ఓఎన్‌జీసీ ప్రయోజనాలు కాపాడుతాం
చమురు శాఖ అభయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు, దేశీయంగా సబ్సిడీ భారంతో సతమతమవుతున్న ఓఎన్‌జీసీ సహా ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి కంపెనీలను ఆదుకుంటామని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో సబ్సిడీల కారణంగా చమురు ఉత్పత్తి సంస్థలు నష్టపోతున్న మొత్తాన్ని భర్తీ చేసేందుకు మార్గాలపై ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. సబ్సిడీల్లో కేంద్రం, చమురు కంపెనీలు భరించాల్సిన వాటాల గురించి సంప్రతింపులు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కిరోసిన్, ఎల్‌పీజీ, డీజిల్‌ను సబ్సిడీ రేట్లకు విక్రయించడం వల్ల ఇంధన రిటైలింగ్ సంస్థలకు రూ. 67,091 కోట్ల నష్టం వాటిల్లగా, అందులో 54 శాతాన్ని ఓఎన్‌జీసీ భరించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు, ఇరాన్‌లో పెట్టుబడులున్న దేశీ కంపెనీలపై అమెరికా గనుక ఆంక్షలు విధించిన పక్షంలో వాటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాన్ తెలిపారు. అయితే, ఏం చర్యలు తీసుకుంటామన్నది వివరించకుండా.. మీడియా ముఖంగా ఇలాంటివి చర్చించడం సరికాదని పేర్కొన్నారు.