దాదాపు పదిహేనేళ్లుగా చర్చలకే పరిమితమవుతూ వస్తున్న అత్యంత కీలకమైన భారత–అమెరికా రక్షణ ఒప్పందంపై ఎట్టకేలకు మంగళవారం సంతకాలయ్యాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరో వారంలో ముగియబోతుండగా కుదిరిన ఈ ఒప్పందంపై హర్షామోదాలు వ్యక్తమవుతున్నట్టే సంశయాలు కూడా రాజుకుంటున్నాయి. తాజా ఎన్నికల తర్వాత అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ ఏలుబడి రావొచ్చునని సర్వేలన్నీ చెబుతున్నవేళ ఇంత అత్యవసరంగా ఈ కీలక ఒప్పందం కుదుర్చు కోవాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్న తలెత్తింది. అయితే పాలకులెవరన్న దాంతో నిమిత్తం లేకుండా అమెరికాకు ఈ కీలక ఒప్పందం ఎంతో అవసరం. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా మొండికేసి, మనకు సమస్యలు సృష్టిస్తున్న మాట వాస్తవమే అయినా ఆ దేశంతో మనకంటే ఎక్కు వగా సమస్యలు ఎదుర్కొంటున్నది అమెరికాయే. భౌగోళిక సరిహద్దులు లేవన్న మాటేగానీ... బహుళ రంగాల్లో చైనా వేస్తున్న ఎత్తులకు అమెరికా చాన్నాళ్లుగా చిత్తవుతోంది. అన్నిచోట్లా తన ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా దూసుకుపోతున్న చైనాను నిలువరించడం అమెరికాకు జీవన్మరణ సమస్య అయింది.
కనుకనే మంగళవారం భారత–అమెరికాల మధ్య సంతకాలైన ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్’(బెకా) మనకన్నా ఆ దేశానికి తక్షణావసరం. అయితే అంతమాత్రం చేత దానివల్ల మనకు ఒరిగేదేమీ ఉండదని చెప్పడానికి లేదు. ఈ ఒప్పందం అమెరికాకు చెందిన అత్యంతాధునిక సైనిక ఉపకరణాలు లభ్యం కావడానికి... శత్రు కదలికలను ఎప్పటికప్పుడు రాబట్టి వారిపై తక్షణమే దాడిచేసేందుకు వీలుకలిగించే నిఘా సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకూ తన సొంత సైనిక అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్న సైనిక సాంకేతి కతను అమెరికా మనకు అందజేస్తుంది.
వాస్తవానికి అమెరికాతో ఇంతక్రితం కుదిరిన రెండు కీలక ఒప్పందాలు–2016నాటి సైనిక సంబంధ మౌలిక అవసరాలకు సంబంధించిన అంశాల్లో పరస్పర సహకరించుకునే ఒప్పందం(లెమోవా), 2018 నాటి కమ్యూనికేషన్లు, భద్రతారంగాల ఒడంబడిక (కామ్‌కాసా)లకు ఇది కొనసాగింపు. దీంతో ఇరు దేశాల మధ్యా సైనిక సహకారానికి సంబంధించి పటిష్టమైన బంధం ఏర్పడినట్టయింది. ఇప్పుడు కుదిరిన బెకా ఒప్పందం వాస్తవానికి యూపీఏ తొలి దశ పాలనలోనే సాకారం కావలసివుంది. అయితే అప్పట్లో మిత్రపక్షాలైన వామపక్షాల నుంచి తీవ్ర మైన ఒత్తిళ్లు రావడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది. అమెరికా చట్టం ప్రకారం బెకా ఒప్పందం వున్న దేశాలతో తప్ప మరే దేశంతోనూ అది పూర్తి స్థాయి సైనిక బంధాన్ని ఏర్పర్చు కోకూడదు.
లెమోవా ఒప్పందం సమయంలోనే మన సైనిక స్థావరాల ఆనుపానులు, అక్కడున్న కీలకమైన సదుపాయాల వివరాలు అమెరికాకు వెల్లడవుతాయని...మన త్రివిధ దళాల సామర్థ్యానికి సంబంధించిన డిజిటల్ సమాచారం ఆ దేశానికి తెలుస్తుందని రక్షణ రంగ నిపుణులు అభ్యంతరం తెలిపారు. గల్ఫ్ యుద్ధ సమయంలో తమ విమానాలకు ఇంధనం నింపుకునే సదుపాయం కల్పించ మని అమెరికా అడిగినప్పుడు నలుమూలలనుంచీ వచ్చిన ఒత్తిళ్లతో అప్పటి వాజపేయి ప్రభుత్వం నిరాకరించింది. కానీ లెమోవా ఒప్పందంతో అదిప్పుడు సాధ్యమే. ఈ మూడు ఒప్పందాల పర్య వసానంగా అమెరికాకు మనం అందజేసే అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు ఆ దేశం కూడా మనకు కల్పిస్తుంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా అమెరికాకు ప్రపంచంలో కీలకమైనచోట్ల సైనిక స్థావరాలున్నాయి. మనకు తజికిస్తాన్‌లోని వైమానిక దళ స్థావరం తప్ప మరెక్కడా స్థావరాలు లేవు. కనుక సమాన ప్రతిపత్తి అన్నది కాగితాలకే పరిమితమవుతుంది. అయితే యుద్ధ సమయాల్లో మన త్రివిధ దళాలకు అసరమైన ఆహారం, మంచినీరు, రవాణా, ఔషధాలు, సైనిక సామగ్రి విడి భాగాలు, వాటి మరమ్మతు, శిక్షణ, ఇతర సేవలు అందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. మన త్రివిధ దళాలకు డేటా సంబంధ అంశాల్లో... ముఖ్యంగా వాటి ఆధారంగా శత్రువులను ఎదు ర్కొనడానికి, వారిపై పైచేయి సాధించేందుకు అనువైన వ్యూహ రచనలో అమెరికా శిక్షణ లభిస్తుంది.
అమెరికాతో సాగుతున్న పోటీలో చైనా క్రమేపీ బలపడుతోంది. అమెరికా జీడీపీకి చైనా జీడీపీకి మధ్య ఇప్పుడు పెద్దగా వ్యత్యాసం లేదు. పెట్టుబడుల్లోనూ అది ముందుంది. అమెరికా సన్నిహిత దేశాల్లోనే దాని పెట్టుబడులు పెరుగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీల్లో ఇప్పుడు చైనా వాణిజ్యం ముమ్మరమైంది. చైనా పెట్టుబడులను కాదంటే ఆ దేశాల్లో లక్షలాదిమంది ఉపాధి అవకాశాలు దెబ్బతిని, అక్కడి ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యే ప్రమాదం వుంది. ముఖ్యంగా బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా వుంది. ఈ దేశాలను చైనాకు దూరం చేయడం అమెరికాకు అంత సులభం కాదు. ఉన్నంతంలో ట్రంప్ చైనాను ద్వైపాక్షిక వాణిజ్యంలో ఎంతోకొంత లొంగదీయగలిగారు. అది అమెరికానుంచి అంతక్రితంకన్నా రెట్టింపు పరిమాణంలో సోయాబీన్స్‌ను కొనేలా, మాంస ఉత్పత్తుల్ని మునుపటికన్నా 16 రెట్లు అధికంగా దిగుమతి చేసుకునేలా, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని సైతం భారీగా కొనుగోలు చేసేలా ఒప్పించగలిగారు.
ప్రపంచంపై తిరుగులేని ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ఇవి మాత్రమే చాలవు. చైనాను కట్టడి చేయడానికి మరిన్ని అవసరం. అందులో భాగమే వివిధ దేశాలతో అమెరికా కుదుర్చుకుంటున్న ఒప్పందాలు. ఈ మాదిరే యూరోప్ దేశాలతో సైతం అవగాహనకు రావడానికి అది పావులు కదుపుతోంది. అదే సమయంలో చైనా తప్పుడు వ్యూహాలతో, దురాశతో ఇరుగుపొరుగుతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో కుదుర్చుకునే ఒప్పందాలు మన ప్రయో జనాలకు అనువుగా వుండేలా చూడాలి. అందుకు భిన్నంగా వుంటే మనకు లాభంకన్నా నష్టమే మిగులుతుంది.
Comments
Please login to add a commentAdd a comment