సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాప్‌లు పెరుగుతున్నాయి. ఇటీవల మానుకోటలో కిడ్నాపైన బాలుడు దారుణహత్యకు గురైన ఉదంతం మరువక ముందే సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో చిన్నారి సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒకపక్క కిడ్నాప్ కేసులు పెరుగుతుండగా.. మరోపక్క వాటిని ఛేదించడంలోనూ రాష్ట్ర పోలీసులు ముందున్నారు. కిడ్నాప్ ఘటనల్లో 81.5% బాధితుల్ని రికవరీ చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసుల్ని ఛేదించడంలో ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, సిక్కిం తరువాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ (ఎన్‌సీఆర్‌బీ)–2019 నివేదిక చెబుతోంది. అపహరణ బాధితుల్లో మూడొంతుల మంది మహిళలు, చిన్నారులే ఉంటున్నారు.
రోజుకు ఐదుకుపైగా కేసులు
తెలంగాణలో రోజుకు సగటున ఐదు కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. 2017లో 1,560 మంది, 2018లో 1,810 మంది కిడ్నాప్ కాగా, 2019లో ఈ సంఖ్య 2,165కి చేరింది. అంటే ఏటా రోజుకు 5.9 చొప్పున కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసుల్లో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది. అయితే, కిడ్నాప్ అవుతున్న ప్రతీ వంద మందిలో 81.5 మందిని పోలీసులు క్షేమంగా రికవరీ చేస్తున్నారు.
24 గంటల్లోనే ఛేదన.. రికవరీ
తెలంగాణలో నమోదవుతున్న వివిధ అపహరణ కేసుల్లో నిందితులను 24 గంటల్లోనే పోలీసులు కనిపెడుతున్నారు. ఇటీవల రాజేంద్రనగర్‌లో బంధువుల చేతిలో డాక్టర్ కిడ్నాప్ కాగా, గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ ఘటనలో మరో పది నిమిషాలు ఆలస్యమైతే డాక్టర్‌ను కిడ్నాపర్లు చంపేసేవారు. ఏపీ, కర్ణాటక పోలీసులను సకాలంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేయడం ద్వారా అతడిని కాపాడగలిగారు. తాజాగా సూర్యాపేటలో నమోదైన కిడ్నాప్ కేసులోనూ పోలీసులు 24 గంటల్లోనే బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సాంకేతికత, సీసీ కెమెరాల సాయంతో నిందితుల గుర్తింపు సులువవుతోంది.
50 శాతానికిపైగా 18 ఏళ్లలోపువారే..
రాష్ట్రంలో కిడ్నాప్ అవుతున్నవారిలో 50 శాతానికిపైగా 18 ఏళ్లలోపువారే. 2019లో రాష్ట్రంలో కిడ్నాపైన 2,165 మందిలో 1,247 మంది 18 ఏళ్లలోపువారేనని (ఇందులో ఆరేళ్లలోపు వారు 50 మంది, 6 –12 ఏళ్లలోపు వారు 120 మంది, 12 –16 ఏళ్లలోపు 405 మంది, 16 –18 ఏళ్లలోపువారు 672 మంది ఉన్నారు) ఎన్సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 549 మంది పురుషులు, బాలురు కాగా.. 1,616 మంది స్త్రీలు, బాలికలు. అంటే బాధితుల్లో మూడొంతుల మంది మహిళలు, బాలికలే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment