నేరాల్లో యూపీ టాప్‌ | Home Minister Shri Rajnath Singh releases NCRB Publication Crime in India 2016- Statistics | Sakshi
Sakshi News home page

నేరాల్లో యూపీ టాప్‌

Published Fri, Dec 1 2017 1:55 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

Home Minister Shri Rajnath Singh releases NCRB Publication Crime in India 2016- Statistics - Sakshi

న్యూఢిల్లీ: జనాభాలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ నేరాల్లోనూ పెద్ద పేరే సంపాదించింది. హత్యలు, మహిళలపై నేరాలు వంటివి 2016లో ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా నమోదయ్యాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా రేప్‌లు జరిగినట్లు తెలిపింది. అలాగే విదేశీయులకు ఢిల్లీ ఏ మాత్రం సురక్షితం కాదని కుండ బద్దలు కొట్టింది. 2016లో చోటుచేసుకున్న నేరాలను 2015తో పోలుస్తూ ఎన్‌సీఆర్‌బీ రూపొందించిన సమగ్ర నివేదికను గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. అందులోని వివరాలు...

► జనాభాలో అగ్ర స్థానంలో ఉన్న యూపీలో 2016లో అత్యధికంగా 4889 హత్యలు జరిగాయి. ఇది మొత్తం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వాటిలో 16.1 శాతానికి సమానం. తరువాతి స్థానంలో బిహార్‌ (2581 హత్యలు–8.4%) ఉంది.

► మహిళలపై నేరాలకు సంబంధించి యూపీలో 49,262(14.5%) కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 32,513 (9.6) కేసులు నమోదయ్యాయి.

► దేశవ్యాప్తంగా రేప్‌ కేసులు 2015తో పోల్చితే 12.4 శాతం పెరిగాయి.

► రేప్‌ కేసుల్లో మధ్యప్రదేశ్‌(4882), యూపీ (4816), మహారాష్ట్ర(4,189) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

► ఐపీసీ కింద నమోదైన కేసుల్లో 9.5 శాతం యూపీలోనే ఉన్నాయి. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్‌ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ(8.7%) ఉన్నాయి.

► హత్యా నేరాలు గత మూడేళ్లుగా తగ్గుతున్నాయి. 2015తో పోలిస్తే 2016లో ఇవి 5.2 శాతం పడిపోయాయి.

► అపహరణ కేసులు 6 శాతం పెరిగాయి.

► పిల్లలపై నేరాలు 13.6 శాతం పెరిగాయి.

► షెడ్యూల్డ్‌ కులాలపై దాడులు 5.5%, షెడ్యూల్డ్‌ తెగలపై 4.7 శాతం పెరిగాయి. యూపీలోనే ఎస్సీలపై దాడులు అత్యధికంగా 25.6% నమోదవగా, తరువాతి స్థానంలో బిహార్‌ (14%), రాజస్తాన్‌ (12.6%) ఉన్నాయి. ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1823(27.8 శాతం) కేసులు నమోదయ్యాయి.  

► వేర్వేరు నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 37,37, 870 మంది అరెస్టవగా, 32,71,262 మందిపై చార్జిషీట్‌ నమోదుచేశారు. ఇందులో 7,94,616 మంది దోషులుగా తేలగా, 11,48,824 మంది నిర్దోషులుగా బయటపడ్డారు.

► దేశంలోని మెట్రో నగరాల్లో చూస్తే ఒక్క ఢిల్లీలోనే 40% రేప్‌ కేసుల నమోదు.

► మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల్లో ఢిల్లీలోనే 33 శాతం చోటుచేసుకోగా, ముంబైలో 12.3% కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐపీసీ కేసుల్లో ఢిల్లీ వాటా 38.8 శాతం కాగా, బెంగళూరులో 8.9 శాతం, ముంబైలో 7.7% చొప్పున నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement