Crude Price
-
‘క్రూడ్’ నష్టాలు
ముడి చమురు ధరలు మొదటిసారిగా నెగెటివ్‌లోకి జారిపోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు నష్టపోయి 76.83కు చేరడం, అమెరికాకు ఇతర దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 1,011 పాయింట్లు పతనమై 30,637 పాయింట్ల వద్ద, నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 8,982 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.2 శాతం, నిఫ్టీ 3 శాతం మేర నష్టపోయాయి. ఫార్మా మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే.... సెన్సెక్స్. నిఫ్టీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 812 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్ల పతనంతో మొదలయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ, తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,270 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్ల మేర నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. టెలికం, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, బ్యాంక్, వాహన, లోహ, తదితర రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రూ.3.30 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ భారీ నష్టాల కారణంగా రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,30,409 కోట్లు హరించుకుపోయి రూ.120.42 లక్షల కోట్లకు పడిపోయింది. మరిన్ని విశేషాలు.... ► మార్కెట్ పతనంలోనూ కొన్ని షేర్లు మెరుపులు మెరిపించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ నాలుగేళ్ల గరిష్టానికి, రూ.4,046కు ఎగసింది. చివరకు 4.5 శాతం లాభంతో రూ.4,015 వద్ద ముగిసింది. ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు–భారతీ ఎయిర్టెల్, హీరో మోటొకార్ప్, నెస్లే ఇండియాలు మాత్రమే లాభపడగా, మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 12 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పతనమైన షేర్ ఇదే. ► బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ షేర్లు 6–9 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం నష్టంతో రూ.633 వద్ద ముగిసింది. ► హైదరాబాద్‌లోని ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ వీఏఐ(వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్)సర్టిఫికెట్ ఇవ్వడంతో అరబిందో ఫార్మా 20 శాతం(రూ.104 లాభం) అప్పర్ సర్క్యూట్‌తో రూ.644 వద్ద ముగిసింది. ఇతరషేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. దివీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 30కు పైగా ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ► సింగపూర్‌కు చెందిన ఆయిల్ట్రేడింగ్ కంపెనీ, హిన్ లియోన్ ట్రేడింగ్ పీటీఈ దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. ఈ కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర రుణం ఇవ్వడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 8% నష్టంతో రూ.332 వద్దకు చేరింది. -
చమురుకు ఏమైంది..?
బ్యాంకుల్లో డబ్బుదాచుకుంటే మనమే తిరిగి బ్యాంకులకు వడ్డీకట్టాల్సివస్తే..? వామ్మో ఇదెక్కడి చోద్యం అంటారా? మనం ఎప్పడూ చూడలేదుకానీ, ఇప్పటికే ఈ నెగటివ్ వడ్డీరేట్లు జపాన్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ముడిచమురు విషయంలోనూ నెలకొంది. కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర ఏకంగా మైనస్ 40 డాలర్లను తాకడంతో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. మరోరకంగా చెప్పాలంటే ఒక బాత్‌టబ్‌ను నింపే నీటికి వెచ్చించే ధర కంటే తక్కువ ఖర్చుతో క్రూడ్‌తో నింపేయొచ్చన్నమాట! ఊహించడానికే నమ్మశక్యంగా లేదు కదూ!! ఎదురుడబ్బులిచ్చిమరీ అమ్మకందారులు క్రూడ్ కొనండంటూ కొనుగోలుదారుల వెంటపడటం మరీ విడ్డూరం! అసలు క్రూడ్ ఇంతలా కుప్పకూలడానికి కారణాలేంటి? చరిత్రలో ఎన్నడూ జరగని ఈ మహాపతనానికి ఆజ్యం పోసిన పరిస్థితులను వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనం ఇది... సాక్షి బిజినెస్ డెస్క్: ప్రపంచంలో ఏ వస్తువు ధరైనా గిరాకీ–సరఫరా(డిమాండ్–సప్లయ్) ఆధారంగానే నిర్దేశితమవుతుంది. ఒక్కసారిగా డిమాండ్ ఆవిరై.. సరఫరా అదే స్థాయిలో కొనసాగితే ధర కుప్పకూలక తప్పదు. క్రూడ్ విషయంలోనూ ఇదే జరిగింది. అమెరికాలో ఉత్పత్తి అయ్యే లైట్ స్వీట్ క్రూడ్(డబ్ల్యూటీఐ–వెస్ట్రన్ టెక్సాస్ ఇంటర్మీడియెట్) మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టు బ్యారెల్ ధర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం మైనస్‌లోకి జారిపోయింది. ఒకానొక దశలో క్రితం ముగింపు 18.27 డాలర్లతో పోలిస్తే ఏకంగా 307 శాతం కుప్పకూలి... మైనస్ 40.32 డాలర్లను తాకింది. చివరికి 280% నష్టంతో(55.9 డాలర్లు కోల్పోయి) మైనస్ 37.63 వద్ద ముగిసింది. అయితే, మంగళవారం ఈ కాంట్రాక్టు ధర 125 శాతం పైగా కోలుకొని 9.5 డాలర్లను తాకి ట్రేడవుతోంది. ఈ మే నెల కాంట్రాక్టు గడువు మంగళవారంతో ముగుస్తుంది. అంటే నేటి నుంచి జూన్ కాంట్రాక్టు ధరను క్రూడ్ ఫ్యూచర్స్ ప్రామాణిక రేటుగా పరిగణిస్తారన్నమాట! ఇది కూడా సోమవారం 17%పైగా కుప్పకూలి 20 డాలర్ల స్థాయిని తాకింది. మంగళవారం ఇది 67 శాతం క్షీణించి 6.5 డాలర్ల కనిష్టాన్ని చవిచూసింది. మరి ఈ మైనస్ రేటు సంగతేంటి? క్రూడ్ ఇంతలా కుప్పకూలడానికి డిమాండ్ పాతాళానికి పడిపోవడం, నిల్వచేసే కేంద్రాల్లో క్రూడ్ నిల్వలు నిండుకుండల్లా పేరుకుపోవడం ప్రధాన కారణాలు కాగా, ఫ్యూచర్స్ మార్కెట్లో తలెత్తే సాంకేతిక అంశాలు కూడా ఇందుకు ఆజ్యం పోశాయి. వాస్తవానికి క్రూడ్ కొనుగోలుదారులు (ప్రధానంగా రిఫైనరీలు, విమానయాన సంస్థలు, ట్రేడర్లు) భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయన్న అంచనాతో తాజా కనిష్ట ధరల వద్ద క్రూడ్‌ను నిల్వ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో నిల్వ సామర్థ్యం గరిష్టస్థాయికి చేరుకుంది. మంగళవారంతో గడువు తీరిన మే నెల కాంట్రాక్టులను కొనుగోలు చేసిన ట్రేడర్లు(లాంగ్ పొజిషన్లు తీసుకున్నవారు) గత్యంతరంలేని స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్యూచర్స్‌లో కొన్న పొజిషన్లు(బ్యారెల్స్) డెలివరీ తీసుకోవడమో లేదంటే వచ్చే నెల కాంట్రాక్టు(జూన్)కు రోలోవర్(మారడమో) చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తగినంత స్టోరేజీ లేకపోవడంతో లక్షలాది బ్యారెళ్ల క్రూడ్‌ను డెలివరీ తీసుకోవడం అసాధ్యం. దీంతో అయినకాడికి అమ్ముకోవడంతో క్రూడ్ ధర ఒక్కసారిగా క్రాష్ అయింది. అయితే, కొనుగోలుదారులు ఎవరూ ముందుకురాకపోవడంతో ఎదురుడబ్బులిచ్చిమరీ తమ పొజిషన్లను వదిలించుకున్నారు. దీనివల్లే రేటు మైనస్‌లోకి జారిపోయింది. అంటే సోమవారం ఈ కాంట్రాక్టును కొన్నవారు డబ్బులేవీ చెల్లించకపోగా వాళ్లకే ఒక్కో బ్యారెల్‌కు ఎదురు 37–40 డాలర్లు లభించాయన్నమాట! ఈ క్రూడ్ క్రాష్‌లో ట్రేడర్లు(ప్రధానంగా కొన్ని బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు) కోట్లాది డాలర్ల నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ మైనస్ పతనం అనేది ఏదోఒకసారి జరిగే పరిణామం మాత్రమేనని రిస్టాడ్ ఎనర్జీకి చెందిన మార్కెట్ ఎనలిస్ట్ లౌసీ డిక్సన్ పేర్కొన్నారు. 20 డాలర్ల స్థాయిలో చమురు కంపెనీలు మనుగడం సాగించడం కష్టసాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. డిమాండ్ ఎందుకు ఢమాల్... కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు... క్రూడ్ ధర అంతకంతకూ పాతాళానికి పడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే మందగమంనలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పుండుమీద కారంలా కరోనా కకావికలం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాలు లాక్డౌన్లను ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయి.. ప్రపంచం మాంద్యం కోరల్లోకి వెళ్తోంది. చైనా–అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాత సౌదీ–రష్యాల మధ్య క్రూడ్ ధర పోరుకు తోడు ఇప్పుడు కరోనా కాటుతో ముడిచమురు రేటు క్రాష్ అయింది. అయితే, రోజుకు 9.7 మిలియన్ బ్యారల్స్మేర(ప్రపంచ ఉత్పత్తిలో 10%) ఉత్పత్తిని తగ్గించుకోవడానికి ఒపెక్, అనుబంధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తాత్కాలికంగా చమురు ధర క్షీణతను అడ్డుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి దెబ్బకు డిమాండ్ ఆవిరై ముడిచమురుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్(ఏపీఐ) అంచనాల ప్రకారం ప్రపంచ చమురు ఉత్పత్తి ప్రస్తుత రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ కాగా, డిమాండ్ 70 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉండటం గమనార్హం. నిండుకుండల్లా నిల్వలు... డిమాండ్‌ను మించిన అదనపు ఉత్పత్తిని నిల్వ చేయడానికి ఇప్పడు స్టోరేజీ కేంద్రాల సమస్య ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. అమెరికాలో గరిష్ట స్థాయి క్రూడ్ స్టోరేజీ సామర్థ్యం 825 మిలియన్ బ్యారెల్స్ కాగా, గతంలో ఎప్పడూ 500 మిలియన్ బ్యారెల్స్ నిల్వను అధిగమించలేదు. కానీ ఇప్పుడు కేవలం 100 మిలియన్ బ్యారెల్స్ నిల్వ సామర్థ్యం మాత్రమే మిగిలి ఉండటం డిమాండ్–సరఫరాల మధ్య తీవ్ర అగాధానికి నిదర్శనం. దీంతో క్రూడ్‌ను తరలించే ట్యాంకర్ షిప్స్‌ను కూడా నింపేసి సముద్రంలో లంగరేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా రవాణాలో ఉన్న ప్రస్తుతం నిల్వలు 1600 మిలియన్ బ్యారెల్స్‌కు చేరినట్లు అంచనా(రెండు వారాల క్రితంతో పోలిస్తే రెట్టింపు). అయితే, ఒపెక్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఉత్పత్తి కోత డీల్ మే నెల 1 నుంచి పట్టాలెక్కనుంది. అయినప్పటికీ... తాజా ధర పతనంతో ఈ ఒప్పందాన్ని ఎన్ని దేశాలు అమలు చేస్తాయన్నది మిలియన్ బ్యారెళ్ల ప్రశ్నే! ఒకవేళ ఈ డీల్ అమలైనా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ పతనాన్ని ఉత్పత్తి కోతలతో పూడ్చుకోవడం కష్టమేననేది నిపుణుల విశ్లేషణ. డబ్ల్యూటీఐ క్రూడ్ అంటే... ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరకు ప్రామాణికంగా పరిగణించే మూడు రకాల్లో ఈ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా ఒకటి. మిగతావి బ్రెంట్ క్రూడ్, దుబాయ్ క్రూడ్(గల్ఫ్, ఇతరత్రా దేశాల్లో ఉత్పత్తి అయ్యే రకాలు) డబ్ల్యూటీఐ విషయానికొస్తే... ప్రధానంగా టెక్సాస్ కేంద్రంగా అమెరికాలో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ధరనే ఉత్తర అమెరికా మొత్తం ప్రామాణికంగా తీసుకుంటుంది. దీనిలో సల్ఫర్ (0.24 శాతం), సాంద్రత కూడా తక్కువగా ఉండటంతో దీన్ని లైట్, స్వీట్ క్రూడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యమైన ఈ క్రూడ్‌ను శుద్ధిచేయడం చాలా సులువు. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రమైన న్యూయార్క్ మెర్కెంటైల్ ఎక్సే్ఛంజీ(నైమెక్స్)లో క్రూడ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు కూడా డబ్ల్యూటీఐ ధరే ప్రామాణికం. 1983 ఏప్రిల్ నుంచి నైమెక్స్‌లో డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడవుతున్నాయి. ఇప్పటివరకూ ఇక్కడ నమోదైన ఆల్‌టైమ్ కనిష్ట ధర బ్యారెల్‌కు 9.75 డాలర్లు(1986 ఏప్రిల్‌లో) మాత్రమే. తాజాగా మైనస్ 40 స్థాయికి కుప్పకూలి చరిత్రాత్మక పతనాన్ని డబ్ల్యూటీఐ క్రూడ్ చవిచూసింది. ఇక ఈ క్రూడ్ డెలివరీలకు ప్రధాన స్టోరేజీ కేంద్రం ఒక్లహామాలోని కుషింగ్ అనే ప్రాంతం. దీని నిల్వ సామర్థ్యం 90 మిలియన్ బ్యారెల్స్. అమెరికాలో మొత్తం స్టోరేజీలో ఇది దాదాపు 13 శాతం కావడం గమనార్హం. రోజుకు 6.5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ రాకపోకలు ఇక్కడి నుంచి జరుగుతుంటాయి. అందుకే ప్రపంచ క్రూడ్ పైప్‌లైన్ జంక్షన్‌గా కూడా దీన్ని పిలుస్తారు. డబ్ల్యూటీఐ కాంట్రాక్టులను డెలివరీ తీసుకుంటే ఇక్కడ స్టోర్ చేస్తారు. డిమాండ్ పడిపోవడంతో ఇక్కడ నిల్వలు గరిష్టానికి చేరుకోవడమే తాజా మహా పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. రికవరీ ఎన్నేళ్లకో... కరోనా లాక్డౌన్స్ ఇంకా కొన్ని నెలలు పాటు కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. విమానాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రపంచమంతా మాంద్యంలోకి జారిపోతోంది. అంతర్జాతీయంగా విమానయాన సేవలతో పాటు లాక్డౌన్లతో రైలు, రోడ్డు రవాణా సేవలు, ప్రయాణాలన్నీ నిలిచిపోవడంతో క్రూడ్ కొనుగోళ్లు కుదేలవుతున్నాయి. ఒకవేళ లాక్డౌన్లు ఎత్తేసినప్పటికీ మునుపటి స్థాయికి డిమాండ్ చేరడానికి చాలా నెలలే పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లాంటి అధిక క్రూడ్ డిమాండ్ దేశాల్లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 50 శాతం పడిపోయిన విషయాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కరోనా మహమ్మారికి మందో, వ్యాక్సినో కనుగొని.. దీనికి ఒక పరిష్కారం దక్కి... ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలోపడేంత వరకూ క్రూడ్ ధర కుక్కినపేనులా పడుండాల్సిందేననేది నిపుణుల అభిప్రాయం. ముడిచమురు రేటు మళ్లీ పుంజుకోవడానికి కొన్ని నెలలే కాదు కొన్నేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అంటున్నారు!! మరి బ్రెంట్ క్రూడ్ ఎందుకు ఇంతలా పడిపోలేదు? డిమాండ్ పతనం కారణంగా డబ్ల్యూటీఐతో పాటు బ్రెంట్ క్రూడ్ కూడా గత కొంతకాలంగా పడుతూనే వస్తోంది. ఏడాది వ్యవధిలో ఈ రెంటింటి ధరలు 80% పైనే పడిపోయాయి. ‘షేల్’ నిల్వల ఆసరాతో అధిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో క్రూడ్‌ను నిల్వ చేసే సామర్థ్యం గరిష్ఠానికి చేరుకుంది. అయితే, బ్రెంట్ క్రూడ్‌ను అత్యధికంగా(ప్రపంచ ఉత్పత్తిలో మూడింట రెండొంతులు) వినియోగించే మిగతా ప్రపంచ దేశాల్లో స్టోరేజీ సామర్థ్యం ఇంకా మెరుగ్గానే ఉండటంతో దీని ధర ఆ స్థాయిలో కుప్పకూలలేదు. సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్లో జూన్ కాంట్రాక్టు బ్రెంట్ క్రూడ్ ధర 10% పైగా దిగజారి 25 డాలర్ల స్థాయిలో ముగిసింది. ఇక మంగళవారం జూన్ కాంట్రాక్టు డబ్ల్యూటీఐ ధర ఒకానొక దశలో దాదాపు 67% పైగా దిగజారి 6.5 డాలర్ల కనిష్టాన్ని తాకింది. బ్రెంట్ ధర కూడా 30% క్షీణించి 18.13 డాలర్లను చూసింది. అయితే, అత్యంత బలహీన డిమాండ్‌తో బ్రెంట్ రేటు సైతం తీవ్రంగా కుల్పకూలొచ్చని ఐబీడబ్ల్యూ డెయిలీ ఆయిల్ బ్రీఫ్‌కు చెందిన ఇగోర్ విండిష్ హెచ్చరిస్తున్నారు. అబ్బో ఎంత చౌక... క్రూడ్ ధరలు మైనస్‌లోకి కుప్పకూలడం కేవలం తాత్కాలికమే. చమురు సంబంధ అంశాల కంటే ఆర్థికపరమైన కారణాలవల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, క్రూడ్ కొనుగోలుకు ఇది శుభతరుణంగా నేను భావిస్తున్నా. ఎక్కడచూసినా ఎడాపెడా చౌకగా ఆయిల్ దొరుకుతోంది. సౌదీ ఆయిల్ దిగుమతులపై నిషేధాన్ని పరిశీస్తున్నా. – డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ గతంలో నమోదైన రోజుకు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు డిమాండ్ అనేది ప్రపంచానికి ఇక శాశ్వత గరిష్ట స్థాయిగా నిలిచిపోవచ్చు. మరింత మైలేజీనిచ్చే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల జోరుతోపాటు కరోనా కారణంగా వినియోగదారుల స్వభావంలో నెలకొనే మార్పులు కూడా క్రూడ్ డిమాండ్‌ను కోలుకోనీయకుండా చేయొచ్చు. క్రూడ్ ధరలు మైనస్‌లోకి కుప్పకూలడం అసాధారణమైన విషయం. ఇదంతా కలా.. నిజమా అనిపిస్తోంది. – లూయీస్ డిక్సన్, ఆయిల్ మార్కెట్స్ అనలిస్ట్, రిస్టాడ్ ఎనర్జీ -
క్రూడ్ క్రాష్..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో లైట్ స్వీట్ క్రూడ్(డబ్లూటీఐ) బేరల్ మే నెల కాంట్రాక్ట్ ధర సోమవారం ఒకానొక దశలో కుప్పకూలి... మైనస్ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. చరిత్రలో క్రూడ్ ధర ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడడం ఇదే మొదటి సారి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే. నిల్వలు భారీగా పేరుకుపోతున్న ధోరణి, కనుచూపుమేర కనిపించని ఆర్థిక రికవరీ నేపథ్యంలో మళ్లీ ముడిచమురు ధరలు ఎప్పుడు పుంజుకుంటాయోనని ఉత్పత్తిదారులు గగ్గోలు పెడుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల నుంచి కరోనా, ప్రైస్‌వార్ వరకూ... నిజానికి 2020 తొలి నాలుగు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020 జనవరిలో అమెరికా దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, దీనితో భౌగోళిక ఉద్రిక్త పరిణామాలతో క్రూడ్ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత కరోనా ప్రభావంతో రష్యా–సౌదీ అరేబియాల మధ్య చోటుచేసుకున్న ఈ ‘ధరల యుద్ధం’తో క్రూడ్ ధర పతనమవుతూ వచ్చింది. ఫలించని ఒపెక్ ఒప్పందాలు.. క్రూడ్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒక డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలపై నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాయి. ఆయా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, డిమాండ్ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఒక కారణమైతే, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి అమెరికాలోని ఒక్లహోమాలో క్రూడ్ నిల్వల హబ్‌లో నిల్వల పరిస్థితి దాదాపు దాని పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వర్కింగ్ స్టోరేజ్ సామర్థ్యం 76 మిలియన్ బేరళ్లయితే, 55 మిలియన్ బేరళ్లకు ఈ స్టోరేజ్‌కి చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే, కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్‌ను తీసుకువెళ్లాలని తమ కస్టమర్లపై చమురు ఉత్పత్తిదారులు ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందన్నది విశ్లేషణ. అంతేకాదు అవసరమైతే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇచ్చిమరీ నిల్వలు తగ్గించుకోవాల్సి రావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలియట్‌వేవ్ సిద్ధాంతం ప్రకారం వచ్చే దశాబ్దంలో ఎప్పడోకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చు. మళ్లీ ఆల్‌టైమ్ గరిష్టాన్ని (147.67 డాలర్లు) చూడాలంటే చాలా ఏళ్లే పడుతుంది. – 2009లో ఎలియట్‌వేవ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు రాబర్ట్ ప్రెషెర్ అంచనా 1999 జనవరిలో క్రూడ్ కనిష్ట స్థాయి: 11.72 డాలర్లు 2008 జూన్ క్రూడ్ ఆల్‌టైమ్ గరిష్టం: 147.67 డాలర్లు 2020 ఏప్రిల్ 20న క్రూడ్ కనిష్ట స్థాయి: మైనస్ 28 డాలర్లు -
ఆరో రోజూ పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా క్రమంగా పెట్రో ధరల సెగ పెరుగుతోంది. వరుసగా ఆరవ రోజుకూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోలుపై 10పైసలు, డిజిల్ పై 9 పైసలు ధర పెరిగింది. దీంతో రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 71ల స్థాయిని టచ్ చేసింది. అటు ముంబైలో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ.76.64 పలుకుతోంది. ముంబై: లీటరు పెట్రోలు ధర రూ. 76.64 డీజిల్ ధర రూ.69.30 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.11, డీజిల్ ధర రూ.67.95 చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 73.72 డీజిల్ ధర రూ.69.91 అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.12, డీజిల్ ధర రూ.71.33 హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర రూ. 75.34, డీజిల్ ధర రూ.71.95 -
స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం (ఫిబ్రవరి 11) వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 5 పైసలు , డీజిల్ ధర 6 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన కూడా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.33 వద్ద.. డీజిల్ ధర రూ.65.62 వద్ద కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని లీటరు ముంబైలో పెట్రోల్ ధర రూ.75.97 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.68.71 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.17 డాలర్ల వద్ద ఉంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు కోల్‌కతా : పెట్రోలు ధర లీటరు రూ. 72.44, డీజిల్ ధర రూ. 67.40 చెన్నై : పెట్రోలు ధర లీటర్ రూ. 73.00 డీజిల్ ధర రూ. 69.32 బెంగళూరు : పెట్రోలు ధర లీటర్72.65 డీజిల్ ధర రూ. 67.78 హైదరాబాద్ :పెట్రోలు ధర లీటర్ 74.62 డీజిల్ ధర రూ.71.34 విజయవాడ : పెట్రోలు ధర లీటర్ 74.05 డీజిల్ ధర రూ.70.40 -
ఈ ఏడాది కనిష్ట స్థాయికి పెట్రో ధరలు
సాక్షి, ముంబై: చమురు ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా పెట్రోలు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలుపడిపోవడంతో ఇటీవల బాగా దిగివ వచ్చిన పెట్రోలు డీజిలు ధరలు శనివారం 2018 కనిష్టానికి చేరాయి. ఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నైతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దిగి వస్తున్నాయి. లీటరుకు 30పైసలు చొప్పున పెట్రో ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .69.26గా ఉంది. డీజిలు ధర రూ. 63.32గా ఉంది. ముంబై: పెట్రోలు ధర రూ.రూ. 74.89 , డీజిలు ధర రూ.66.25 చెన్నై : పెట్రోలు ధర రూ.71.85 డీజిలు ధర రూ. 66.84 కోలకతా: పెట్రోలు ధర రూ. రూ. 71.37, డీజిలు ధర రూ. 65.07 హైదరాబాద్: పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర రూ.68.82 విజయవాడ: పెట్రోలు ధర రూ. 72.93, డీజిల్ ధర రూ.67.97 చమురు ధరల సెగతో ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు రూ.83.22 రూపాయలు, లీటరు రూ.90.57 రూపాయలుగా నమోదయ్యాయి. అయితే గ్లోబల్‌గా మళ్లీ ముడి చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా 20శాతం దిగి వచ్చిన ఇంధన ధరలు ఏడాదిన్నర కనిష్టాన్ని తాకాయి. అలాగే డిసెంబరు 24న ఢిల్లీలో పెట్రోధర (జనవరి తరువాత) తొలిసారిగా 70 రూపాయల దిగువకు చేరింది. -
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై: వరుసగా చమురు ధరలు దిగి రావడంతో దేశీయంతో పెట్రోలు ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాటి ఇంధన ధరలను ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 25-30పైసలు దిగి వచ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతాతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని ధరలను చూద్దాం. ఢిల్లీ : పెట్రోలు ధర రూ.70.77 డీజిల్ రూ. 65.30 ముంబై: పెట్రోలు ధర రూ.76.28 డీజిల్ రూ. 68.32 చెన్నై: పెట్రోలు ధర రూ.73.33.డీజిల్ రూ. 68.93 కోలకతా: పెట్రోలు ధర రూ.72.75 డీజిల్ రూ. 67.03 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.74.95 డీజిల్ రూ.70.94 విజయవాడ : పెట్రోలు రూ.74.38 డీజిల్ రూ. 70.02 -
రాష్ట్రాలకు దండిగా ‘పెట్రో’ ఆదాయం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలూ తీవ్రంగా ఉన్నాయి. దీనితో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆయా అంశాలు రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో రూ.22,700 కోట్ల ‘వ్యాట్’ (వీఏటీ) ఆదాయాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్బీఐ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ధర సగటున 75 డాలర్లు, డాలర్ మారకంలో రూపాయి 72గా ఉంటుందని భావిస్తూ తాజా అంచనాలు లెక్కగట్టడం జరిగింది. ఈ అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌కు ఒక డాలర్ ధర పెరిగితే, రూపాయిల్లో ఇది 19 రాష్ట్రాలకు సగటును రూ.1,513 కోట్ల పన్ను ఆదాయాన్ని తెచ్చిపెట్టే వీలుంది. వేర్వేరుగా చూస్తే, ఈ ఆదాయాల విషయంలో రూ.3,389 కోట్లతో మహారాష్ట్ర ముందు నిలవగా, రూ.2,842 కోట్లతో గుజరాత్ రెండవ స్థానంలో నిలవనుంది. ♦ మహారాష్ట్రలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.89 దాటింది. ఇక్కడ లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ అత్యధికంగా 39.12% ఉంది. ఈ విషయంలో గోవాలో కేవలం 16.66 శాతం వ్యాట్ అమలవుతోంది. ♦ ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని భావిస్తే, పెట్రో ధరల పెంపుతో వస్తున్న ఆదాయాల వల్ల రాష్ట్రాలు తమ ద్రవ్యలోటును సగటున 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించుకోవచ్చు. ♦ 2018–19 బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికి మించిన ఆదాయం వస్తున్న నేపథ్యంలో తమ ఆదాయాలకు ఢోకా లేకుండా రాష్ట్రాలు.. డీజిల్‌పై లీటరుకు సగటున రూ. 2.30 పైసలు, పెట్రోల్‌పై రూ.3.20 పైసలు ధర తగ్గించుకునే వీలుంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటకలకు ఆర్థికంగా పెట్రోల్ లీటర్‌కు రూ.3, డీజిల్‌పై రూ.2.50 తగ్గించే వెసులుబాటు ఉంది. -
ఓఎన్జీసీ ప్రయోజనాలు కాపాడుతాం
చమురు శాఖ అభయం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు, దేశీయంగా సబ్సిడీ భారంతో సతమతమవుతున్న ఓఎన్జీసీ సహా ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి కంపెనీలను ఆదుకుంటామని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో సబ్సిడీల కారణంగా చమురు ఉత్పత్తి సంస్థలు నష్టపోతున్న మొత్తాన్ని భర్తీ చేసేందుకు మార్గాలపై ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. సబ్సిడీల్లో కేంద్రం, చమురు కంపెనీలు భరించాల్సిన వాటాల గురించి సంప్రతింపులు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కిరోసిన్, ఎల్పీజీ, డీజిల్‌ను సబ్సిడీ రేట్లకు విక్రయించడం వల్ల ఇంధన రిటైలింగ్ సంస్థలకు రూ. 67,091 కోట్ల నష్టం వాటిల్లగా, అందులో 54 శాతాన్ని ఓఎన్జీసీ భరించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు, ఇరాన్లో పెట్టుబడులున్న దేశీ కంపెనీలపై అమెరికా గనుక ఆంక్షలు విధించిన పక్షంలో వాటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాన్ తెలిపారు. అయితే, ఏం చర్యలు తీసుకుంటామన్నది వివరించకుండా.. మీడియా ముఖంగా ఇలాంటివి చర్చించడం సరికాదని పేర్కొన్నారు.