delhi high court verdict
-
పేద వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్), అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య అందుబాటులో ఉండడం లేదని, ఫలితంగా వారు ఎంతో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) కచ్చితంగా అమలు చేసే దిశగా ఒక వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర, ప్రభుత్వాలకు శుక్రవారం సూచించింది. ఆన్లైన్ తరగతులు వినడానికి వీలుగా పేద విద్యార్థులకు పరికరాలు(స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్‌ట్యాప్‌లు) అందజేయాలని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు 2020 సెప్టెంబర్ 18న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్తింపు పొందిన అన్–ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను నిజం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అది జరగాలంటే పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్యను నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారికి ఆన్లైన్ విద్య అందకపోతే సంపన్న కుటుంబాల పిల్లల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని, ఇరు వర్గాల మధ్య అంతరం పెరిగిపోతుందని తెలిపింది. మంచి తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. -
వందరోజుల తరువాత.. పూడ్చేసిన మృతదేహాన్ని వెలికితీసి...
మోర్తాడ్ (బాల్కొండ): సౌదీ అరేబియాలో తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఖననం చేసిన తన భర్త మృత దేహాన్ని తెప్పించాలని ఢిల్లీ హైకోర్టు ద్వారా న్యాయపోరాటం చేసిన ఓ మహిళ విజయం సాధించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌కుమార్ (49) దాదాపు 23 ఏళ్ల నుంచి సౌదీలో పనిచేస్తున్నాడు. జనవరి 24న అతనికి గుండెపోటు రావడంతో సౌదీ బీష్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. జెద్దా భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ట్రాన్స్‌లేటర్ చేసిన తప్పిదంతో సంజీవ్‌కుమార్‌ను ముస్లింగా భావించి ఆ మత సంప్రదాయాల ప్రకారం సౌదీలోనే ఖననం చేశారు. దీంతో సంజీవ్‌కుమార్ భార్య అంజూశర్మ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సహకారంతో ఢిల్లీ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం సంజీవ్‌కుమార్ మృతదేహాన్ని అంజూశర్మకు స్వాధీన పరచాలని ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని తవ్వితీసి కార్గో విమానంలో బుధవారం ఢిల్లీకి తరలించారు. ఎయిర్‌పోర్టులోనే మృతదేహాన్ని అంజూశర్మకు విదేశాంగ శాఖ అధికారులు అప్పగించారు. -
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యేనే దోషి
-
‘ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బా«ధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టిన తీస్‌హజారీ కోర్టు సోమవారం బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో 19వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్లు సోమవారం తెలిపింది. రెండేళ్లు.. అనూహ్య మలుపులు.. నిర్భయ ఘటనలో విచారణ జాప్యంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఒకవైపు, దిశ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సమాజం మరోవైపు ఉండగా ఉన్నావ్ ఘటనలో తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాధిత బాలికను ఘటనా స్థలానికి తీసుకెళ్లింది శశి సింగే అయినప్పటికీ, అక్కడ అత్యాచారం జరుగుతుందన్న విషయం శశికి తెలియదని అభిప్రాయపడింది. సెంగార్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు సెల్‌ఫోన్ రికార్డు ఆధారంగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. బాధితురాలి ఆందోళన.. సోషల్ మీడియా.. 2017లో బాలికను కిడ్నాప్ చేసి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి యోగి ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగింది. ఆ తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తండ్రిని పోలీసులు జైల్లో నిర్బంధించారు. రెండు రోజుల అనంతరం ఆయన కస్టడీలోనే మృతి చెందారు. తన తండ్రిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేస్తున్న వీడియో క్లిప్పింగ్‌ని బాధితురాలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే ప్రధాన నిందితుడు సెంగార్, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. బీజేపీ నుంచి కుల్దీప్ సింగ్ బహిష్కరణ.. ఉత్తరప్రదేశ్‌లోని బంగేరుమావ్ నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆయన్ను ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలో రికార్డు చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షులు బాధితురాలి తల్లి, మామ. కోర్టు తీర్పు అనంతరం బాధితురాలికి ప్రత్యేకంగాభద్రతను ఏర్పాటు చేశారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేక వసతి గృహంలో ఉంచారు. కారు ప్రమాదంపై అనుమానాలు ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు.. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల కేసు, ఆయన లాకప్ మరణం, బాధితురాలికి రోడ్డు ప్రమాదం, బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌కి సంబంధించిన కేసుతో సహా మొత్తం నాలుగు కేసులపై విచారణ కొనసాగుతోంది. భోరుమన్న సెంగార్ ఈ కేసులో మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుందని వెల్లడించగానే కోర్టు ఆవరణ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కోర్టులోకి ఇరు పక్షాల న్యాయవాదులు మినహా ఎవ్వరినీ అనుమతించలేదు. సీబీఐని కొన్ని ప్రశ్నలడిగిన అనంతరం జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ఎమ్మెల్యే సెంగార్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. దీంతో సెంగార్, ఆయన కుమార్తెలు భోరున విలపించారు. సీబీఐకి కోర్టు అక్షింతలు ఈ ఘటనపై విచారణలో జాప్యానికి సీబీఐనే కారణమని కోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా పురుష అధికారులు వాంగ్మూలం తీసుకోవడం, విచారణ కోసం ఆమెను సీబీఐ కార్యాలయానికి పిలిపించు కోవడాన్ని తప్పుపట్టింది. -
సజ్జన్ కుమార్ దోషే
న్యూఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్(73)ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన ఇక మిగిలిన తన జీవిత కాలమంతా జైలులోనే గడపాలని ఆదేశిస్తూ జీవిత ఖైదు విధించింది. సిక్కుల ఊచకోత జరిగిన 34 ఏళ్ల తరువాత సోమవారం కోర్టు తీర్పు వెలువరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు రాజకీయ పలుకుబడి, మద్దతు ఉన్న వారే మతం పేరిట హింసకు పాల్పడ్డారని పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించిన కోర్టు..సజ్జన్ కుమార్‌పై హత్య, వేర్వేరు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి నేరపూరిత కుట్ర పన్నడం, గురుద్వారాను అపవిత్రం, విధ్వంసం చేయడం తదితర అభియోగాలను మోపింది. ఈ కేసులో సజ్జన్‌తో పాటు ఇది వరకే దోషులుగా తేలిన మరో ఐదుగురు ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, ఈ నెల 31 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సజ్జన్ తరఫు లాయర్ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చారిత్రకమని బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ స్వాగతించాయి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పేర్కొంది. ముగ్గురు సాక్షుల పోరాట ఫలితం: ఈ కేసులో నిందితులైన సజ్జన్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిపై 2010లో విచారణ ప్రారంభమైంది. మూడేళ్ల తరువాత సజ్జన్ కుమార్ మినహా మిగిలిన వారంతా దోషులని కింది కోర్టు తేల్చింది. ఈ తీర్పును సీబీఐ సవాలు చేయగా తాజాగా జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సజ్జన్ కూడా దోషి అని ప్రకటించింది. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు జగదీశ్ కౌర్, ఆమె కజిన్ జగ్షీర్ సింగ్, నిర్ప్రీత్ కౌర్‌ల అలుపెరుగని పోరాటం వల్లే సజ్జన్‌కు శిక్ష పడిందని బెంచ్ పేర్కొంది. నిందితులకు శిక్ష పడేందుకు మూడు దశాబ్దాలు పట్టినా కూడా సత్యం గెలిచి, న్యాయం జరుగుతుందని బాధితులకు భరోసా ఇవ్వడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. సీబీఐ రంగప్రవేశం చేశాకే సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి నోరు విప్పారని పేర్కొంది. మరోవైపు, సజ్జన్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారని, డిసెంబర్ 31లోగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరఫు లాయర్ వెల్లడించారు. ఒకవేళ ఆలోగా అత్యున్నత న్యాయ స్థానంలో తాజా తీర్పును సవాలుచేయకుంటే సజ్జన్‌కుమార్ లొంగిపోతారని తెలిపారు. కళంకితుడిని సీఎం ఎలా చేస్తారు?: జైట్లీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇదే కేసులో సిక్కులు దోషిగా భావిస్తున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తప్పుపట్టారు. సిక్కుల ఊచకోతలో సజ్జన్‌కుమార్ ఒక మాయని మచ్చలా మిగిలిపోయారని, దేశం ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. సిక్కుల దృష్టిలో దోషిగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఈ తీర్పు రావడం గమనార్హమని పరోక్షంగా కమల్‌నాథ్‌ను ఉద్దేశించి అన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రాజకీయం చేయడం సరికాదని, చట్టం తన పనిని తాను చేసుకుపోవాలని కాంగ్రెస్ పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో చెలరేగిన హింసలో కమల్‌నాథ్ పాత్ర కూడా ఉందని, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కాంగ్రెస్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే కమల్‌నాథ్ తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశాక పేర్కొన్నారు. 4 రోజుల్లో 2,733 మంది సిక్కుల ఊచకోత 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 1–4 మధ్య రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య కేసులో సజ్జన్ నిందితుడిగా ఉండగా, కోర్టు తాజాగా తీర్పును ప్రకటించింది. జగదీశ్ కౌర్ భర్త, కొడుకు, ఆమె ముగ్గురు కజిన్లు కేఖర్ సింగ్, గురుప్రీత్ సింగ్, రఘువేందర్ సింగ్‌లతో పాటు నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్..మొత్తం ఐదుగురిని అల్లరి మూకలు దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని సజీవంగా దహనం చేయడాన్ని నిర్ప్రీత్ కౌర్ ప్రత్యక్షంగా చూసింది. 34 ఏళ్లు అంటే సుదీర్ఘ కాలమే అయినా నిందితుల అసలు రంగు బయటపెట్టేందుకు కృత నిశ్చయంతో పోరాడామని జగదీశ్ కౌర్, నిర్ప్రీత్ కౌర్ చెప్పారు. తాజా తీర్పు తమకు కొంత సాంత్వన చేకూర్చిందని, ఇన్నాళ్లూ తాము అనుభవించిన అన్యాయం, క్షోభ మరొకరికి రావొద్దని అన్నారు. -
నవలఖ విడుదలపై సుప్రీంకు మహారాష్ట్ర
న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ(65)ను గృహనిర్బంధం నుంచి విడుదలచేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిశాంత్ కట్నేశ్వర్ బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలుచేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 167(1), (2)లను తప్పుగా అర్థం చేసుకున్న హైకోర్టు పొరపాటున నవలఖను విడుదల చేసిందని, అతని ట్రాన్సిట్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సెక్షన్ 167(1) ప్రకారం నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటే సంబంధిత పోలీస్ అధికారులు కేస్ డైరీని రూపొందించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే తమ న్యాయపరిధిలో లేని నిందితుల ట్రాన్సిట్ రిమాండ్ కోరేటప్పుడు కేస్ డైరీని సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది. -
అలా తాకితే లైంగిక వేధింపులు కాదు: కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే సంస్థల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ అలాగనీ ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) మాజీ సైంటిస్టుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా గురువారం జస్టిస్ విభు భక్రూ ఆ తీర్పును వెల్లడించారు. సహోద్యోగినిని ఆయన తాకారని, కానీ అప్పుడు జరిగిన విషయాన్ని వేధింపులుగా చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 'కార్యాలయాల్లోగానీ ఇతర ఏదైనా సంస్థల్లోగానీ విధులలో భాగంగా పొరపాటున పురుష, మహిళా ఉద్యోగులు పరస్పరం ఒకరినొకరు తాకే అవకాశాలున్నాయి. అలా తాకినంత మాత్రానా ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులు జరిగినట్లుగా చూడలేం. చెడు ఉద్దేశంతో మహిళలను బలవంతంగా తాకడం లైంగిక వేధింపులకు దారి తీసే అవకావం ఉంది. అలాంటి సందర్భాల్లో బాధిత మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు'నంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విభు బక్రూ తెలిపారు. 2005 ఏప్రిల్ లో సహోద్యోగి తనను తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళా సైంటిస్ట్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 'నేను ల్యాబ్‌లో పని చేస్తుండగా నా సహోద్యోగి గదిలోకి వచ్చాడు. నా చేతిని పట్టుకుని లాగాడు. చేతిలో ఉన్న శాంపిల్స్ ను తీసుకుని కింద పడేశాడు. ఆపై రూము నుంచి బయటకు నెట్టేశాడంటూ' మహిళా సైంటిస్ట్ తన సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. 'ఆ (పురుష) సైంటిస్ట్ ఆమె చేసిన పనిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆవేశంలో ఆమెను చేతి పట్టుకుని లాగినట్లు అర్థం చేసుకోవచ్చు. తాకడాన్ని సాకుగా చూపించి లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేయడం సబబుకాదని, వేధింపులు నిజంగానే జరిగితే కఠిన శిక్షలు విధిస్తామని' ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన మహిళా సైంటిస్ట్‌ను మందలించినట్లు తెలుస్తోంది. -
శారీరక, మానసిక పరిణతి వచ్చాకే శృంగారం
శారీరక, మానసిక పరిణతి వచ్చిన తర్వాతే శృంగారానికి తగిన సందర్భమని వక్తలు అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి వివాహ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘శృంగారానికి అంగీకార వయస్సు’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం, తరుణి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు రాధిక, సెక్సాలజిస్టు డాక్టర్ భారతి, జర్నలిస్టు తేజస్విని, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు శృత కీర్తి, ఏపీబాలల హక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అచ్యుత్‌రావు, విజయారెడ్డి, తరుణీ సంస్థ డెరైక్టర్ మమతా రఘువీర్, రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధి విజయలక్ష్మి, విశ్లేషకులు ప్రమీల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.