
ఒక్కరోజే రూ.1,150 డౌన్
10 గ్రాముల ధర రూ.88,200
రూ.1,000 తగ్గిన వెండి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భేరిష్ ధోరణి, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బంగారానికి అమ్మకాల సెగ తగిలింది. ఢిల్లీ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 10 గ్రాములకు రూ.1,150 నష్టపోయింది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.88,200కు దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం ఇంతే మేర నష్టపోయి రూ.87,800 స్థాయికి వచ్చేసింది.
వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.98,500 స్థాయి వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.554 నష్టపోయి రూ.85,320 వద్ద ఉంది. రూ.84,800 స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీనత ఉండొచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ఔన్స్‌కు 40 డాలర్లు నష్టపోయి 2,890 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
‘‘బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది. డాలర్ గరిష్ట స్థాయి దిశగా చలించడంతోపాటు, టారిఫ్‌ల భయాలు ఇందుకు దారితీశాయి. ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగొచ్చు’’అని అబాన్స్ హోల్డింగ్స్ సీఈవో చింతన్ మెహతా విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment