ఆంధ్రా ఆదాయం రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా పది నెలల్లో అన్ని రకాల ఆదాయం కలిపి రూ.60 వేల కోట్లు రానున్నట్లు అధికార వర్గాలు అంచనా వేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ మిగుల్లో ఉండగా, ద్రవ్య లోటు కూడా నిబంధనలకు మించకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం లోపే ఉండేది. విభజన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా పది నెలల్లో ఆంధ్రప్రదేశ్కు ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో ఎంత ఆదాయం వస్తుందో అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర సొంత పన్నుల రూపంలో రూ.27 వేల కోట్లు, రాష్ట్ర పన్నేతర రంగం ద్వారా రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కకట్టారు. ఇక కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.