గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గిన ప్రభుత్వ రాబడి
నవంబర్ నెలాఖరుకు రూ.1.41 లక్షల కోట్లు దాటిన ఆదాయం
గత ఏడాది ఇదే సమయానికి 1.49 లక్షల కోట్ల రాబడి
పన్నేతర ఆదాయం, ఎక్సైజ్ పద్దుల్లో ఈసారి తగ్గుదల
రాబడులపై దృష్టి కేంద్రీకరించకపోతేలోటు తప్పదంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు ముగిసే నాటికి (నవంబర్ 30, 2024 వరకు) అన్ని రకాల రాబడులు కలిపి రూ.1,41,178 కోట్లు వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడుల కింద అంచనా వేసిన రూ.2.74 లక్షల కోట్లలో ఇది 51.51 శాతం కావడం గమనార్హం.
కాగా గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో నవంబర్ నెల ముగిసేసరికి రూ.1,49,316.41 కోట్లు రావడం గమనార్హం. గత ఏడాది మొత్తం అంచనాల్లో ఇది 57.46 శాతం కాగా, ప్రస్తుత 8 నెలల కాలంలో రూ.8 వేల కోట్ల మేర రాబడులు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భారీగా తగ్గిన పన్నేతర ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ రాబడులకు సంబంధించిన కీలకమైన పద్దుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పన్నేతర ఆదాయంలో భారీగా క్షీణత నమోదైంది. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల మైనింగ్, యూజర్ చార్జీలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సమకూరే ఆదాయాన్ని పన్నేతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఈ పద్దు కింద 2023–24లో నవంబర్ నెల ముగిసే సమయానికి రూ.19,524.69 కోట్లు సమకూరింది. అదే ప్రస్తుత సంవత్సరంలో మాత్రం కేవలం రూ. 5,217.26 కోట్లు మాత్రమే వచ్చింది.
వాస్తవానికి 2024–25లో రూ.35,208 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అందులో దాదాపు 15 శాతం మాత్రమే సమకూరడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 8 నెలల్లో రూ.14,607 కోట్లు రాగా, ఈ ఏడాదిలో రూ.2 వేల కోట్లు తక్కువగా రూ.12,364 కోట్లు వచ్చింది.
అయితే జీఎస్టీ పద్దు కింద గత ఏడాది కంటే రూ.3 వేల కోట్లు, అమ్మకపు పన్ను కింద రూ.1.500 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.3 వేల కోట్లు అధికంగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.200 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అప్పులు కూడా గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గినా బడ్జెట్ అంచనాల్లో 72 శాతం ఇప్పటికే సమకూరడం గమనార్హం.
నాలుగు నెలల్లో రాబడి వస్తుందా?
ప్రస్తుత లెక్కల ప్రకారం నవంబర్ తర్వాత మిగిలిన నాలుగు నెలల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.30 లక్షల కోట్లకు పైగా రాబడులు ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సి ఉంది. అయితే గత ఏడాది చివరి నాలుగు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా మాత్రమే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బడ్జెట్ అంచనాలకు, రాబడులకు భారీ లోటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చివరి నాలుగు నెలల్లో రూ.80 వేల కోట్ల మేర రాబడులు వస్తాయని ఆశించినా, కనీసం మరో రూ.20–30వేల కోట్లు ఇతర మార్గాల్లో సమకూర్చుకోకపోతే బడ్జెట్ లెక్కలు తప్పుతాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, భూముల అమ్మకాలు, మైనింగ్ ఆదాయం పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని వారు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment