బూచోళ్లు పెరిగారు  | National Crime Records Bureau Releases Crime Report Of Telangana | Sakshi
Sakshi News home page

బూచోళ్లు పెరిగారు 

Published Fri, Jan 10 2020 2:11 AM | Last Updated on Fri, Jan 10 2020 2:11 AM

National Crime Records Bureau Releases Crime Report Of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బూచోళ్లు పెరిగారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2018 గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 2017తో పోల్చినప్పుడు 2018లో కిడ్నాప్‌లు, చిన్నారులపై అఘాయిత్యాల్లో పెరుగుదల కనిపించింది. హత్యలు, ఆర్థిక నేరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో గణనీయమైన తగ్గుదల నమోదవ్వడం విశేషం. తీవ్ర నేరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పెరుగుదల కనిపించడం గమనార్హం. అన్ని రకాల నేరాల్లో అత్యధిక కేసు లు నమోదైన ఉత్తర్‌ప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2018లో జరిగిన నేరాలను పరిశీలిస్తే..

రాష్ట్రంలో రోజుకు 347 కేసులు..  
ఐపీసీ సెక్షన్ల దృష్ట్యా మహారాష్ట్ర 3,46,291 కేసుల నమోదుతో అగ్రస్థానంలో ఉండగా.. ఇది జాతీయ వాటాలో 11.1% ఉంది. ఇక తెలంగాణలో 2018లో 1,13,951 నేరాలు నమోదవ్వగా, జాతీయావాటాలో 3.6%. 2017 లో 1,19,858గా ఉంది. 2018లో ఈ నేరాల్లో 5,907 కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2018లో 1,13,951 ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్‌ (స్పెషల్‌ లోకల్‌ లా) కింద 12,907 కేసుల మొత్తం 1,26,858 కేసులు అవుతాయి. సగటున రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 347 కేసులు నమోదయ్యాయి.

తీవ్రమైన నేరాల్లో యూపీదే అగ్రస్థానం 
తీవ్రమైన నేరాల జాబితాలో 65,155 నేరాలతో జాతీయ వాటాలో 15.2 శాతంతో దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2018లో తెలంగాణలో 7,652 తీవ్ర నేరాలు నమోదవ్వగా.. మన జాతీయవాటా 1.8 శాతంగా ఉంది. 2017లో ఈ సంఖ్య 7,633గా నమోదైంది. 2018లో 19 కేసులు అధికంగా నమోదయ్యాయి.

తెలంగాణలో తగ్గిన హత్యలు.. 
4,018 హత్యకేసులతో 13.8% జాతీయవాటాతో ఉత్తర్‌ప్రదేశ్‌ తొలిస్థానంలో నిలిచింది. 2018లో 786 హత్య కేసులతో తెలంగాణ 2.7 శాతం జాతీయ వాటా నమోదు చేసింది. 2017లో 807 హత్య కేసులు నమోదయ్యాయి. 2018లో 21 కేసులు తక్కువగా నమోదయ్యాయి.

కిడ్నాప్‌ల్లోనూ యూపీనే.. 
21,711 కిడ్నాప్‌లతో దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ 20.5% తో తొలిస్థానంలో నిలిచింది. 2018లో తెలంగాణలో 1,810 కిడ్నాప్‌ కేసులతో 1.7% నమోదు చేసింది. 2017లో 1,560 కేసులు నమోదు కాగా.. 2018లో 210 కేసులు అధికంగా నమోదయ్యాయి.

రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య 16,027..  
59,445 మహిళలపై నేరాలతో 15.7% వాటాతో యూపీనే టాప్‌. 2018లో తెలంగాణ 16,027 నేరాలతో 4.2 శాతం జాతీయ వాటా నమోదైంది. 2017లో తెలంగాణలో 17,521 నేరాలు నమోదయ్యాయి. ఈ లెక్కన 2018లో 1,494 నేరాలు తక్కువగా నమోదయ్యాయి.  ఆరు గ్యాంగ్‌రేప్‌ అనంతరం హత్య ఘటనలు కాగా, 186 వరకట్న చావులు, 459 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8 గర్భవిచ్ఛిత్తి కేసులు , 10 మంది మహిళలపై యాసిడ్‌ దాడులు, 5 యాసిడ్‌ దాడి యత్నాలు, భర్త, అత్తింటి వేధింపులు 6,286 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో పెరిగిన చిన్నారులపై అకృత్యాలు..  
చిన్నారులపై అకృత్యాల్లో 19,936 నేరాల నమోదు (14.1 శాతం జాతీయ వాటా)తో యూపీ టాప్‌లో నిలిచింది. 2018లో తెలంగాణ 3,747 నేరాలతో 2.6 శాతం జాతీయ వాటా నమోదైంది. 2017లో తెలంగాణలో 3,580 నేరాలు నమోదుకాగా.. 2018లో 167 కేసులు అధికంగా నమోదయ్యాయి.

బాలనేరస్తుల్లో మహారాష్ట్ర టాప్‌.. 
5,880 మంది బాలలు నేరాలకు పాల్పడ్డ మహారాష్ట్ర 18.6 శాతం జాతీయ వాటాతో తొలిస్థానంలో నిలిచింది. 2018లో 1,408 మంది బాల నేరస్తులపై కేసులతో 4.5 శాతం జాతీయ వాటాను తెలంగాణ నమోదు చేసింది. 2017లో ఈ గణాంకాలు 1,365గా ఉన్నాయి. ఈసారి 43 నేరాలు అధికంగా నమోదయ్యాయి.

సీనియర్‌ సిటిజన్లపై కూడా.. 
సీనియర్‌ సిటిజన్లపై 5,961 నేరాలు, 24.5 శాతం జాతీయవాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ విషయానికి వస్తే.. 1,062 నేరాలతో 4.4 శాతం జాతీయవాటాగా నమోదైంది. 2017లో తెలంగాణలో ఈ నేరాల సంఖ్య 1,308గా ఉంది. 2018 లో 246 కేసులు తక్కువగా నమోదయ్యాయి.

రాష్ట్రంలో పెరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 
11,924 కేసులతో 27.9 శాతం జాతీయవాటాతో యూపీ టాప్‌లో నిలిచింది. 2018లో 1,507 కేసులతో తెలంగాణ 3.5% నమోదుచేసింది. 2017లో ఈ కేసుల సంఖ్య 1466గా నమోదైంది. ఈసారి 41 కేసులు పెరిగాయి. 

సైబర్‌ నేరాల్లో తెలంగాణ వాటా 6.6 శాతం 
22,822 ఆర్థిక నేరాల (14.6 శాతం)తో యూపీ జాతీయవాటాలో అగ్రస్థానం దక్కించుకుంది. 2018లో తెలంగాణ 10,390 నేరాలతో 6.6%  నమోదు చేసింది. 2017లో ఈ నేరాల సంఖ్య 10,840గా ఉంది. 2018లో 450 కేసులు తక్కువగా నమోదయ్యాయి.

సైబర్‌క్రైమ్స్‌లో యూపీదే 23%.. 
6,680 సైబర్‌ నేరాల (23 శాతం)తో యూపీ టాప్‌లో ఉంది. 2018లో తెలంగాణ 1,205 నేరాలు, 4.4  నమోదు చేసింది. 2017లో ఈ నేరాల సంఖ్య 1,209గా ఉంది. అంటే 4 నేరాలు తక్కువగా నమోదయ్యాయి.

మానవ అక్రమరవాణాపై రాష్ట్రంలో 242 కేసులు 
373 మానవ అక్రమరవాణా కేసులతో 15.1 శాతం జాతీయవాటాతో జార్ఖండ్‌ తొలిస్థానంలో నిలవగా.. 2018లో తెలంగాణ 242 కేసులతో 9.8 శాతం జాతీయ వాటా నమోదైంది.

మైనర్ల అదృశ్యం కేసుల్లో మధ్యప్రదేశ్‌ టాప్‌.. 
మైనర్ల అదృశ్యం కేసుల్లో 15,320 కేసులతో మధ్యప్రదేశ్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక రాష్ట్రంలో 2018లో 4,410 మంది మైనర్ల (2,668 బాలికలు, 1,742 బాలురు) అదృశ్యం కేసులు నమోదయ్యాయి. మేజర్ల విషయానికొస్తే.. 5,992 మంది (2,919 మహిళలు, 3,073 పురుషులు) అదృశ్యమయ్యారు. వీరిని తిరిగి కనిపెట్టే విషయంలో పెద్ద రాష్ట్రాల్లో 75% పురోగతితో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

తెలంగాణ 13,233 మంది ఆత్మహత్యలు.. 
 రాష్ట్రంలో 2018లో 13,233 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది జాతీయవాటాలో 5.8%. 2016 నుంచి 2018 వరకు మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు చూసినపుడు అండమాన్‌ నికోబార్‌ 41.0తో అగ్రస్థానంలో ఉండగా.. 21.2 రేటుతో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న ఆత్మహత్యలకు 30.4%తో కుటుంబ సమస్యలే ప్రధాన కారణంగా నిలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement