Unemployment Fraud in US: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత భారీ నిరుద్యోగ మోసం బయట పడింది. కోవిడ్ (COVID-19) మహమ్మారి సమయంలో మోసగాళ్లు 100 బిలియన్ డాలర్ల (రూ. 8.3 లక్షల కోట్లు) నుంచి 135 బిలియన్ డాలర్లు (రూ. రూ. 11 లక్షల కోట్లు) వరకూ నిరుద్యోగ బీమా ప్రయోజనాలను తప్పుగా క్లెయిమ్ చేసి కాజేసి ఉండవచ్చని యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) నివేదిక విడుదల చేసింది.
యూఎస్, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులలో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే మధ్య చెల్లించిన నిరుద్యోగ ప్రయోజనాలపై జీఏవో అధ్యయనం నిర్వహించింది. ఆ సమయంలో అమెరికన్లకు చెల్లించిన మొత్తం నిరుద్యోగ ప్రయోజనాలలో మోసపూరితంగా క్లెయిమ్ చేసిన నిధులు 11 శాతం నుంచి 15 శాతం వరకూ ఉన్నాయని జీఏవో అంచనా వేసింది. ఆ కాలానికి నిరుద్యోగ ప్రయోజనాల మొత్తం చెల్లింపులు 900 బిలియన్ డాలర్లు.
అన్‌ఎంప్లాయిమెంట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ప్రోగ్రామ్ సమగ్రతతో దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొందని, ఇది కోవిడ్ మహమ్మారి సమయంలో మరింత దిగజారిందని జీఏవో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ మోసం మొత్తం జీఏవో గత ఫిబ్రవరిలో అంచనా వేసినదాని కంటే రెట్టింపు. ఈ నివేదికను యూఎస్ సెనేట్ ఫైనాన్స్ ర్యాంకింగ్ సభ్యుడు, సెనేటర్ మైక్ క్రాపో (R-Idaho), యూఎస్ హౌస్ వేస్ అండ్ మీన్స్ ఛైర్మన్ జాసన్ స్మిత్ (R-Missouri) అభ్యర్థించారు.
ఖండించిన కార్మిక శాఖ
అయితే జీఏవో నివేదికను యూఎస్ కార్మిక శాఖ ఖండించినట్లుగా రాయిటర్స్ పేర్కొంది. జీఏవో ఏ లెక్కల ఆధారంగా ఈ అంచనాకు వచ్చిందని ప్రశ్నించిందని, దాని పరిశోధనలు మోసం పరిధిని మరీ ఎక్కువగా పేర్కొన్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment