
న్యూఢిల్లీ: 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్‌లు! ఒక్కరోజులో భారతదేశం మొత్తమ్మీద నమోదవుతున్న నేరాలు ఘోరాల సగటు ఇది. 2018లో దేశంలో జరిగిన నేరాలపై∙నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక చెబుతున్న కఠోర వాస్తవం ఇది. 2018లో మొత్తమ్మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువైంది. అయితే ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం 388.6 (2017) నుంచి 383.5(2018)కు తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో తెలిపింది.
ఎక్కువైన వ్యవసాయ రంగం ఆత్మహత్యలు
వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గత ఏడాది సుమారు 10,349 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది. దేశం మొత్తమ్మీద వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్న వారు 7.7 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2017 సంవత్సరం నాటి రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో ఆత్మహత్యలు 3.6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ‘పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయా, గోవా, చండీగఢ్, దామన్ అండ్ దయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చెరిలలో రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదు’ అని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. వ్యవసాయ కూలీఉలు మొత్తం 4,586 మంది ఆత్మహత్యలకు పాల్పడగా వీరిలో 4071 మంది పురుషులు, 515 మంది మహిళలు ఉన్నారు. అన్ని రకాల ఆత్మహత్యల్లో 17,972తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తమిళనాడు (13,896), పశ్చిమబెంగాల్ (13,255) రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
వివాదాలతోనే ఎక్కువ హత్యలు
2018లో 29,017 హత్య కేసులు నమోదయ్యాయని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.7 శాతం ఎక్కువని నివేదిక తెలిపింది. వివాదాల కారణంగా జరిగిన హత్యలు 9,623 కాగా, వ్యక్తిగత ద్వేషం, పగ వంటి కారణాలతో 3,875 మంది హత్యకు గురయ్యారు. లాభం కోసం చేసిన హత్యల సంఖ్య 2,995. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగి 1.05 లక్షలకు చేరింది. కిడ్నాపైన వారిలో 80 వేల కంటే ఎక్కువ మంది మహిళలు కాగా, పురుషుల సంఖ్య 24,665 మాత్రమే. అంతేకాదు.. కిడ్నాపైన మొత్తం 1.05 లక్షల మందిలో 63,356 మంది బాలబాలికలు కావడం గమనార్హం. కిడ్నాపైన వారిలో 92,137 మంది (22,755 మంది పురుషులు, 69, 382 మంది మహిళలు)ని పోలీసులు కిడ్నాప్ చెర నుంచి విడిపించగలిగారు. మొత్తం 91, 709 మందిని సజీవంగా వెనక్కు తీసుకు రాగలిగితే.. 428 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment