ముడి చమురు ధరలు మొదటిసారిగా నెగెటివ్‌లోకి జారిపోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు నష్టపోయి 76.83కు చేరడం, అమెరికాకు ఇతర దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 1,011 పాయింట్లు పతనమై 30,637 పాయింట్ల వద్ద, నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 8,982 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.2 శాతం, నిఫ్టీ 3 శాతం మేర నష్టపోయాయి.
ఫార్మా మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే....
సెన్సెక్స్. నిఫ్టీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 812 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్ల పతనంతో మొదలయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరుగుతూ పోయాయే కానీ, తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,270 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్ల మేర నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. టెలికం, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, బ్యాంక్, వాహన, లోహ, తదితర రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
రూ.3.30 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ భారీ నష్టాల కారణంగా రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,30,409 కోట్లు హరించుకుపోయి రూ.120.42 లక్షల కోట్లకు పడిపోయింది.
మరిన్ని విశేషాలు....
► మార్కెట్ పతనంలోనూ కొన్ని షేర్లు మెరుపులు మెరిపించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ నాలుగేళ్ల గరిష్టానికి, రూ.4,046కు ఎగసింది. చివరకు 4.5 శాతం లాభంతో రూ.4,015 వద్ద ముగిసింది.
► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు–భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటొకార్ప్, నెస్లే ఇండియాలు మాత్రమే లాభపడగా, మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి.
► ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 12 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పతనమైన షేర్ ఇదే.
► బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకీ షేర్లు 6–9 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.
► ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం నష్టంతో రూ.633 వద్ద ముగిసింది.
► హైదరాబాద్‌లోని ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ వీఏఐ(వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్)సర్టిఫికెట్ ఇవ్వడంతో అరబిందో ఫార్మా 20 శాతం(రూ.104 లాభం) అప్పర్ సర్క్యూట్‌తో రూ.644 వద్ద ముగిసింది. ఇతరషేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. దివీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 30కు పైగా ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.
► సింగపూర్‌కు చెందిన ఆయిల్‌ట్రేడింగ్ కంపెనీ, హిన్ లియోన్ ట్రేడింగ్ పీటీఈ దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. ఈ కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర రుణం ఇవ్వడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 8% నష్టంతో రూ.332 వద్దకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment