![Donald Trump Has Been Anxious To Restart The Paralyzed Economy - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/23/unemployment.jpg.webp?itok=OZ-mZ8mv)
న్యూయార్క్ : అమెరికాలో ఉపాధి బూమ్‌తో గత పదేళ్లుగా అందుబాటులోకి వచ్చిన ఉద్యోగాలన్నీ కోవిడ్-19 మహమ్మారితో ఒక్క నెలలోనే తుడిచిపెట్టుకుపోయాయి. గత ఐదు వారాలుగా 2.6 కోట్ల మంది నిరుద్యోగ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతో ప్రాణాంతక వైరస్‌తో కొలువులు ఏస్ధాయిలో కుప్పకూలాయో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కార్మిక శాఖ వెల్లడించిన నిరుద్యోగ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన వారి సంఖ్య అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రాణాంతక వైరస్ పెను ప్రభావం చూపిందన్న పరిస్ధితిని కళ్లకు కట్టింది. 2010 సెప్టెంబర్‌లో ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగిన ఎంప్లాయ్‌మెంట్ బూమ్‌తో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించగా కరోనా మహమ్మారితో ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ ఒకే నెలలో అదృశ్యమయ్యాయి.
ఇక లక్షల సంఖ్యలో కొలువులు చేజారుతున్న క్రమంలో సత్వరమే ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. రిపబ్లికన్ల పాలిత రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపులపై తీసుకుంటున్న చర్యలను ట్రంప్ ప్రశంసించడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ట్రంప్ మొగ్గుచూపుతున్నారు. కోవిడ్-19 కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నా లాక్‌డౌన్ సడలింపులతో ఎకానీమీని గాడినపెట్టేందుకే ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నారని డెమొక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. వైద్య నిపుణులు సైతం ఒక్కసారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే వైరస్ విశృంఖలమవుతుందని, దాన్ని అదుపు చేసే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment