కోర్టుకు వచ్చిన ఎమ్మెల్యే సెంగార్ (ఫైల్)
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బా«ధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టిన తీస్‌హజారీ కోర్టు సోమవారం బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో 19వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్లు సోమవారం తెలిపింది.
రెండేళ్లు.. అనూహ్య మలుపులు..
నిర్భయ ఘటనలో విచారణ జాప్యంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఒకవైపు, దిశ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సమాజం మరోవైపు ఉండగా ఉన్నావ్ ఘటనలో తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాధిత బాలికను ఘటనా స్థలానికి తీసుకెళ్లింది శశి సింగే అయినప్పటికీ, అక్కడ అత్యాచారం జరుగుతుందన్న విషయం శశికి తెలియదని అభిప్రాయపడింది. సెంగార్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు సెల్‌ఫోన్ రికార్డు ఆధారంగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది.
బాధితురాలి ఆందోళన.. సోషల్ మీడియా..
2017లో బాలికను కిడ్నాప్ చేసి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి యోగి ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగింది. ఆ తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తండ్రిని పోలీసులు జైల్లో నిర్బంధించారు. రెండు రోజుల అనంతరం ఆయన కస్టడీలోనే మృతి చెందారు. తన తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేస్తున్న వీడియో క్లిప్పింగ్‌ని బాధితురాలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే ప్రధాన నిందితుడు సెంగార్, మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
బీజేపీ నుంచి కుల్దీప్ సింగ్ బహిష్కరణ..
ఉత్తరప్రదేశ్‌లోని బంగేరుమావ్ నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆయన్ను ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలో రికార్డు చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షులు బాధితురాలి తల్లి, మామ. కోర్టు తీర్పు అనంతరం బాధితురాలికి ప్రత్యేకంగాభద్రతను ఏర్పాటు చేశారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేక వసతి గృహంలో ఉంచారు.
కారు ప్రమాదంపై అనుమానాలు
ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది.
లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు..
అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల కేసు, ఆయన లాకప్ మరణం, బాధితురాలికి రోడ్డు ప్రమాదం, బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌కి సంబంధించిన కేసుతో సహా మొత్తం నాలుగు కేసులపై విచారణ కొనసాగుతోంది.
భోరుమన్న సెంగార్
ఈ కేసులో మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుందని వెల్లడించగానే కోర్టు ఆవరణ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కోర్టులోకి ఇరు పక్షాల న్యాయవాదులు మినహా ఎవ్వరినీ అనుమతించలేదు. సీబీఐని కొన్ని ప్రశ్నలడిగిన అనంతరం జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ఎమ్మెల్యే సెంగార్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. దీంతో సెంగార్, ఆయన కుమార్తెలు భోరున విలపించారు.
సీబీఐకి కోర్టు అక్షింతలు
ఈ ఘటనపై విచారణలో జాప్యానికి సీబీఐనే కారణమని కోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా పురుష అధికారులు వాంగ్మూలం తీసుకోవడం, విచారణ కోసం ఆమెను సీబీఐ కార్యాలయానికి పిలిపించు కోవడాన్ని తప్పుపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment