రివాజుకు భిన్నంగా నాలుగు నెలలు ఆలస్యంగా వెలువడిన జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఎప్పటిలా మన నాగరిక సమాజంలోని చీకటి కోణాలను బయటపెట్టింది. నిర్భయలాంటి కఠిన చట్టం అమల్లోకి తెచ్చినా మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గకపోగా అవి ఏటికేడాదీ పెరుగుతూ పోతున్నాయని గణాంక సహితంగా వివరించింది. 2016లో జరిగిన వివిధ రకాల నేరాలపై ఈ నివేదిక వెల్లడించిన గణాం కాలను గమనిస్తే పాలకుల మాటలకూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకూ పొంతన లేదని తేటతెల్లమవుతుంది.
అంతక్రితం సంవత్సరం మహిళలపై సాగిన వివిధ నేరాల సంఖ్య 3,29,000 ఉంటే... నిరుడు అది 3,38,000కు చేరుకుంది. నేరాల పెరుగుదల దాదాపు 3 శాతం ఉంది. పిల్లల విషయంలోనూ అంతే. 2015లో 94,000 కేసులు నమోదైతే... నిరుడు వాటి సంఖ్య 1,06,000. అంటే దాదాపు 13.5 శాతం అధికం. దేశంలో రోజుకు సగటున 106 అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇప్పటికీ అత్యాచార ఘటనల్లో ఢిల్లీదే తొలి స్థానమని గణాంకాలు వివరిస్తున్నాయి. మహిళల రక్షణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ విఫలమయ్యాయని నివేదిక చెబుతోంది. మహిళలను అగౌరవ పరచడంలో, కించపరచడంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గృహహింస కేసుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
మహిళలపై నేరాలు అరికట్టడానికి నిర్భయలాంటి కఠిన చట్టం తెచ్చి ఉండొచ్చు... తెలంగాణలో అయితే షీ టీమ్స్ వంటివి పనిచేస్తూ ఉండొచ్చు–కానీ ఆ చర్యలు వాటికవే మంచి ఫలితాలు తీసుకురాలేవు. నిందితులను సత్వరం అరెస్టు చేయడం మొదలుకొని దర్యాప్తు చురుగ్గా సాగడం, తిరుగులేని సాక్ష్యాధారాలు సేక రించడం, న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, విచారణ వేగవంతంగా జరి గేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం వరకూ అన్నీ సక్రమంగా సాగాలి. ఇందులో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మిగిలినవన్నీ కుప్పకూలుతాయి. నిందితులు తప్పిం చుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. నిజానికి మహిళల విషయంలో జరిగే నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడం సులభం. ఎందుకంటే దాదాపు 95 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసినవారేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అలాంటివారిని నిర్బంధించడంలో ఆలస్యం ఎందుకుండాలి? వారితో పోలీసులు కుమ్మక్కు కాకపోతే ఇది సాధ్యమేనా? ఈ తరహా కేసుల్లో జాప్యం జరిగేకొద్దీ బాధి తులపై ఒత్తిళ్లు పెరుగుతాయి. కేసులు పెట్టొద్దని, పెట్టినా నిందితులు సులభంగా బయటపడేలా చూడాలని అన్నిరకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తారు. మీడియాలో ఎంతో ప్రచారం జరిగిన కేసుల్లో కొంత చురుగ్గా కదిలి నిందితుల్ని పట్టుకున్నా మళ్లీ ఆ కేసుల దర్యాప్తులో మాత్రం యధావిధిగా ఆలస్యం తప్పడం లేదు. దీని ప్రభావం కేసుల విచారణపై పడుతోంది. నేర నిరూపణ అసాధ్యమై వారు సులభంగా తప్పించుకో గలుగుతున్నారు. ఇలాంటి పోకడలు నేరాలు మరింత పెరగడానికి దోహదపడు తున్నాయి.
ఇప్పుడు ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన నివేదికలోని గణాంకాలన్నీ నమోదైన కేసుల ఆధారంగా లెక్కేసినవే. చిట్టాలకెక్కని నేరాలు, ఘోరాలు మరిన్ని రెట్లు ఉంటాయి. బాధితులకు న్యాయం జరగకపోవడం, నేరగాళ్లు స్వేచ్ఛగా బయటి కొచ్చి బోర విరుచుకు తిరగడం గమనించి అనేకమంది అసలు పోలీస్ స్టేషన్ల గడప తొక్కేందుకే ఇష్టపడటం లేదు. వీటన్నిటి కారణంగానే నేరాలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగు తున్నాయి. మహిళల అపహరణ కేసులు 64,519 వరకూ నమోదయ్యాయి. ఈసారి నివేదికలో మరో ఆందోళనకరమైన విషయం పిల్లలపై జరిగే నేరాలకు సంబం ధించింది. 2015తో పోలిస్తే నిరుడు పిల్లలపై అత్యాచారాల ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదల 82 శాతం మించి ఉన్నదంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ మాదిరి కేసులు 2015లో 10,854 ఉంటే... నిరుడు వాటి సంఖ్య ఒక్కసారిగా 19,765కు చేరుకుంది. ఇలాంటి కేసుల్లో తెలంగాణలో ఎక్కువున్నాయి. ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనబడుతోంది.
మహిళలు, పిల్లల తర్వాత నేరాల బారినపడుతున్న వర్గాల్లో దళితుల సంఖ్య అధికం. ఈ తరహా కేసుల్లో ఎప్పుడూ ఉత్తరప్రదేశ్, బిహార్‌లు అగ్రస్థానంలో ఉంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. గతానికి భిన్నంగా ఈసారి మెట్రోపాలిటన్ నగరాల్లో దళితులపట్ల వివక్షకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ తొలిసారి గణాంకాలు విడుదల చేసింది. గ్రామాలతో పోలిస్తే నగరాల్లో కుల వివక్ష పెద్దగా ఉండదన్న అభిప్రాయం తప్పని ఈ నివేదిక చెబుతోంది. దళితులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉత్తరప్రదేశ్ 10,426తో మొదటి స్థానంలో ఉంటే... 5,701తో బిహార్ రెండో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో 262 కేసులతో, బిహార్ రాజధాని పట్నా 241 కేసులతో వరసగా ఒకటి, రెండు స్థానాలు ఆక్రమించాయి. హైదరాబాద్ 139 కేసులతో ఈ విషయంలో అయిదో స్థానంలో ఉంది. రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2,335 కేసులతో అయిదో స్థానంలోనూ, తెలంగాణ 1,529 కేసులతో తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. దళితులపై జరిగే నేరాల్లో బాధితులు ఎక్కువగా మహిళలేనని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడిస్తోంది.
మాటలతోనూ, కంటితుడుపు చర్యలతోనూ పరిస్థితి మారదని ఈ నివేదిక చూశా కైనా ప్రభుత్వాలకు అర్ధం కావాలి. నేరగాళ్లపై ఉక్కు పాదం మోపడం తప్ప పరిస్థితి మెరుగుపడటానికి వేరే అడ్డదారులేమీ ఉండవు. దర్యాప్తు సంస్థల్లోనివారి పనితీరుపై సరైన పర్యవేక్షణ, కేసుల విచారణ వేగవంతమయ్యేలా చూడటం, కేసుల నుంచి నిందితులు బయటపడిన సందర్భాల్లో అలా ఎందుకు జరిగిందో లోతుగా ఆరాతీసి జవాబుదారీతనాన్ని నిర్ధారించి చర్యలు తీసుకోవడం అవసరం. లేకుంటే సమాజంలో అరాచక పరిస్థితులేర్పడతాయని, నేరాలు మరింత పెరుగుతాయని పాలకులు గుర్తిం చాలి. ఏటా విడుదలయ్యే ఎన్‌సీఆర్‌బీ నివేదికలు ప్రభుత్వాల పనితీరుకు సంబంధిం చిన వార్షిక ఫలితాల వంటివి. అందులో కనీసం అత్తెసరు మార్కులైనా తెచ్చుకునేం దుకు ఎవరూ ప్రయత్నించడం లేదని తాజా నివేదిక చెబుతోంది. ఇది సిగ్గుచేటైన విషయం. పాలకుల తీరు మారాలి.
Comments
Please login to add a commentAdd a comment