సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2020లో జరిగిన ఎక్కువ రోడ్డు ప్రమాదాలు గతానికి భిన్నంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్య చోటుచేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడైంది. గతంలో తెల్లవారుజామున ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
యమగండం.. సాయంత్రం 6 నుంచి 9 గంటలు..
రాష్ట్రవ్యాప్తంగా 19,172 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 4,019 ప్రమాదాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగినవేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక వెల్లడించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 3,521 ప్రమాదాలు జరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ లెక్క చెప్పింది. తర్వాతి స్థానాల్లో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య 2,835 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ సమయాల్లో జాతీయ రహదారుల్లో జరిగిన ప్రమాదాల్లో 2,496 మంది, రాష్ట్ర రహదారులపై 791 మంది దుర్మరణం చెందినట్లు నివేదిక తెలిపింది.
రైల్వే ప్రమాద మరణాల్లో...
రాష్ట్రవ్యాప్తంగా రైల్వే ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 337. ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగినవే కావడం ఆందోళన కలిస్తున్న అంశం. అదేవిధంగా 9 గంటల నుంచి 12 గంటల మధ్య 78 మం ది దుర్మరణం చెందారు. ఈ రెండు సమయా లు రైల్వేట్రాక్‌లపై యమగండాలుగా కనిపిస్తున్నట్లు ఎన్‌సీఆర్‌బీ లెక్క ప్రకారం అర్థమవుతోంది.
పాదచారులూ బలి...
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 19,172 రోడ్డు ప్రమాదాల్లో 6,882 మంది మృతి చెందగా అందులో 486 మంది పాదచారులూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వివిధ మార్గాల్లో సరైన పుట్‌పాత్‌లు లేకపోవడం కూడా పాదచారుల మరణాలకు కారణమవుతోంది. రోడ్డు దాటడం, జంక్షన్ల వద్ద చూసుకోకుండా వస్తుండటం వల్ల కూడా ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మరోవైపు రోడ్డుపై సైకిల్ తొక్కుతూ కిందపడి 51 మంది మృతిచెందినట్లు నివేదిక తెలిపింది.
ఇవే ప్రధాన కారణాలు..
రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్ట జరుగుతున్న ఘటనల్లో మెజారిటీగా ఓవర్ స్పీడ్ వల్ల సంభవించినవేనని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది. ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిన 14,978 ఘటనల్లో 5,460 మంది మృత్యువాత పడగా 14,456 మంది గాయపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో ప్రమాదకరంగా లేదా అజాగ్రత్త వాహనాలు నడపటం వల్ల 1,538 ఘటనలు జరిగాయి.
ఇందులో 637 మంది బలికాగా 1,635 మంది క్షతగ్రాతులయ్యారు. అదేవిధంగా మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో 1,328 ప్రమాదాలు జరగ్గా వాటిలో 343 మంది మత్యువాతపడ్డారు. మరో 1,295 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై...
జాతీయ, రాష్ట్ర రహదారుల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచడం ఘోర ప్రమదాలకు కారణంగా మారుతోంది. 2020లో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన 169 ప్రమాదాల్లో 194 మంది క్షతగాత్రులవగా 48 మంది దుర్మురణం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment