Unnao Rape Case: Delhi Court to Pronoucne Verdict Against Kuldeep Singh Sengar | ‘ఉన్నావ్‌’ తీర్పు నేడే? - Sakshi
Sakshi News home page

‘ఉన్నావ్‌’ తీర్పు నేడే?

Published Mon, Dec 16 2019 1:26 AM | Last Updated on Mon, Dec 16 2019 12:26 PM

Delhi court to pronounce verdict in Unnao case - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశముంది. ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది.

2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ ఓ బాలికను కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్‌ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్‌ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి.

అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్‌ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఆదేశాలు జారీ చేశారు.

నిర్భయ దోషులను నేను ఉరి తీస్తా
హోంమంత్రికి షూటర్‌ వర్తికా సింగ్‌  రక్తంతో లేఖ
లక్నో: నిర్భయ కేసులో దోషులను ఉరి తీసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ షూటర్‌ వర్తికా సింగ్‌ తన రక్తంతో రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు.   ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘నా చేతిలో ఉన్న లేఖ హోంమంత్రి అమిత్‌షాకు రాశా. నా రక్తంతో రాసిన ఈ లేఖను రిజిస్టర్డ్‌ పోస్టులో ఆయనకు పంపా. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరా. భారత్‌లో మహిళలను దేవతలుగా చూసే సంస్కృతి బలోపేతానికి ఈ అంశం దోహదపడుతుంది. ఈ సందేశం ప్రపంచం మొత్తానికి వెళ్లాలి.

అలాగే మహిళ కూడా ఉరి తీయగలదన్న విషయాన్ని అత్యాచార దోషులు తెలుసుకోవాలి. ట్వీట్‌ కూడా చేశా’అని తెలిపారు. మహిళా సైనికులు, మహిళా నటులు, ఎంపీలు, సంస్థలు తనకు మద్దతు తెలపాలన్నారు. మరోవైపు నిర్భయ దోషులను తాము ఉరి తీస్తామంటూ తీహార్‌ జైలు అధికారులకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. నిర్భయ కేసు దోషి ఒకరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.

నేర నిరూపణ 32 శాతమే!
అత్యాచార ఘటనల్లో క్షేత్రస్థాయిలో లోపిస్తున్న శాస్త్రీయ విచారణ
చార్జిషీటు దాఖలులోనూ అలసత్వం..
న్యూఢిల్లీ: సరిగ్గా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యంత పాశవికమైన నిర్భయ ఘటన ఇప్పటికీ దేశ ప్రజల గుండెల్లో పచ్చి పుండులాగే ఉంది. దేశంలో ఎన్నో నిర్భయ లాంటి సంఘటనలు జరుగుతున్నా.. నిందితులపై నేర నిరూపణ మాత్రం జరగట్లేదు. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై అత్యాచారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా నిందితులకు మాత్రం శిక్షలు అమలు కావట్లేదు.

దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల్లో 32.2 శాతం మాత్రమే నేర నిరూపణ జరుగుతోందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో–2017 డేటా ప్రకారం తెలుస్తోంది.  2017లో దేశవ్యాప్తంగా మొత్తం 1,46,201 కేసుల్లో విచారణ చేపట్టగా, కేవలం 5,822 కేసుల్లోనే నేర నిరూపణ జరిగింది. అత్యాచార ఘటనలు పెరుగుతున్నా.. చార్జిషీటు దాఖలు రేటు మాత్రం తగ్గుతోంది. అంతేకాకుండా కోర్టు వరకు చాలా కేసులు వెళ్లకపోవడం మరింత ఆందోళన చెందాల్సిన విషయం. చార్జిషీటు దాఖలు రేటు 2013లో 95.4 శాతం ఉండగా, 2017 వచ్చేసరికి 86.6 శాతానికి తగ్గింది.

ఒడిశా మాజీ డీజీపీ బీబీ మహంతీ.. ఓ విదేశీ పర్యాటకురాలిని అత్యాచారం చేసిన కేసులో డిఫెన్స్‌ లాయర్‌ శిల్పి జైన్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న పోలీసు అధికారుల్లో నైపుణ్యత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘చార్జి షీటు దాఖలు చేసే విషయంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌దే కీలక పాత్ర. అంటే ఆ చార్జిషీటు విషయం ఎంత శాస్త్రీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఈ కేసులను చేపట్టే న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. విచారణ సరిగ్గా జరపకపోవడం, కోర్టులో కేసులు నిలవకపోవడం వల్లే నేర నిరూపణ శాతం చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement