National Crime Records Bureau 2020: Rising male suicides Check Details - Sakshi
Sakshi News home page

National Crime Records Bureau 2020: మగవారిని గమనించండి.. పెరుగుతున్న ఆత్మహత్యలు

Published Thu, Jul 7 2022 12:24 AM | Last Updated on Thu, Jul 7 2022 10:06 AM

National Crime Records Bureau 2020: Rising male suicides - Sakshi

ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవాడిదని సమాజం అంటుంది. కాని ఇంటి మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న
ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2020’ ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం పురుషులవైతే 30 శాతం స్త్రీలవి. కోవిడ్‌ కాలపు అనారోగ్యం.. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ బాధలు మగవారిని ఈ వైపుకు నెడుతున్నాయి. వారి గురించి కుటుంబం, సమాజం ఆలోచించాలి.


మన దేశంలో రోజుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో తెలుసా?
రోజుకు దాదాపు 419.
2020లో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో తెలుసా?
1,53,052.

వీటిలో పురుషుల సంఖ్య 1,08,532 (70 శాతం). స్త్రీలు 44, 498 (30 శాతం). అంటే స్త్రీల కంటే రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు సున్నిత స్వభావులు, భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు అనుకుంటాము. కాని పురుషులే ఇప్పుడు సున్నితంగా ఉన్నారు. జీవితాన్ని ఎదుర్కొనలేకపోతున్నారని ఈ సర్వే మనకు తెలియచేస్తోంది. స్త్రీలైనా పురుషులైనా ప్రాణం అత్యంత విలువైనది. అయితే స్త్రీలు తమ ఆందోళనను ఏదో ఒక విధంగా బయటపెట్టి నలుగురికి తెలిసేలా చేస్తారు. కాని పురుషుడు తన లోలోపల అదిమి పెట్టుకుంటాడు. తీరా నష్టం జరిగిపోయాకే అతడి మనసులో ఎంత వత్తిడి ఉన్నదో మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఇంట్లోని భర్తను, తండ్రిని, సోదరులను గమనించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులపై ఉందని తెలుస్తోంది.

కోవిడ్‌ అనంతరం
2020 ప్రారంభంలోనే కోవిడ్‌ మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే దీని వెనుక సంఘం పెట్టిన ఇమేజ్‌ కూడా కారణమే. పురుషుడంటే సమర్థుడిగా ఉండాలి, ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలి, తెగింపుతో ఉండాలి ఇలాంటి స్టీరియోటైప్‌ ఆలోచనలను ఇచ్చింది సంఘం. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంది. కాని పురుషుడు ఒత్తిడిలో ఉంటే ఏం చేయాలి? కష్టం చెప్పుకుంటే చేతగానివాడనుకుంటే ఎలా? ఆత్మహత్య చేసుకోవడమేనా దారి? కొందరు పురుషులు అదే చేస్తున్నారు.

పనిచేసే చోట అవమానాలు
2020లో పురుషులలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలిస్తే పని ప్రదేశంలో అవమానాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఆ సంవత్సరం పనిచేసేచోట అవమానాల వల్ల దేశంలో మొత్తం 1847 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు  1602 (87 శాతం). స్త్రీలు 234 (12 శాతం). అంటే రోజుకు సగటున ఐదు ఆత్మహత్యలు దేశంలో పని ప్రదేశంలో వేధింపుల వల్ల జరుగుతున్నాయి. వీటిలో మూడు నుంచి నాలుగు పురుషులవి. బాస్‌లు అవమానించడం, జీతాల పెంపులో తేడా, ప్రమోషన్లలో తరతమ భేదాలు ఇవన్నీ మగవాళ్లను కుంగదీసి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. స్త్రీలకు లైంగిక వేధింపులు ప్రధాన కారణం అవుతున్నాయి. అలాగే పని దొరకడం లేదన్న బాధతో కూడా పురుషులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

భరోసా ఇవ్వాలి
తండ్రి, భర్త, సోదరులతో మాట్లాడండి. వారి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి... వీటిలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్యం గురించి ఆరా తీయండి. సమస్య ఉంటే బలవంతంగానైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. ఆర్థిక సమస్యలు తెలుసుకోండి. అప్పులేమైనా ఉన్నాయా కూపీ లాగండి. పరిస్థితి ఎలా ఉన్నా వారి వల్ల ఏదైనా తప్పు జరిగి ఉన్నా నిందించకండి. నిలదీయకండి. సపోర్ట్‌ చేస్తామని చెప్పండి. ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఉద్యోగం మారాలనుకుంటే మారమని, లేదంటే మానేసి కొంతకాలం బ్రేక్‌ తీసుకోమని, మరేం పర్వాలేదని దిలాసా ఇవ్వండి. మిత్రులతో, క్లోజ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడించండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం ప్రాణాంతకం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement