రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 60 శాతం వాటా నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సేవల రంగం వాటానే సింహ భాగమని తేలింది. 2023–24లో జీఎస్‌డీపీ రూ.15,01,981 కోట్లు కాగా, ఇందులో సేవల రంగం వాటా రూ.9,23,490 కోట్లుగా నమోదయింది. అంటే మొత్తం స్థూల ఉత్పత్తిలో 60 శాతం సేవల రంగం నుంచే నమోదైందన్న మాట. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా రూ.2,86,010 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల స్థూల ఉత్పత్తిని ప్రస్తు త ధరల ఆధారంగా నిర్ణయించగా..ఈ స్థూల ఉత్పత్తిలో ఏ రంగం ఏ మేరకు వాటా నమోదు చేసిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన ‘స్టాటిస్టిటక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024’నివేదిక వెల్లడించింది.
దీని ప్రకారం 2014– 15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.5,05,848 కోట్లు కాగా, 2023–24కి అది రూ.15,01,981 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2022–23)లో రూ.13,11,823 కోట్లు ఉన్న జీఎస్‌డీపీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.9 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
రెట్టింపు కంటే ఎక్కువగా వ్యవసాయ రంగం వృద్ధి
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం జీఎస్‌డీపీలో సేవల రంగం తర్వాతి స్థానంలో పరిశ్రమల రంగం నిలిచింది. 2023–24లో పరిశ్రమల రంగ స్థూల ఉత్పత్తి రూ.2,05,399 కోట్లుగా నమోదయ్యింది. 2014–15లో ఇది రూ.88,792 మాత్రమే కావడం గమనార్హం. ఇక, తయారీ, నిర్మాణ రంగాలు కూడా గత పదేళ్ల స్థూల ఉత్పత్తిలో చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేశాయి.
తయారీ రంగం స్థూల ఉత్పత్తి 2014–15లో రూ.54,533 కోట్లు ఉండగా, 2023–24 నాటికి రూ.1,23,325 కోట్లకు చేరింది. నిర్మాణ రంగం వాటా రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రూ. 27,786 కోట్లు ఉంటే.. 2023–24 నాటికి రూ.71,708 కోట్లకు చేరింది.
ఇలావుండగా వ్యవసాయ రంగం పదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగానే వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2014–15లో జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా రూ.41,706 కోట్లు ఉండగా, 2023–24 నాటికి రూ.1,02,359 కోట్లుగా నమోదయింది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగానే వృద్ధి
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుత ధరలకు అనుగుణంగా తెలంగాణ జీఎస్‌డీపీ, వివిధ రంగాల వాటాల వృద్ధి బాగానే ఉందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. రూ.5 లక్షల కోట్లకు పైగా ఉన్న తెలంగాణ స్థూల ఉత్పత్తి పదేళ్ల తర్వాత రూ.15 లక్షల కోట్లు దాటింది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడు రూ.10 లక్షల కోట్ల నుంచి పదేళ్లలో రూ. 27 లక్షల కోట్లకు స్థూల ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్ప త్తి రూ.5.24 లక్షల కోట్ల నుంచి రూ.14.39 లక్ష ల కోట్లకు పెరిగింది. కర్ణాటక జీఎస్‌డీపీ 2014– 15లో రూ.9.13 లక్షల కోట్లు ఉండగా, 2023– 24 నాటికి రూ.25 లక్షల కోట్లకు చేరింది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 60 శాతం వాటా నమోదు
2023–24లో జీఎస్‌డీపీ రూ.15,01,981 కోట్లు
ఇందులో సేవల రంగం వాటా 9,23,490 కోట్ల రూపాయలు
2014–15లో ఇది రూ.2.86 లక్షల కోట్లే
సేవల రంగం తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం.. ఆర్‌బీఐ ‘స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024’నివేదిక వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment