
తెలంగాణ ఏసీబీ అధికారిక చిహ్నం, (పక్కన..ఆ శాఖ దర్యాప్తుచేస్తోన్న ఓటుకు కోట్లు కేసు దృశ్యం)
సాక్షి, హైదరాబాద్:
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రూ.కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వోపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రూ. 30 కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారని అభియోగం మోపింది. తీరా కేసు 6 నెలల్లోనే మూతపడింది! అదేంటంటే కేసును నిరూపించేందుకు సరైన ఆధారాల్లేవట!.. ఆ అధికారి మరో చోటికి బదిలీ అయి ఎడాపెడా దండుకుంటున్నాడు!
ఓ డీఎస్పీ.. వాణిజ్య ప్రాంతంగా పేరుపొందిన సబ్ డివిజన్‌కు అధికారి. ఆయన రూ. 25 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ కేసు పెట్టి నానా హడావుడి చేసింది. 3 నెలలు గడవక ముందే ఆ డీఎస్పీ.. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఏసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడా అదే కథ! ఆయనపై ఆరోపణలు నిరూపించేందుకు ఆధారాల్లేవని, కేసు మూసేసినట్టు ఏసీబీ కోర్టుకు తెలిపింది!!
...ఇలా ఒకట్రెండు కేసుల్లోనే కాదు.. అనేక కేసుల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తీరు ఇలాగే ఉంది. నాలుగు బృందాలు, ఆరు ప్రాంతాలు, పదుల కోట్లలో అక్రమాస్తులంటూ హడావుడి చేసే ఏసీబీ.. ఆ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చూడటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. అవినీతి తిమింగళాలను కటకటాల్లోకి నెట్టాల్సిన ఏసీబీ అధికారులే.. కేసులు మూసేయ్యడం వెనుక ఆంతర్యం ఏంటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక ఏసీబీ, విజిలెన్స్ నమోదు చేసిన కేసులు, వాటి మూసివేతకు సంబంధించిన అంశాలపై సంచలన విషయాలను వెల్లడించింది. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. అవినీతి కేసుల నమోదు, అధికారుల అరెస్ట్ తదితర వ్యవహారాల్లో 12 స్థానంలో ఉన్నా.. ఆయా కేసుల్లో సరైన ఆధారాల్లేవంటూ మూసివేయడంలో రాష్ట్ర ఏసీబీ, విజిలెన్స్ మొదటి తొలిస్థానంలో నిలవడం గమనార్హం. కేవలం 2016లోనే రాష్ట్రంలో 125 కేసులను ఆధారాల్లేక మూసివేసినట్టు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.
మూడేళ్లలో 125 కేసులు మూత
ఏసీబీ నమోదు చేస్తున్న కేసుల్లో చాలావరకు చార్జిషీట్ దశకు వచ్చేసరికి మూతపడుతున్నట్టు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. ఇలా గడిచిన మూడేళ్లలో ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు నమోదు చేసిన 125 కేసులు మూతబడ్డాయి. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద మూడేళ్లలో 421 కేసులు నమోదయితే అందులో 295 కేసులు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. చట్ట ప్రకారం ఎఫ్‌ఐఆర్ చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. కానీ వాటిని ఏళ్ల పాటు పెండింగ్‌లో పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాగే కోర్టుల్లో విచారణ దశలో 712 కేసులు ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ స్పష్టంచేసింది. ఇక 2016లో ఏసీబీ, విజిలెన్స్ వివిధ ఆరోపణలపై 101 మందిని అరెస్ట్ చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఏసీబీ సిఫార్సు చేయాలి. కానీ ఇందులో కూడా విఫలమైనట్టు స్పష్టమవుతోంది. 101 మందిని అరెస్ట్ చేస్తే కేవలం 16 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది.
ఒత్తిడి నిజమేనా..?
ఏసీబీ కేసుల్లో అరెస్టవుతున్న అధికారులు.. వారి బం«ధుమిత్రులు, రాజకీయ పరిచయాలతో ఒత్తిడి తెస్తున్నారని, అందువల్లే కేసులు మూసేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోనీ నమోదైన కేసుల్లోనైనా సమయానికి చార్జిషీట్ దాఖలు చేస్తున్నారా అంటే అంటే అదీ లేదు! ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు కేసులు నమోదు చేసి, నిందితులను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి కావాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేటివ్, న్యాయశాఖకు ప్రతిపాదన పంపుతాయి. రాజకీయ ఒత్తిళ్లతో ఈ అనుమతులు కూడా రావడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment