వెలుగు నీడల నివేదిక | Editorial On National Crime Records Bureau In India | Sakshi
Sakshi News home page

వెలుగు నీడల నివేదిక

Published Thu, Oct 24 2019 12:23 AM | Last Updated on Thu, Oct 24 2019 10:32 PM

Editorial On National Crime Records Bureau In India - Sakshi

దేశంలో నేరాల తీరెలా ఉన్నదో... ఏ రకమైన నేరాలు తగ్గాయో, ఏవి పెరిగాయో తెలుసుకోవడానికి సాధారణ ప్రజానీకం మొదలుకొని ప్రభుత్వ విభాగాల వరకూ అందరూ జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెలువరించే నివేదికలపై ఆధారపడతారు. సామాజిక పరిశోధకులకు సైతం అవి ప్రధాన వనరు. అలాంటి నివేదిక ఆలస్యమైందంటే అందుకు తగిన కారణాలుండాలి. కనీసం అలా ఆలస్యంగా వచ్చినందుకైనా అంతక్రితం నివేదికలతో పోలిస్తే సమగ్రంగా ఉండాలి. కానీ మంగళవారం వెలువడిన 2017నాటి ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఆ విషయంలో కొంత నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఇందులో కొత్త వర్గీకరణలు లేకపోలేదు. ముఖ్యంగా తొలిసారి మహిళలు, పిల్లలపై జరుగు తున్న అఘాయిత్యాలను మరిన్ని విధాల వర్గీకరించారు. అలాగే దళితులపై సాగుతున్న దమన కాండకు సంబంధించి అయినా, అవినీతి ఉదంతాలనైనా ఈ విధంగానే వివరించారు.

చర్య తీసుకోవ డానికి పోలీసులకు పట్టిన సమయం, అనంతరం న్యాయస్థానాల్లో నేరగాళ్లకు శిక్ష పడటానికి పట్టిన సమయం తదితరవివరాలిచ్చారు. దళితవర్గాలపై దాడులకు సంబంధించి జరిగే నేరాల తీరుతెన్ను లిచ్చారు. అలాగే తొలిసారి అత్యాచారాలకు సంబంధించి కూడా వేర్వేరు వర్గీకరణలిచ్చారు. మహి ళలపై అత్యాచారం చేసి హతమార్చిన సందర్భాలు, వారిపట్ల, పిల్లలపట్ల సాగుతున్న సైబర్‌ నేరాలు ఇవ్వడంతోపాటు పిల్లలపై జరిగిన అఘాయిత్యాలు ఏ ఏ సెక్షన్ల పరిధిలోకొచ్చాయో తెలిపారు. బెది రింపు కేసులు, నేరాన్ని ప్రోత్సహించిన వైనాలు, వేధింపులు, గాయపర్చడం వంటివి సైతం ప్రస్తా వించారు. మరో విశేషమేమంటే ఆన్‌లైన్‌ మోసాలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు మోసాలు, ఇంటర్నెట్‌ నేరాలు, బిచ్చమెత్తించడం కోసం అపహరణలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇలాంటి వివరాలు పోలీసులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వర్తించడానికి దోహదపడతాయి. తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలేమిటన్న అంశంలో స్పష్టతనిస్తాయి.  

అయితే దేశాన్నంతా కలవరపరిచి, చివరకు సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తపరిచి, ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించిన మూకదాడుల విషయంలో నివేదిక మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ దేశంలో ఏనాటినుంచో ఉన్నవే అయినా ఈమధ్య కాలంలో అవి ఒక్కసారిగా పెరిగిన తీరు ఆందోళనకరం. మూకదాడులకు ఫలానా కారణమని చెప్పడానికి లేదు. పశువుల్ని తరలి స్తున్నారన్న ఆరోపణలు మొదలుకొని పసిపిల్లల్ని అపహరించడానికి వచ్చారనే అనుమానాల వరకూ అందుకు సవాలక్ష సాకులున్నాయి. ఇంకా పశు మాంసం దగ్గరుంచుకున్నారని, ఇష్టం లేని పెళ్లి చేసు కుని కుటుంబం పరువు తీశారని, తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని–ఒకటేమిటి ఏదో ఒక కారణం చెప్పి ఉన్మాద మూకలు వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీసిన ఉదంతాలున్నాయి. అలాంటి దాడుల్లో నిలువెల్లా గాయపడి నెత్తురోడుతున్నవారిపట్ల పోలీసులు కనికరం లేకుండా, వారిని వైద్య చికిత్సకు పంపకుండా జాప్యం చేసిన ఘటనలున్నాయి. వాటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి మనిషన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ఆ దృశ్యాలు చూసినా, అలా చూసినవారు చెప్పగా విన్నా మనసు వికలమవుతుంది. అంతటి ఘోరాల విషయంలో ఎన్‌సీఆర్‌బీ మౌనం వహిం చడం సబబు కాదు.

ఇతర నేరాల విషయంలో పలు వర్గీకరణలు, అందులో మరిన్ని ఉప వర్గీకరణలు చేసిన నివేదిక  ఖాప్‌ పంచాయతీల గురించి కూడా చెప్పలేదు. సాగు సంక్షోభం పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఉసురుతీసుకుంటున్న రైతుల ప్రస్తావన కూడా ఈ నివేదికలో లేదు. రైతులు ప్రాణాలు తీసుకోవడానికి రకరకాల కారణాలు కనబడతాయి. పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, ప్రకృతి సహకరించక పంట ఎండిపోవడం, వడ్డీ వ్యాపారుల వేధింపులు, పిల్లల్ని చదివించలేక పోవడం తదితరాలు ప్రస్తావనకొస్తుంటాయి. కానీ వీటి మూలాలు సాగు సంక్షోభంలోనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలపై గణాంకాలు అందుబాటులో ఉంటే ఈ సాగు సంక్షోభ నివారణకు ఇంకేమి చర్యలు అవసరమో ఆలోచించడానికి ప్రభుత్వాలకు వీలవుతుంది. మరింత మెరుగైన పరిష్కారాల కోసం అన్వేషణ సాగుతుంది. సైబర్‌ నేరాలు 77శాతం పెరిగాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. అందులో దేశంపై ద్వేషాన్ని పెంచేవి, రాజకీయ నేరాలు, ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల నేరాలు ఉన్నాయి. అవి ఎక్కడ అధికంగా జరుగుతున్నాయో వివరాలివ్వడం ఇందులో కనబడుతుంది. రాజ ద్రోహ నేరాల సంఖ్య 45 శాతం పెరగడం, ఆ ఏడాది 228మంది ఈ నేరం కింద అరెస్టుకావడం గమనించదగ్గది. 

న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల తీరుపైనా, అందుకు దారితీస్తున్న కారణాలపైనా నివేదిక దృష్టి సారించింది. ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల్లో మూడు నెలల్లో చార్జిషీటు దాఖలు చేయాలన్న నిబంధన ఉన్నా 60 శాతం కేసుల్లో అది జరగటం లేదు. పర్యవసానంగా ఏడాదికి మించి జాప్యం జరిగిన కేసులు 3 లక్షలకు పైగా ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లోనూ ఈ కార ణంగా వేలాది కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. దళితులపై సాగుతున్న అఘాయిత్యాలు అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఈ నేరాల్లో సగానికిపైగా అవమానాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం దళితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసినవే కావడం చూస్తే వారిలో గతంతో పోలిస్తే ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందన్న సంగతి అర్ధ మవుతుంది. దేశంలో వెంటవెంటనే శిక్షలు పడే వ్యవస్థ ఉంటే నేరాల నియంత్రణ సులభమవుతుంది. అందులో విఫలమైనప్పుడే అవి ఉగ్రరూపం దాలుస్తాయి. ఇంకా ఎలాంటి చట్టాలు తీసుకురావాలో అధ్యయనం చేయడానికి, ఉన్నవాటిని పటిష్టపరచడానికి ఈ మాదిరి నివేదికలు ఎంతో దోహద పడతాయి. కానీ అవి సకాలంలో వచ్చినప్పుడే, సవిస్తరంగా ఉన్నప్పుడే అన్నివిధాలా ఉపయోగ పడుతుంది. అందువల్ల ప్రభుత్వాల పనితీరు పదునుదేరుతుంది. ఈ సంగతి ఎన్‌సీఆర్‌బీ పెద్దలతో పాటు కేంద్రం కూడా గుర్తించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement