గృహహింస వారిదైపోయాక ఇంకేం పక్కిళ్లు! ఈ ఏడాది జూన్‌లో.. ‘స్త్రీకి ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్ కంట్రీ.. ఇండియా’ అని ఒక రిపోర్ట్ వచ్చింది. లండన్‌లోని ‘థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ ఇచ్చింది ఆ నివేదిక. ‘మీ కోడల్ని చంపుకుతింటున్నారటగా’ అని అడిగితే.. ‘అబ్బెబ్బే ఇంకెవరి కోడలి గురించైనా మీరు విని ఉంటారు’ అని భుజాలు తడుముకున్నట్లు.. ఇండియా వెంటనే ఖండించింది. ‘ఏ దేశాన్ని చూసి ఏ దేశం అనుకున్నారో..’ అని రాయిటర్స్ ఫౌండేషన్ మీద మన ఉమన్ డెవలప్మెంట్ శాఖలోని అధికారులు సెటైర్ వేశారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మరో నివేదిక వచ్చింది. అదే.. ఐరాస వాళ్లది. మహిళకు ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్.. ఆమె ఇల్లేనట! మనదేశ మహిళకు అని కాదు. ఏ దేశంలోనైనా గృహమే మహిళకు నరక సీమ అని ఐక్యరాజ్య సమితి రూఢీ చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఎవరూ వ్యతిరేకించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉండిపోయారు.. కొత్త విషయం ఏముంది ఇందులో అన్నట్లు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లపై హింస జరుగుతోంది’ అని న్యూయార్క్ నుంచి ఐరాస వచ్చి చెప్పాలా? ఇంటాయనకు తెలీదా! ఆయనకు సపోర్టుగా ఆమెను జుట్టు పట్టుకుని కొట్టే ఇంటి మనుషులకు తెలీదా? ఏమిటి దీనికి పరిష్కారం? ఇంట్లోంచి బయటికి వచ్చేయడం. ఒంటిపై.. కనిపించకుండా ఉండి, కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న గాయాలను బయటికి చూపించడం. స్త్రీ మాన మర్యాదల్ని భంగపరిచే ఇంటికి గౌరవం ఉన్నట్లు? దాన్ని దాచాల్సిన అవసరం ఏం ఉన్నట్లు? పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధితుల మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. లెక్కలు కాకుండా ఐరాస ఇంకా ఏం చెప్పింది? ► ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళల ‘గృహమరణాలను’ ప్రపంచ దేశాలు ఆపలేకపోతున్నాయి. ► 2012 నుంచి మహిళల గృహమరణాలు మరీ ఎక్కువయ్యాయి. మహిళల గృహమరణాలను తగ్గించడానికి, నిర్మూలించడానికి ఐరాసా ఏం చెయ్యాలంది? ► పోలీసు వ్యవస్థకు, నేర విచారణ వ్యవస్థకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య సమన్వయం ఉండాలి. ► గృహమరణాల వెనుక ఏ విధమైన ఉద్దేశాలు ఉంటున్నాయో, వాటి మూల కారణాలేమిటో అధ్యయనం చేయాలి. ► గృహమరణాలను తగ్గించడానికి పురుషుల సహాయాన్నీ తీసుకోవాలి. పురుషాధిక్యం, స్రీవిధేయత అనే పూర్వపు భావజాలాలను మార్చే ప్రయత్నం చేయాలి. మన దేశంలో? మామూలే. డౌరీ డెత్స్. వరకట్న మరణాలు! ఇండియాలో సంభవిస్తున్న మహిళల గృహమరణాలలో ఎక్కువ భాగం వరకట్నం వేధింపుల వల్లనేనని యు.ఎన్.ఒ.డి.సి నివేదిక పేర్కొంది. ఇందుకోసం 2016 నాటి సర్వే వివరాలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ ఏడాది భారతదేశంలో మహిళల బలవన్మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ఇది.. మహిళల పాలిట నరక దేశాలని మనం భావిస్తున్న కెన్యా కంటే (2.6), టాంజానియా కంటే (2.5), అజర్బైజాన్ కంటే (1.8), జోర్డాన్ కంటే (0.8), తజికిస్తాన్ కంటే (0.4) ఎక్కువ! మరొక సంగతి. 15–45 ఏళ్ల మధ్య వయసులోని భారతీయ మహిళల్లో 33.5 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. మన దేశ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం ఏటా సంభవిస్తున్న మహిళల గృహ మరణాలలో 40 నుంచి 50 శాతం వరకు వరకట్నం వల్ల సంభవిస్తున్నవే. ప్రపంచవ్యాప్తంగా 2017లో బాలికలు, యువతులు, మహిళల బలవన్మరణాలు 50,000: భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో, చేతలవల్ల దుర్మరణం పాలైన మహిళల సంఖ్య. 17,000: పై యాభై వేలల్లో భర్త, లేదా పూర్వపు భర్త పెట్టిన భౌతికహింస తాళలేక దుర్మరణం చెందిన మహిళల సంఖ్య. 87,000: లైంగిక వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన మొత్తం మహిళలు, బాలికల సంఖ్య (పై 50 వేల మందితో కలిపి). 137: గృహహింస కారణంగా చనిపోతున్న మహిళల సంఖ్య.. రోజుకు. నివేదిక ఎవరిది? ఐక్యరాజ్యసమితి ‘ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ (యు.ఎన్.ఒ.డి.సి) ఎప్పుడు విడుదలైంది? నవంబర్ 25న. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినం సందర్భంగా. ఎవరు ఎంత మూట కట్టుకున్నారు? ఆసియన్లు : 20,000 ఆఫ్రికన్లు : 19,000 అమెరికన్లు : 8,000 యూరోపియన్లు : 3,000 ఓషియానియన్లు : 300 ....................................................... లక్షకు మరణాల రేటు ఆఫ్రికా : 3.1 అమెరికా : 1.6 ఆసియా : 0.9 యూరప్ : 0.7 -
లైంగిక నేరస్తుల రిజిస్టర్
క్షణానికో లైంగిక దాడి, నిముషానికో అత్యాచారం, గంటకో గ్యాంగ్‌రేప్ భారత్‌లో ఎటు చూసినా మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. కళ్లు మూసుకుపోయిన కామాంధులు పసిమొగ్గల్ని కూడా నిర్దయగా చిదిమేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టడానికి, లైంగిక నేరాల విచారణ చురుగ్గా సాగడానికి కేంద్ర ప్రభుత్వం లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్‌ను (ఎన్ఆర్ఎస్ఒ) ప్రారంభించింది. దేశంలో లైంగిక నేరస్తుల వివరాలన్నీ ఇలా ఒక్కచోటకి చేర్చడం ఇదే ప్రథమం. నేరస్తుడికి సంబంధించిన పేరు, చిరునామా, వేలిముద్రలు సహా ప్రతీ చిన్న వివరాన్నీ అందులో పొందుపరుస్తారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లను సంప్రదించి నేరస్తుల వివరాలు సేకరించింది. తొలి దశలో 4లక్షల 40 వేల మంది వివరాలతో ఈ రిజిస్టర్‌ను ప్రారంభించారు. 2012లో నిర్భయ అత్యాచార ఘటన తర్వాత ఇలాంటి రిజిస్టర్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదన యూపీఏ హయాంలోనే వచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్నారులపై కూడా అత్యంత హేయమైన నేరాలకు పాల్పడుతూ ఉండడంతో ఎన్టీయే ప్రభుత్వం ఈ రిజస్టర్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ రిజిస్టర్‌ను ప్రారంభించిన కేంద్ర మహిళా శిశు శాఖా మంత్రి మేనకా గాంధీ లైంగిక నేరాల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. నేరాలు జరిగిన సమయాల్లో ఆధారాలను సేకరించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన 79 లక్షల ఫోరెన్సిక్ కిట్స్‌ను దేశవ్యాప్తంగా పోలీసు యంత్రాంగానికి పంపిణీ చేయనున్నారు. ఇక మహిళలు, చిన్నారులపై ఆన్లైన్ నేరాలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ cybercrime.gov.in అనే వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. చిన్నపిల్లల పోర్నోగ్రఫీ , వారి ఫోటోలను అభ్యంతరకరంగా చిత్రీకరించడం వంటి నేరాలకు సంబంధించి ఎవరైనా ఈ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. భారత్ వంటి దేశాలకు సరిపోదు ఇలాంటి రిజిస్టర్ల వల్ల నేరస్తుల వివరాలన్నీ పోలీసులకు క్షుణ్ణంగా తెలియడమే కాదు, ఫలానా ప్రాంతంలో నేరస్తుల జాడ ఉందని తల్లిదండ్రుల్ని హెచ్చరిక చేయవచ్చు. దాని ద్వారా నేరాల్ని అరికట్టే అవకాశం ఉంటుంది. అయితే భారత్ వంటి దేశాల్లో ఇలాంటి రిజిస్టర్ వల్ల పెద్దగా ఉపయోగాలు ఉండవని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్ విభాగానికి చెందిన అధ్యయనవేత్త లేహ్ వెర్గీస్ అంటున్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు సంబంధించిన 94% కేసుల్లో కుట్రదారులు వారికి బాగా తెలిసినవారే అయి ఉంటున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.అలాంటప్పుడు ఇలాంటి రిజిస్టర్ వల్ల రక్షణ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. డేటా బేస్ ముఖ్యాంశాలివీ... డేటాబేస్‌ను ఎవరు నిర్వహిస్తారు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ఈ డేటాని భద్రపరుస్తుంది. చట్ట సంస్థలకు చెందిన అధికారులెవరైనా ఈ డేటాబేస్‌లో అంశాలన్నీ చూడొచ్చు. తమ విచారణకు వినియోగించుకోవచ్చు. సాధారణ పౌరులు వీటిని చూడడానికి వీలులేదు. నేరస్తులైనప్పటికీ వారి వ్యక్తిగత గోప్యతను కేంద్రం పాటిస్తుంది. ఏయే దేశాల్లో ఈ తరహా డేటాబేస్ ఉంది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగో ఏయే అంశాలుంటాయి లైంగిక నేరస్తుడి పేరు, చిరునామా, ఫోటో, వేలిముద్రలు, ఆధార్, పాన్ కార్డు నెంబర్లు, డీఎన్ఏ నమూనాలు, దోషిగా తేలిన లైంగిక దాడి కేసుల వివరాలు ఎన్నాళ్లు ఈ డేటా భద్రంగా ఉంటుంది తక్కువ ప్రమాదం ఉన్న నేరాలు చేసిన వారి వివరాలు 15 ఏళ్లు, ఇంకాస్త ప్రమాదం ఉన్న నేరాలు చేసిన వారి వివరాలు 25 ఏళ్లు, గ్యాంగ్ రేప్‌లు, అత్యాచారం సమయంలో హింసకు పాల్పడడం వంటి అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారి వివరాలు జీవితకాలం పాటు ఉంటాయి. ఎంతమంది నేరస్తుల వివరాలు ఉన్నాయి ఇప్పటివరకు 4.4 లక్షల మంది నేరస్తుల సమగ్ర వివరాలు ఈ డేటాబేస్‌లో పొందుపరిచారు. 2005 నుంచి లైంగిక నేరాల్లో శిక్ష పడిన వారి వివరాలన్నీ ఇందులో లభిస్తాయి. బాల నేరస్తుల వివరాలు తర్వాత దశలో చేర్చుతారు.