సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే సంస్థల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ అలాగనీ ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) మాజీ సైంటిస్టుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా గురువారం జస్టిస్ విభు భక్రూ ఆ తీర్పును వెల్లడించారు. సహోద్యోగినిని ఆయన తాకారని, కానీ అప్పుడు జరిగిన విషయాన్ని వేధింపులుగా చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
'కార్యాలయాల్లోగానీ ఇతర ఏదైనా సంస్థల్లోగానీ విధులలో భాగంగా పొరపాటున పురుష, మహిళా ఉద్యోగులు పరస్పరం ఒకరినొకరు తాకే అవకాశాలున్నాయి. అలా తాకినంత మాత్రానా ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులు జరిగినట్లుగా చూడలేం. చెడు ఉద్దేశంతో మహిళలను బలవంతంగా తాకడం లైంగిక వేధింపులకు దారి తీసే అవకావం ఉంది. అలాంటి సందర్భాల్లో బాధిత మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు'నంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విభు బక్రూ తెలిపారు.
2005 ఏప్రిల్ లో సహోద్యోగి తనను తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళా సైంటిస్ట్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 'నేను ల్యాబ్‌లో పని చేస్తుండగా నా సహోద్యోగి గదిలోకి వచ్చాడు. నా చేతిని పట్టుకుని లాగాడు. చేతిలో ఉన్న శాంపిల్స్ ను తీసుకుని కింద పడేశాడు. ఆపై రూము నుంచి బయటకు నెట్టేశాడంటూ' మహిళా సైంటిస్ట్ తన సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. 'ఆ (పురుష) సైంటిస్ట్ ఆమె చేసిన పనిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆవేశంలో ఆమెను చేతి పట్టుకుని లాగినట్లు అర్థం చేసుకోవచ్చు. తాకడాన్ని సాకుగా చూపించి లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేయడం సబబుకాదని, వేధింపులు నిజంగానే జరిగితే కఠిన శిక్షలు విధిస్తామని' ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన మహిళా సైంటిస్ట్‌ను మందలించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment