వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కోవిడ్ ధాటికి అగ్రరాజ్యంలో బుధవారం ఒక్కరోజే 3124 మంది మృతి చెందారు. ప్రాణాంతక కరోనా ప్రబలిన నాటి నుంచి అమెరికాలో ఒక్కరోజే ఈ స్థాయిలో కోవిడ్ మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు వారాల్లో సుమారు 24 వేల మంది కరోనాతో మత్యువాత పడే అవకాశం ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అంచనా వేసింది. ఇక నిన్న ఒక్కరోజే కొత్తగా 2,21,267 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 106,688కి చేరింది. గత రెండు వారాలతో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది.
ఓవైపు మహమ్మారి అంతకంతకూ ఉధృతమవుతున్న వేళ కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఐసీయూ బెడ్స్ కొరత ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి పేర్కొంది. (చదవండి: వ్యాక్సిన్ మొదట మాదేశానికి కావాలి : ట్రంప్)
కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటివరకు సుమారు 2,88,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇక కరోనా వ్యాక్సిన్ మొదట తమ దేశానికే కావాలని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. కాగా ఆది నుంచి ట్రంప్ యంత్రాంగం వైరస్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసినందు వల్లే దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయంటూ డెమొక్రాట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపై కరోనా సంక్షోభం బాగానే ప్రభావం చూపింది. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలుపునకు దోహదం చేసిన ప్రధానాంశాల్లో ఇది కూడా ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment