బ్యాంకుల్లో డబ్బుదాచుకుంటే మనమే తిరిగి బ్యాంకులకు వడ్డీకట్టాల్సివస్తే..? వామ్మో ఇదెక్కడి చోద్యం అంటారా? మనం ఎప్పడూ చూడలేదుకానీ, ఇప్పటికే ఈ నెగటివ్ వడ్డీరేట్లు జపాన్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ముడిచమురు విషయంలోనూ నెలకొంది. కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర ఏకంగా మైనస్ 40 డాలర్లను తాకడంతో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. మరోరకంగా చెప్పాలంటే ఒక బాత్‌టబ్‌ను నింపే నీటికి వెచ్చించే ధర కంటే తక్కువ ఖర్చుతో క్రూడ్‌తో నింపేయొచ్చన్నమాట! ఊహించడానికే నమ్మశక్యంగా లేదు కదూ!! ఎదురుడబ్బులిచ్చిమరీ అమ్మకందారులు క్రూడ్ కొనండంటూ కొనుగోలుదారుల వెంటపడటం మరీ విడ్డూరం! అసలు క్రూడ్ ఇంతలా కుప్పకూలడానికి కారణాలేంటి? చరిత్రలో ఎన్నడూ జరగని ఈ మహాపతనానికి ఆజ్యం పోసిన పరిస్థితులను వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనం ఇది...
సాక్షి బిజినెస్ డెస్క్: ప్రపంచంలో ఏ వస్తువు ధరైనా గిరాకీ–సరఫరా(డిమాండ్–సప్లయ్) ఆధారంగానే నిర్దేశితమవుతుంది. ఒక్కసారిగా డిమాండ్ ఆవిరై.. సరఫరా అదే స్థాయిలో కొనసాగితే ధర కుప్పకూలక తప్పదు. క్రూడ్ విషయంలోనూ ఇదే జరిగింది. అమెరికాలో ఉత్పత్తి అయ్యే లైట్ స్వీట్ క్రూడ్(డబ్ల్యూటీఐ–వెస్ట్రన్ టెక్సాస్ ఇంటర్మీడియెట్) మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టు బ్యారెల్ ధర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం మైనస్‌లోకి జారిపోయింది.
ఒకానొక దశలో క్రితం ముగింపు 18.27 డాలర్లతో పోలిస్తే ఏకంగా 307 శాతం కుప్పకూలి... మైనస్ 40.32 డాలర్లను తాకింది. చివరికి 280% నష్టంతో(55.9 డాలర్లు కోల్పోయి) మైనస్ 37.63 వద్ద ముగిసింది. అయితే, మంగళవారం ఈ కాంట్రాక్టు ధర 125 శాతం పైగా కోలుకొని 9.5 డాలర్లను తాకి ట్రేడవుతోంది. ఈ మే నెల కాంట్రాక్టు గడువు మంగళవారంతో ముగుస్తుంది. అంటే నేటి నుంచి జూన్ కాంట్రాక్టు ధరను క్రూడ్ ఫ్యూచర్స్ ప్రామాణిక రేటుగా పరిగణిస్తారన్నమాట! ఇది కూడా సోమవారం 17%పైగా కుప్పకూలి 20 డాలర్ల స్థాయిని తాకింది. మంగళవారం ఇది 67 శాతం క్షీణించి 6.5 డాలర్ల కనిష్టాన్ని చవిచూసింది.
మరి ఈ మైనస్ రేటు సంగతేంటి?
క్రూడ్ ఇంతలా కుప్పకూలడానికి డిమాండ్ పాతాళానికి పడిపోవడం, నిల్వచేసే కేంద్రాల్లో క్రూడ్ నిల్వలు నిండుకుండల్లా పేరుకుపోవడం ప్రధాన కారణాలు కాగా, ఫ్యూచర్స్ మార్కెట్లో తలెత్తే సాంకేతిక అంశాలు కూడా ఇందుకు ఆజ్యం పోశాయి. వాస్తవానికి క్రూడ్ కొనుగోలుదారులు (ప్రధానంగా రిఫైనరీలు, విమానయాన సంస్థలు, ట్రేడర్లు) భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయన్న అంచనాతో తాజా కనిష్ట ధరల వద్ద క్రూడ్‌ను నిల్వ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిల్వ సామర్థ్యం గరిష్టస్థాయికి చేరుకుంది. మంగళవారంతో గడువు తీరిన మే నెల కాంట్రాక్టులను కొనుగోలు చేసిన ట్రేడర్లు(లాంగ్ పొజిషన్లు తీసుకున్నవారు) గత్యంతరంలేని స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్యూచర్స్‌లో కొన్న పొజిషన్లు(బ్యారెల్స్) డెలివరీ తీసుకోవడమో లేదంటే వచ్చే నెల కాంట్రాక్టు(జూన్)కు రోలోవర్(మారడమో) చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
తగినంత స్టోరేజీ లేకపోవడంతో లక్షలాది బ్యారెళ్ల క్రూడ్‌ను డెలివరీ తీసుకోవడం అసాధ్యం. దీంతో అయినకాడికి అమ్ముకోవడంతో క్రూడ్ ధర ఒక్కసారిగా క్రాష్ అయింది. అయితే, కొనుగోలుదారులు ఎవరూ ముందుకురాకపోవడంతో ఎదురుడబ్బులిచ్చిమరీ తమ పొజిషన్లను వదిలించుకున్నారు. దీనివల్లే రేటు మైనస్‌లోకి జారిపోయింది. అంటే సోమవారం ఈ కాంట్రాక్టును కొన్నవారు డబ్బులేవీ చెల్లించకపోగా వాళ్లకే ఒక్కో బ్యారెల్‌కు ఎదురు 37–40 డాలర్లు లభించాయన్నమాట! ఈ క్రూడ్ క్రాష్‌లో ట్రేడర్లు(ప్రధానంగా కొన్ని బ్యాంకులు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు) కోట్లాది డాలర్ల నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ మైనస్ పతనం అనేది ఏదోఒకసారి జరిగే పరిణామం మాత్రమేనని రిస్టాడ్ ఎనర్జీకి చెందిన మార్కెట్ ఎనలిస్ట్ లౌసీ డిక్సన్ పేర్కొన్నారు. 20 డాలర్ల స్థాయిలో చమురు కంపెనీలు మనుగడం సాగించడం కష్టసాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
డిమాండ్ ఎందుకు ఢమాల్...
కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు... క్రూడ్ ధర అంతకంతకూ పాతాళానికి పడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే మందగమంనలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పుండుమీద కారంలా కరోనా కకావికలం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌లను ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయి.. ప్రపంచం మాంద్యం కోరల్లోకి వెళ్తోంది. చైనా–అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాత సౌదీ–రష్యాల మధ్య క్రూడ్ ధర పోరుకు తోడు ఇప్పుడు కరోనా కాటుతో ముడిచమురు రేటు క్రాష్ అయింది.
అయితే, రోజుకు 9.7 మిలియన్ బ్యారల్స్‌మేర(ప్రపంచ ఉత్పత్తిలో 10%) ఉత్పత్తిని తగ్గించుకోవడానికి ఒపెక్, అనుబంధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తాత్కాలికంగా చమురు ధర క్షీణతను అడ్డుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి దెబ్బకు డిమాండ్ ఆవిరై ముడిచమురుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్(ఏపీఐ) అంచనాల ప్రకారం ప్రపంచ చమురు ఉత్పత్తి ప్రస్తుత రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ కాగా, డిమాండ్ 70 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉండటం గమనార్హం.
నిండుకుండల్లా నిల్వలు...
డిమాండ్‌ను మించిన అదనపు ఉత్పత్తిని నిల్వ చేయడానికి ఇప్పడు స్టోరేజీ కేంద్రాల సమస్య ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. అమెరికాలో గరిష్ట స్థాయి క్రూడ్ స్టోరేజీ సామర్థ్యం 825 మిలియన్ బ్యారెల్స్ కాగా, గతంలో ఎప్పడూ 500 మిలియన్ బ్యారెల్స్ నిల్వను అధిగమించలేదు. కానీ ఇప్పుడు కేవలం 100 మిలియన్ బ్యారెల్స్ నిల్వ సామర్థ్యం మాత్రమే మిగిలి ఉండటం డిమాండ్–సరఫరాల మధ్య తీవ్ర అగాధానికి నిదర్శనం. దీంతో క్రూడ్‌ను తరలించే ట్యాంకర్ షిప్స్‌ను కూడా నింపేసి సముద్రంలో లంగరేస్తున్నారు.
ట్యాంకర్ల ద్వారా రవాణాలో ఉన్న ప్రస్తుతం నిల్వలు 1600 మిలియన్ బ్యారెల్స్‌కు చేరినట్లు అంచనా(రెండు వారాల క్రితంతో పోలిస్తే రెట్టింపు). అయితే, ఒపెక్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఉత్పత్తి కోత డీల్ మే నెల 1 నుంచి పట్టాలెక్కనుంది. అయినప్పటికీ... తాజా ధర పతనంతో ఈ ఒప్పందాన్ని ఎన్ని దేశాలు అమలు చేస్తాయన్నది మిలియన్ బ్యారెళ్ల ప్రశ్నే! ఒకవేళ ఈ డీల్ అమలైనా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ పతనాన్ని ఉత్పత్తి కోతలతో పూడ్చుకోవడం కష్టమేననేది నిపుణుల విశ్లేషణ.
డబ్ల్యూటీఐ క్రూడ్ అంటే...
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరకు ప్రామాణికంగా పరిగణించే మూడు రకాల్లో ఈ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా ఒకటి. మిగతావి బ్రెంట్ క్రూడ్, దుబాయ్ క్రూడ్(గల్ఫ్, ఇతరత్రా దేశాల్లో ఉత్పత్తి అయ్యే రకాలు) డబ్ల్యూటీఐ విషయానికొస్తే... ప్రధానంగా టెక్సాస్ కేంద్రంగా అమెరికాలో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ధరనే ఉత్తర అమెరికా మొత్తం ప్రామాణికంగా తీసుకుంటుంది. దీనిలో సల్ఫర్ (0.24 శాతం), సాంద్రత కూడా తక్కువగా ఉండటంతో దీన్ని లైట్, స్వీట్ క్రూడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యమైన ఈ క్రూడ్‌ను శుద్ధిచేయడం చాలా సులువు. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రమైన న్యూయార్క్ మెర్కెంటైల్ ఎక్సే్ఛంజీ(నైమెక్స్)లో క్రూడ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు కూడా డబ్ల్యూటీఐ ధరే ప్రామాణికం. 1983 ఏప్రిల్ నుంచి నైమెక్స్‌లో డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడవుతున్నాయి.
ఇప్పటివరకూ ఇక్కడ నమోదైన ఆల్‌టైమ్ కనిష్ట ధర బ్యారెల్‌కు 9.75 డాలర్లు(1986 ఏప్రిల్‌లో) మాత్రమే. తాజాగా మైనస్ 40 స్థాయికి కుప్పకూలి చరిత్రాత్మక పతనాన్ని డబ్ల్యూటీఐ క్రూడ్ చవిచూసింది. ఇక ఈ క్రూడ్ డెలివరీలకు ప్రధాన స్టోరేజీ కేంద్రం ఒక్లహామాలోని కుషింగ్ అనే ప్రాంతం. దీని నిల్వ సామర్థ్యం 90 మిలియన్ బ్యారెల్స్. అమెరికాలో మొత్తం స్టోరేజీలో ఇది దాదాపు 13 శాతం కావడం గమనార్హం. రోజుకు 6.5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ రాకపోకలు ఇక్కడి నుంచి జరుగుతుంటాయి. అందుకే ప్రపంచ క్రూడ్ పైప్‌లైన్ జంక్షన్‌గా కూడా దీన్ని పిలుస్తారు. డబ్ల్యూటీఐ కాంట్రాక్టులను డెలివరీ తీసుకుంటే ఇక్కడ స్టోర్ చేస్తారు. డిమాండ్ పడిపోవడంతో ఇక్కడ నిల్వలు గరిష్టానికి చేరుకోవడమే తాజా మహా పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.
రికవరీ ఎన్నేళ్లకో...
కరోనా లాక్‌డౌన్స్ ఇంకా కొన్ని నెలలు పాటు కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. విమానాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రపంచమంతా మాంద్యంలోకి జారిపోతోంది. అంతర్జాతీయంగా విమానయాన సేవలతో పాటు లాక్‌డౌన్‌లతో రైలు, రోడ్డు రవాణా సేవలు, ప్రయాణాలన్నీ నిలిచిపోవడంతో క్రూడ్ కొనుగోళ్లు కుదేలవుతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌లు ఎత్తేసినప్పటికీ మునుపటి స్థాయికి డిమాండ్ చేరడానికి చాలా నెలలే పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్‌లాంటి అధిక క్రూడ్ డిమాండ్ దేశాల్లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 50 శాతం పడిపోయిన విషయాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కరోనా మహమ్మారికి మందో, వ్యాక్సినో కనుగొని.. దీనికి ఒక పరిష్కారం దక్కి... ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలోపడేంత వరకూ క్రూడ్ ధర కుక్కినపేనులా పడుండాల్సిందేననేది నిపుణుల అభిప్రాయం. ముడిచమురు రేటు మళ్లీ పుంజుకోవడానికి కొన్ని నెలలే కాదు కొన్నేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అంటున్నారు!!
మరి బ్రెంట్ క్రూడ్ ఎందుకు ఇంతలా పడిపోలేదు?
డిమాండ్ పతనం కారణంగా డబ్ల్యూటీఐతో పాటు బ్రెంట్ క్రూడ్ కూడా గత కొంతకాలంగా పడుతూనే వస్తోంది. ఏడాది వ్యవధిలో ఈ రెంటింటి ధరలు 80% పైనే పడిపోయాయి. ‘షేల్’ నిల్వల ఆసరాతో అధిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో క్రూడ్‌ను నిల్వ చేసే సామర్థ్యం గరిష్ఠానికి చేరుకుంది. అయితే, బ్రెంట్ క్రూడ్‌ను అత్యధికంగా(ప్రపంచ ఉత్పత్తిలో మూడింట రెండొంతులు) వినియోగించే మిగతా ప్రపంచ దేశాల్లో స్టోరేజీ సామర్థ్యం ఇంకా మెరుగ్గానే ఉండటంతో దీని ధర ఆ స్థాయిలో కుప్పకూలలేదు. సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్లో జూన్ కాంట్రాక్టు బ్రెంట్ క్రూడ్ ధర 10% పైగా దిగజారి 25 డాలర్ల స్థాయిలో ముగిసింది. ఇక మంగళవారం జూన్ కాంట్రాక్టు డబ్ల్యూటీఐ ధర ఒకానొక దశలో దాదాపు 67% పైగా దిగజారి 6.5 డాలర్ల కనిష్టాన్ని తాకింది. బ్రెంట్ ధర కూడా 30% క్షీణించి 18.13 డాలర్లను చూసింది. అయితే, అత్యంత బలహీన డిమాండ్‌తో బ్రెంట్ రేటు సైతం తీవ్రంగా కుల్పకూలొచ్చని ఐబీడబ్ల్యూ డెయిలీ ఆయిల్ బ్రీఫ్‌కు చెందిన ఇగోర్ విండిష్ హెచ్చరిస్తున్నారు.
అబ్బో ఎంత చౌక...
క్రూడ్ ధరలు మైనస్‌లోకి కుప్పకూలడం కేవలం తాత్కాలికమే. చమురు సంబంధ అంశాల కంటే ఆర్థికపరమైన కారణాలవల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, క్రూడ్ కొనుగోలుకు ఇది శుభతరుణంగా నేను భావిస్తున్నా. ఎక్కడచూసినా ఎడాపెడా చౌకగా ఆయిల్ దొరుకుతోంది. సౌదీ ఆయిల్ దిగుమతులపై నిషేధాన్ని పరిశీస్తున్నా. – డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్
గతంలో నమోదైన రోజుకు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు డిమాండ్ అనేది ప్రపంచానికి ఇక శాశ్వత గరిష్ట స్థాయిగా నిలిచిపోవచ్చు. మరింత మైలేజీనిచ్చే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల జోరుతోపాటు కరోనా కారణంగా వినియోగదారుల స్వభావంలో నెలకొనే మార్పులు కూడా క్రూడ్ డిమాండ్‌ను కోలుకోనీయకుండా చేయొచ్చు.
క్రూడ్ ధరలు మైనస్‌లోకి కుప్పకూలడం అసాధారణమైన విషయం. ఇదంతా కలా.. నిజమా అనిపిస్తోంది. – లూయీస్ డిక్సన్, ఆయిల్ మార్కెట్స్ అనలిస్ట్, రిస్టాడ్ ఎనర్జీ
Comments
Please login to add a commentAdd a comment