ప్రతీకాత్మక చిత్రం
చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. కర్ణాటకలో హఠాత్తుగా తెరపైకొచ్చిన హిజాబ్, హలాల్ వివాదాలు రగిల్చిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈలోగా ఢిల్లీ పరిధిలో బీజేపీ నేతృత్వంలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థల మేయర్లు ఈ నెల 2 నుంచి 11 వరకూ జరిగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలంటూ పిలుపు నిచ్చారు.
ఈ ఇద్దరు మేయర్లూ తమ తమ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు లేఖలు రాశారు. అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ లేకపోయినా ఆ నగర పాలక సంస్థల పరిధుల్లో చాలా మాంసం దుకాణాలు మూసివేశారంటేనే సాధారణ దుకాణదారుల్లో ఎంతగా భయం రాజ్య మేలుతున్నదో అర్థమవుతుంది. దేశ రాజధానిగా ఉన్న ఒక మహా నగరంలో ఇలాంటి పరిస్థితు లుండటం సరికాదన్న కనీస ఆలోచన కూడా మన నేతలకు కొరవడుతోంది.
మన దేశంలో పుట్టుక చాలా అంశాలను నిర్ణయిస్తుంది. ఏ మతంలో, ఏ కులంలో పుట్టారు.. ఏ జెండర్ వగైరా అంశాల ఆధారంగా ఎవరెలా నడుచుకోవాలో, ఎలాంటి వస్త్రధారణ అవసరమో ముందుగానే నిర్దేశితమవుతాయి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా! రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ 2016లో వెల్లడించిన అంశాల ప్రకారం మన దేశంలో మెజారిటీ జనాభా మాంసాహార ప్రియులు. ఆసక్తి కరమైన అంశమేమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో శాకాహార ప్రియుల శాతం కాస్త ఎక్కువగా ఉంటే దక్షిణాది రాష్ట్రాలన్నిటా పూర్తిగా మాంసాహార ప్రియులదే ఆధిక్యత.
మొత్తంగా దేశంలో 71 శాతం మంది పైగా మాంసాహారాన్ని భుజిస్తుంటే... దాదాపు 29 శాతం మంది శాకాహారులు. ఆహారపుటలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మాంసాహారంలో లభించే ప్రొటీన్లు కొన్ని శాకాహారులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆహార నిపుణులు చెబుతారు. వారికోసం కొన్ని ప్రత్యామ్నా యాలు సూచిస్తారు. కొన్నిచోట్ల శాకాహారులుగా ముద్రపడిన కులాలకు చెందినవారు వేరే ప్రాంతాల్లో మాంసాహారులుగా ఉండటం కూడా కనబడుతుంది.
ఏడేళ్ల క్రితం మహారాష్ట్రలో బీజేపీ –శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మూడు రోజులపాటు మాంసం అమ్మరాదని నిషేధం విధించింది. జైనుల పండుగ పర్యూషణ్ సందర్భంగా ఈ నిషేధం తెచ్చినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సంద ర్భంగా బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి ఈ నిషేధంలో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించినప్పుడు.. అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని జవాబిచ్చి అడ్వొకేట్ జనరల్ నవ్వుల పాలయ్యారు.
ఇష్టపడిన ఆహారాన్ని తినడం, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, నచ్చిన మతాన్ని అనుస రించడం లేదా మతాతీతంగా ఉండాలనుకోవడం, నచ్చిన వ్యాపారం చేసుకోవడం రాజ్యాంగం ఈ దేశ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కొన్ని. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైనుల పండుగ సందర్భంగా మాంసం విక్రయాన్ని నియంత్రిస్తూ ఇచ్చిన ఆదేశాల చెల్లుబాటును 2008లో ధ్రువీకరిస్తూనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. ‘ఎవరు ఏం తినాలనేది వ్యక్తుల ఇష్టానిష్టాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, వారి జీవించే హక్కుకూ రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోకొస్తుంది’ అని స్పష్టం చేసింది.
ఈ హక్కును ఉల్లంఘిస్తున్నామనిగానీ, తమ చర్య ద్వారా మెజారిటీ జనాభా ఆహారపు అలవాట్లను నియంత్రిస్తున్నామనిగానీ ఢిల్లీ మేయర్లకూ, అక్కడి బీజేపీ నాయకులకూ తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ పౌరుల హక్కులను గుర్తించి, గౌరవించడమే ఏ పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థకైనా గీటురాయి. కేవలం అయిదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడమే ప్రజాస్వామ్యం అను కునే పాలకులున్న వ్యవస్థ బనానా రిపబ్లిక్‌గానే మిగిలిపోతుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఉల్లి, వెల్లుల్లి వంటివి కూడా తినబోరని, అలాంటి పరిస్థితుల్లో మాంసం బహిరంగ విక్రయం వారి మనోభావాలను దెబ్బతీస్తుందని మేయర్లు వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
2015లో ముంబై హైకోర్టు మాంసం విక్రయాల నియంత్రణపై తీర్పునిస్తూ ‘జైన మత సోదర, సోదరీ మణులతో సంఘీభావం ప్రకటించడం వేరు... ప్రజానీకానికి మార్కెట్లో మాంసం దొరక్కుండా చర్యలు తీసుకోవడం, వారికి నచ్చిన ఆహారం అందుబాటులో లేకుండా చేయడం వేరు’ అని చెప్పింది. పౌరులు స్వచ్ఛందంగా ఏ పనైనా చేయడం స్వాగతించదగ్గది. కానీ వారితో బలవంతంగా అమలు చేయించాలని చూడటం వివాదాలకూ, అనవసర భయాందోళనలకూ దారితీస్తుంది.
ఏం చదవాలో, ఎలా ఆలోచించాలో, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో, ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్దేశించడంతో మొదలుపెట్టి వంటింట్లో ఏం వండాలో కూడా నిర్ణయించే స్థాయికి మన నేతలు చేరడం దురదృష్టకరమైన స్థితి. ఢిల్లీలో కేవలం మందబలం ఆధారంగా ప్రస్తుతం అనధికారికంగా అమలవుతున్న నిషేధాలను పాలనాధికార వ్యవస్థ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం సరికాదు. నిజానిజాలేమిటో ప్రజల ముందుంచాలి. ఇవి అనధికారికమైనవేనని తేల్చి చెప్పాలి. కనీసం న్యాయస్థానాలైనా జోక్యం చేసుకుని బాధ్యులైనవారిపై చర్యలకు ఆదేశించాలి. మూకస్వామ్యం చేటు తెస్తుందని అందరూ గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment